Venkatesh Maha: 'రావు బహదూర్'గా 'మర్మాణువు'

ABN , Publish Date - Aug 13 , 2025 | 10:45 AM

నాలుగేళ్ళ క్రితం వెంకటేశ్ మహా... డాక్టర్ రాజశేఖర్ తో చేయాలనుకున్న సినిమాను ఇప్పుడు సత్యదేవ్ తో తెరకెక్కిస్తున్నారు.

Satyadev Movie

తొలి చిత్రం 'కేరాఫ్ కంచరపాలెం' (C/o Kancharapalem) తోనే దర్శకుడుగా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేశ్‌ మహా. ఆ సినిమాకు ప్రేక్షకుల రివార్డులతో పాటు అవార్డులూ లభించాయి. ఆ తర్వాత అదే ఉత్సాహంతో మలయాళ చిత్రం 'మహేశ్‌ ఇంటే ప్రతికారం' సినిమాను 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' (Uma Maheswara Ugra Roopasya) పేరుతో రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాలను నిర్మించింది ఇటీవల విడుదలైన 'కొత్తపల్లిలో ఒకప్పుడు' నిర్మాత విజయ ప్రవీణ పరుచూరి (Vijaya Praveena Paruchuri). అయితే ఈ రెండో సినిమా కొవిడ్ కారణంగా ఓటీటీలో స్ట్రీమింగ్ జరిగింది. ఇందులో సత్యదేవ్ (Satyadev) తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్రను అద్భుతంగా పోషించాడు.

ఆ తర్వాత ఒక సంవత్సరానికి వెంకటేశ్ మహా దర్శకత్వంలోనే విజయ ప్రవీణ్‌ పరుచూరి... రాజశేఖర్ హీరోగా ఓ సినిమా నిర్మించాలనుకున్నారు. దానికి రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. ఆ సినిమా పేరు 'మర్మాణువు'. ఈ సినిమాను 2021 మార్చి 25న దర్శకుడు వెంకటేశ్‌ మహా పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. ఈ సినిమా కథా కథనాలు అన్ని భాషల వారినీ ఆకట్టుకుంటాయని, రాజశేఖర్ కు ఇది సమ్ థింగ్ స్పెషల్ క్యారెక్టర్ అవుతుందని తెలిపారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో, తెర వెనుక ఏమైందో తెలియదు. ఈ సినిమా సెట్స్ మీదకు రాలేదు. బడ్జెట్ కారణంగా ఇది వర్కౌట్ కాదని, ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. చూస్తుండగానే నాలుగేళ్ళు గడిచిపోయాయి.


కట్ చేస్తే... ఇప్పుడు అదే కథతో వెంకటేశ్‌ మహా... సత్యదేవ్ హీరోగా ఈ సినిమాను తిరిగి పట్టాలెక్కించారు. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నూ విడుదల చేశారు. 'రావు బహదూర్' (Rao Bahadur) అనే ఈ సినిమా పోస్టర్ చూసిన వారు సత్యదేవ్ లుక్ చూసి ఆశ్చర్యపోయారు. సత్యదేవ్ ఇంతా మేకోవర్ చేస్తాడని వారు ఊహించలేదు. దాంతో సహజంగానే వెంకటేశ్‌ మహా మూడో ప్రాజెక్ట్ గురించిన వివరాలూ గుర్తు చేసుకున్నప్పుడు 'మర్మాణువు' కథ కూడా ఇదే కదా.. అప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఇప్పటి పోస్టర్ కు సంబంధం ఉంది కదా అనే భావన చాలామందికి కలిగింది. విశేషం ఏమంటే... అప్పట్లో హీరోగా రాజశేఖర్ ను అనుకుంటే ఇప్పుడు ఆ ప్లేస్ లోకి సత్యదేవ్ వచ్చాడు. అలానే సంగీత దర్శకుడిగా అప్పుడు మిక్కీ జే మేయర్ ను అనుకున్నారు. ఇప్పుడు 'రావు బహదూర్'కు స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు... ఆ ప్రాజెక్ట్ నిర్మాతలు ఎవ్వరూ ఇప్పుడీ కొత్త సినిమాలో ఇన్వాల్ కాలేదు. ఇప్పుడీ సినిమాను మహేశ్ బాబు (Mahesh Babu), నమ్రత శిరోద్కర్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. రచయిత, దర్శకుడు వెంకటేశ్‌ మహానే ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించబోతున్నారు. వచ్చే యేడాది వేసవి కానుకగా 'రావు బహదూర్' మూవీ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో జనం ముందుకు రాబోతోంది. మరి డా. రాజశేఖర్ పాత్రను పోషిస్తున్న సత్యదేవ్ కు ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.

Also Read: Akkineni Venkat: ఆగిపోయిన డైరెక్షన్ డెబ్యూ మూవీ

Also Read: Vijay Antony: కాస్త ఆలస్యంగా 'భద్రకాళి' ఆగమనం

Updated Date - Aug 13 , 2025 | 10:45 AM