Chitragda Singh: 19 ఏండ్ల యువకుడి బయోపిక్ తీస్తోన్న.. ముద్దుగుమ్మ
ABN, Publish Date - Sep 16 , 2025 | 10:33 AM
బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్ 'హౌస్ ఫుల్ 5' మూవీలోని పాత్రపై హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటికే 'సూర్మా' పేరుతో ఓ బయోపిక్ ను నిర్మించిన చిత్రాంగద మరో బయోపిక్ నిర్మించబోతున్నట్టు తెలిపింది.
బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్ (Chitrangda Singh) నటించిన 'హౌస్ ఫుల్ 5' (Housefull 5) మూవీ ఇటీవల విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం ఈ సినిమాకు ఆదరణ లభించలేదు. అయితే తాను పోషించిన కామెడీ క్యారెక్టర్ గురించి పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేసింది చిత్రాంగద సింగ్. మనుషులను ఏడిపించడం చాలా తేలిక అని, అదే నవ్వించాలంటే చాలా కష్టపడాలని తెలిపింది. రొటీన్ పాత్రలు చేసి బోర్ ఫీల్ అవుతున్న దశలో 'హౌస్ ఫుల్ 5'లో పాత్ర లభించిందని, ఆ సినిమా షూటింగ్ సమయంలో అక్షయ్ కుమార్ (Akshay Kumar), జానీ లివర్ (Johny Lever) నుండి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, మరీ ముఖ్యంగా వారి కామెడీ టైమ్ గురించి తనకు ఎంతో తెలిసిందని చెప్పింది.
చిత్రాంగద సింగ్ కేవలం నటిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తోంది. ఆమె 2018లో 'సూర్మా' (Soorma) పేరుతో ఓ సినిమాను నిర్మించింది. హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ కు సంబంధించిన బయోపిక్ అది. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా, నిబద్థతతో ఆ బయోపిక్ తీశామని, అందుకే తమకు ఎంతో పేరు వచ్చిందని చిత్రాంగద సింగ్ తెలిపింది.
సినిమా నిర్మాణాన్ని తాను వాణిజ్యపరమైన కోణంలో చూడనని, మనసుకు నచ్చి, ఈ కథ చెబితే బాగుంటుంది అనిపించినప్పుడే నిర్మాణానికి సిద్థమౌతానని చెప్పింది. అతి త్వరలోనే తాను మరో బయోపిక్ తీయబోతున్నట్టు చిత్రాంగద తెలిపింది. 19 సంవత్సరాల యువకుడి బయోపిక్ తీసేందుకు దాదాపు మూడు సంవత్సరాలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నామని, సరైన సమయంలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తానని చిత్రాంగద తెలిపింది.
Also Read: Dhanush: నకిలీ ఐడీలతో.. హీరోలపై ద్వేషం వెళ్లగక్కుతున్నారు
Also Read: Dil Raju: ప్రభుత్వ ఆధ్వర్యంలో 'ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ' వెబ్ సైట్