Dil Raju: ప్రభుత్వ ఆధ్వర్యంలో 'ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ' వెబ్ సైట్
ABN , Publish Date - Sep 16 , 2025 | 09:51 AM
దేశంలోనే తొలిసారి సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని వివరాలు, అనుమతులతో ఓ వెబ్ సైట్ తెలంగాణలో ప్రారంభం కాబోతోంది. 'ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ' అనే పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సైట్ రూపకల్పనకు సంబంధించిన వర్క్ షాప్ ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సోమవారం బేగంపేటలో జరిగింది.
దేశంలోనే మొదటి సినిమా రంగానికి సంబంధించిన సకల సౌకర్యాల వేదికగా ఓ వెబ్ సైట్ రూపుదిద్దుకోబోతోంది. దీనికి 'ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ' అనే పేరు పెడుతున్నారు. ఈ వెబ్ సైట్ రూపకల్పనకు సంబంధించిన సలహాలు, సూచనల కోసం సెప్టెంబర్ 16న ప్రత్యేక వర్క్ షాప్ ను తెలంగాణ ప్రభుత్వం బేగంపేట్ లోని టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని సులభతరం చేయడమే ఈ వెబ్ సైట్ లక్ష్యమని, సినిమాల రూపకల్పనకు కావాల్సిన అన్ని సదుపాయాల వివరాలను ఈ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని ఆయన చెప్పారు. సింగిల్ విండో పద్థతిలో సినిమాల నిర్మాణానికి కావలసిన అన్ని అనుమతులను పొందే సౌకర్యం ఈ వెబ్ సైట్ ద్వారా ఉంటుందని వివరించారు. అలానే నటీనటులు, సాంకేతిక నిపుణులు, వివిధ నగరాల్లో అందుబాటులో ఉన్న హోటళ్ళ సంపూర్ణ సమాచారం ఇందులో పొందుపరుస్తామని అన్నారు. ఇన్ని రకాల వివరాలతో ఓ వైబ్ సైట్ రూపుదిద్దుకోవడం దేశంలోనే మొదటిసారి అని, ఆ ఖ్యాతి తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని దిల్ రాజు తెలిపారు.
థియేటర్ల నిర్వహణకు కావాల్సిన బి ఫామ్ జారీ విధానాన్ని కూడా ఆన్ లైన్ ద్వారా పొందేలా చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సినిమా థియేటర్ల నిర్వహణకు నగరాల్లో సంబంధిత పోలీస్ కమీషనర్లు; జిల్లా కేంద్రాలు, పట్టణాలలో ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారని, ఇకపై ఆన్ లైన్ ద్వారానే అనుమతులు పొందొచ్చని దిల్ రాజు తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖతో చర్చించి రూపొందిస్తామని అన్నారు. ఈ వెబ్ సైట్ రూపకల్పనకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులను, వివిధ శాఖల అధికారులను కోరారు. దీనిని పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఆవిష్కరింప చేస్తామని అన్నారు. ఈ వర్క్ షాప్ లో దిల్ రాజుతో పాటు ఎఫ్.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ప్రియాంక, పర్యాటక అభివృద్థి సంస్థ ఎం.డి. వల్లూరు క్రాంతితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు.
Also Read: Mirai: కీరవాణిగారితో పోల్చడం భయం కలిగిస్తోంది...
Also Read: Nidhhi Agerwal: బ్యాడ్ లక్ అంటే నిధి పాపదే.. పాపం