Param Sundari: జాన్వీ కపూర్ నోట ఐకాన్ స్టార్ మాట
ABN, Publish Date - Aug 13 , 2025 | 12:00 PM
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం 'పరమ్ సుందరి'. ఈ సినిమా ట్రైలర్ ను చూసిన అల్లు అర్జున్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. కారణం ఏమిటో తెలుసా...
కొన్ని సినిమాలు, అందులో హీరో చేసే మేనరిజమ్స్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోతుంటాయి. అలా తన మేనరిజమ్స్ తో అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి రజనీకాంత్. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలు, అందులోని ప్రధానమైన పాయింట్, హీరో బాడీ లాంగ్వేజ్ కూడా సరిహద్దులను చెరిపేసి దేశం మొత్తం పాకిపోతోంది. 'బాహుబలి' (Baahubali) ప్రధమభాగం వచ్చినప్పుడు 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. దేశ ప్రధానితో సహా పలువురు సందర్భానుసారం ఆ పాయింట్ ను తమ ఉపన్యాసాలలో ఉపయోగించేశారు. అలానే 'పుష్ప' (Pushpa) విడుదలైన తర్వాత 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... ఫైర్' అనే మాట కూడా పాపులర్ అయిపోయింది. దాన్ని వివిధ భాషల్లో అనువదించి మరీ జనాలు బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.
ఇక తాజాగా జాన్వీ కపూర్ (Janhvi Kapor), సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన 'పరమ్ సుందరి' (Param Sundari) ట్రైలర్ విడుదల కాగానే తెలుగు సినిమా ఐకాన్ గా అల్లు అర్జున్ (Allu Arjun) మారిపోయాడనే ప్రచారం బాగా సోషల్ మీడియాలో జరుగుతోంది. సౌతిండియన్ హీరోల గురించి జాన్వీ కపూర్ ప్రస్తావిస్తూ, 'మోహన్ లాల్... మలయాళం, రజనీకాంత్... తమిళ్, అల్లు అర్జున్... తెలుగు, యశ్... కన్నడ' అంటూ ఆయా ప్రాంతాల చిత్రసీమకు వీళ్ళే ఐకాన్ అన్నట్టుగా డైలాగ్ విత్ బాడీ లాంగ్వేజ్ తో చెప్పేసింది. తెలుగులో ఇంతమంది సూపర్ స్టార్స్ ఉన్నా... జాన్వీ కపూర్ తో 'పరమ్ సుందరి' డైరెక్టర్ తెలుగు చిత్రసీమ ఐకాన్ అల్లు అర్జున్ అని చెప్పించడంతో అభిమానులంతా ఖుషీ అయిపోతున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో మలయాళీ సుందరి పాత్రను పోషిస్తోంది. సౌత్ హీరోలు, నార్త్ హీరోలనే బేధాభిప్రాయాలు వద్దని, అందరూ ఇండియన్ హీరోలే అని చెప్పే సందర్భంలో ఆమె ఇక్కడి హీరోల పేర్లను, వాడి బాడీ లాగ్వేజ్ ను అనుకరించింది.
ఇదిలా ఉంటే... జాన్వీ కపూర్ ఇప్పటికే తెలుగులో జూ. ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలో నటించింది. దీని సీక్వెల్ లోనూ ఆమె నటించాల్సి ఉంది. అలానే రామ్ చరణ్ 'పెద్ది'లోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. కానీ ఈ ఇద్దరు హీరోల పేర్లు చెప్పకుండా అల్లు అర్జున్ పేరునే తెలుగు సినిమా రంగానికి ముడిపెట్టడం వెనుక ఏం ప్లాన్ ఉండి ఉంటుందా? అని కొందరు సందేహాలు వెలుబుచ్చుతున్నారు. అల్లు అర్జున్ సరసన నటించాలని కోరుకుంటున్న జాన్వీ కపూర్ మనసులో మాట గ్రహించే... 'పరమ్ సుందరి' రైటర్ ఆమె నోట ఐకాన్ స్టార్ పేరు పలికించాడని అంటున్నవారూ లేకపోలేదు. జాన్వీ కోరిక కూడా త్వరలోనే నెరవేరుతుందేమో చూద్దాం.
Also Read: Venkatesh Maha: 'రావు బహదూర్'గా 'మర్మాణువు'
Also Read: Akkineni Venkat: ఆగిపోయిన డైరెక్షన్ డెబ్యూ మూవీ