Dhanush: నకిలీ ఐడీలతో.. హీరోలపై ద్వేషం వెళ్ల‌గ‌క్కుతున్నారు

ABN , Publish Date - Sep 16 , 2025 | 10:30 AM

కొందరు ఒక బృందంగా ఫేక్‌ ఐడీలు సృష్టించుకుని హీరోలపై ద్వేషం వ్యక్తం చేస్తున్నారని హీరో ధనుష్ పేర్కొన్నారు.

Dhanush

ఎవరో కొందరు ఒక బృందంగా ఏర్పడి, కొన్ని వందల ఫేక్‌ సోషల్‌ మీడియా ఐడీలు సృష్టించుకుని వారి మనుగడ కోసం హీరోలపై ద్వేషం వ్యక్తం చేస్తున్నారని హీరో ధనుష్ (Dhanush) పేర్కొన్నారు. రాయ‌న్‌, జాబిల‌మ్మ అంత కోప‌మా సినిమాల త‌ర్వాత‌ ఆయన స్వీయ దర్శకత్వంలో న‌టించిన‌ చిత్రం ‘ఇడ్లీకడై’ (Idli Kadai). తెలుగులో ఇడ్లీ కొట్టు (Idli Kottu)గా వ‌స్తుంది. తాజాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఇటీవ‌ల చెన్నైలో జరుగగా ఆ చిత్ర బృందం మొత్తం హాజరైంది. ఈ సంద‌ర్భంగా ధనుష్‌ హీరోలపై సాగుతున్న ట్రోల్స్‌పై స్పందించారు.

‘అసలు హేటర్స్‌ అనే కాన్సెప్టే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అందరు హీరోల చిత్రాలు చూస్తారు. ఎవరో కొందరు మాత్రం ఒక బృందంగా ఏర్పడి నకిలీ ఐడీలు సృష్టించి వారి మనుగడ కోసం కావాలనే హీరోలపై ద్వేషం వ్యక్తం చేస్తున్నారు. నా చిన్నతనంలో ఇడ్లీ తినేందుకు కూడా డబ్బులు ఉండేవి కాదు. ఇపుడు డబ్బులున్నాయి. కానీ, నా చిన్నతనంలో ఇడ్లీ రుచి ఇపుడు హైక్లాస్‌ రెస్టారెంట్లలో కూడా లేదు. ‘ఇడ్లీకడై’ నిజజీవితం ఆధారంగా తెరకెక్కింది. ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తుందన్నారు.

నటుడు పార్తిబన్ (Parthiban) మాట్లాడుతూ, ‘చిత్రపరిశ్రమలో ఇద్దరు ఎంపీలున్నారు. వారిలో ఒకరు కమల్‌ హాసన్‌. ఆయన రాజ్య సభలో ఎంపీ. మరో ఎంపీ ధనుష్‌. ఇక్కడ ఎంపీ అంటే మాస్టర్‌ ఫెర్ఫార్మెన్స్‌’ అని పేర్కొన్నారు. నటుడు సత్యరాజ్‌ మాట్లాడుతూ, ‘ధను్‌షతో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది ఈ చిత్రంతో నెరవేరిందన్నారు.

సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాష్ (GV Prakash Kumar) మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో హీరోకు ఉన్న నలుగురు స్నేహితుల్లో ఒక పాత్రలో నటించాలని ధనుష్‌ కోరారు. కానీ, ఆ పాత్ర హీరోకు ద్రోహం చేసే పాత్ర. అందుకే నిరాకరించాను. నిజజీవితంలోనే కాదు.. సినిమాలో ధనుష్‌కు ద్రోహం చేయను’ అని అన్నారు. కాగా ధనుష్‌ దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ చిత్రంలో నిత్యామేనన్ (Nithya Menen), పార్దిబ‌న్ (Parthiban), సత్యరాజ్ (Sathyaraj), రాజ్ కిర‌ణ్ (Rajkiran), అరుణ్‌ విజయ్ (Arun Vijay), షాలిని పాండే (Shalini Pandey) తదితరులు నటించారు. అక్టోబరు 1వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Updated Date - Sep 16 , 2025 | 10:30 AM