Spirit: ప్రభాస్ మూవీ నుండి తప్పుకున్న దీపిక...

ABN , Publish Date - May 22 , 2025 | 02:26 PM

ప్రభాస్, దీపికా పడుకోణె మరోసారి 'స్పిరిట్'లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే అమ్మడు ఇప్పుడీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ (Bollywood) లో స్టార్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. వారే దర్శక నిర్మాతలకు కండీషన్స్ పెడుతున్నారు. ఏ మాత్రం అవి కాస్తంత అటూ ఇటూ అయినా... నిర్మొహమాటంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నారు. రాజీ పడి నటించే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. నిన్నటికి నిన్న స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shradha Kapoor) ... ఏక్తా కపూర్ (Ekta Kapoor) మూవీ నుండి ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వనందుకు తప్పుకుంది. ఆమె కోరినట్టు రూ. 17 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఏక్తా సిద్థపడినా... లాభాల్లోనూ వాటా కావాలని శ్రద్థ డిమాండ్ చేసింది. దానికి ఆమె అంగీకరించకపోవడంతో ప్రాజెక్ట్ కు తిలోదకాలిచ్చేసింది. సరిగ్గా ఇప్పుడు దీపికా పడుకోణె సైతం 'స్పిరిట్' విషయంలో అదే చేసిందనే వార్తలు వస్తున్నాయి.


బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు 'స్పిరిట్' (Spirit) లో దీపికా పడుకోణె భాగస్వామి కాదట! కొంతకాలం క్రితం ఆమె ప్రభాస్ సరసన 'స్పిరిట్'లో నటిస్తోందని, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చెప్పిన కథ నచ్చడంతో దీపికా ఆ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ప్రభాస్ (Prabhas), దీపికా పడుకోణె 'కల్కి 2898 ఎ.డి.' (Kalki 2898 A.D) లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలానే 'కల్కి' సీక్వెల్ లోనూ నటించబోతున్నారు. ఇదే సమయంలో 'స్పిరిట్'లో వీరిద్దరూ జంటగా నటించబోతున్నారన్న వార్త తెలిసి ఇద్దరి అభిమానులు సంబరపడ్డారు. అయితే... తాజా సమాచారం ప్రకారం దీపిక గొంతెమ్మ కోరికలను తీర్చలేమని 'స్పిరిట్' మేకర్స్ చేతులెత్తేశారట. దాంతో ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. దీపికా పడుకోణె కోరినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ సిద్థపడినా... ఆమె కూడా శ్రద్థాకపూర్ తరహాలోనే ప్రాఫిట్స్ లో పర్సంటేజ్ కోరిందట. అలానే తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు వర్షన్ డైలాగ్స్ తాను చెప్పనని స్పష్టం చేసిందట. ఇక మూడో నిబంధన ఏమంటే... షూటింగ్ పని గంటల విషయంలో క్లారిటీ ఉండాలని... రోజు మొత్తంలో తాను కొంత సమయం మాత్రమే షూటింగ్ కు కేటాయిస్తానని తెలిపిందట. ఆమె చెప్పిన ఈ అంశాలు వేటికి కూడా సందీప్ రెడ్డి వంగా కన్వెన్స్ కాలేదని, దాంతో ఆమె బదులుగా వేరే వాళ్ళను తీసుకోవడమే బెటర్ అని భావించాడని తెలుస్తోంది. మొత్తం మీద ' స్పిరిట్' సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే హీరోయిన్ మారిపోయిందనే ప్రచారం బీ టౌన్ లో బాగా జరుగుతోంది. మరి ఈ విషయమై సందీప్ రెడ్డి వంగా టీమ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Also Read: Sriram: తమిళం నుండి తెలుగులోకి నిశ్శబ్ద ప్రేమ

Also Read: Pan India: రాజమౌళి, సుకుమార్... ఆ తర్వాత...

Also Read: Tumbbad: ఏక్తాకపూర్ కు చెయ్యిచ్చిన శ్రద్ధా కపూర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 22 , 2025 | 02:26 PM