Ashish Vidyarthi: వేషాలకై వేడుకోలు...
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:52 PM
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి ఈ మధ్య సినిమాల్లో పెద్దంతగా కనిపించడంలేదు. ఈ సందేహం చాలామందికి వస్తుంటుంది. దానికి ఆయనే సమాధానం చెప్పారు....
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) ఈ మధ్య సినిమాల్లో పెద్దంతగా కనిపించడంలేదు. ఈ సందేహం చాలామందికి వస్తుంటుంది. ఎందుకు ఆయన సినిమాల్లో చేయడం లేదు? ఆయనకు అవకాశాలు రావడం లేదా? అని అనుకుంటూ ఉంటారు. విశేషం ఏమంటే... దానికి కారణాలను ఓ వీడియో ద్వారా ఆశిష్ విద్యార్థి తన అభిమానులకు తెలియచేశాడు. ఆయన ఆ వీడియోలో బోలెడన్ని ముచ్చట్లను ఫిల్మ్ గోయర్స్ తో పంచుకున్నారు కూడా!
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నటనలో శిక్షణ తీసుకున్న ఆశిష్ విద్యార్థికి వెంటనే 'కాల్ సంధ్య' (Kaal Sandhya) అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత 'సర్దార్'లోనూ నటించాడు. ఆపైన 1994లో చేసిన 'ద్రోహకాల్' (Drohkaal) మూవీతో ఉత్తమ సహాయ నటుడుగా జాతీయ అవార్డును అందుకున్నాడు. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో 11 భాషల్లో ఆశిష్ విద్యార్థి 300కు పైగా చిత్రాలలో నటించాడు. అయితే ఇప్పుడు ఆయన పెద్దంతగా కనిపించడంలేదు.
దానికి కారణం ఏమంటో ఆ వీడియోలో ఆశిష్ తెలిపాడు. 'ఇన్నేళ్ళుగా వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు చేశాను. అయితే నాకు మరింత పేరు తెచ్చి మంచి పాత్రలు, సెంట్రల్ రోల్స్ చేయాలని ఉంది. అందుకోసం దర్శకులను, నిర్మాతలను, కాస్టింగ్ డైరెక్టర్స్ ను అడుగుతూ వస్తున్నాను. మంచి పాత్ర కోసం వారి సహాయం తీసుకోవడానికి నేను ఎప్పుడూ మొహమాట పడను. కానీ నాకు ఆశించిన స్థాయిలో మంచి పాత్రలు రావడం లేదు. అయితే ఖాళీగా ఉన్న ఈ సమయంలో నేను ఏం చేశాననే సందేహం రావడం సహజం. ఈ మధ్య కాలంలో ఓ మిత్రుడు సలహా మేరకు నేను కామెడీ రాయడానికి ట్రై చేశాను. అలా నేను 'సిట్ డౌన్ ఆశిష్' (Sit Down Ashish) పేరుతో స్టాండప్ కామెడీ షో చేశాను. అలానే వివిధ వ్యక్తుల అభిప్రాయాలు తెలుసుకుంటూ 'జిందగానియా' అనే కార్యక్రమం చేశాను. ఈ మధ్య కాలంలో ఓటీటీలలో అద్భుతమైన పాత్రలను పోషించాను. పదిహేనేళ్ళ క్రితమే నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ మోటివేషన్ స్పీకర్ గా మారాను. దానితో పాటు వ్లోగర్ గా, ట్రావెలర్ గా గొప్ప అనుభవాలను పొందాను. అలా జీవితానికి సెలబ్రేట్ చేసుకోవడానికి అనేకానేక కొత్త దారులు వేసుకున్నాను' అని అన్నారు.
ఈ వీడియో చివరిలో ఆయన హార్ట్ టచ్చింగ్ మాట కూడా ఒకటి చెప్పారు. 'నేను ఆశావాదిని, నాకు మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది. అయితే ఇక్కడే నేనో విషయం సినిమా రంగానికి చెందిన వాళ్ళకు చెప్పదలుచుకున్నాను. రేపు నేను కన్ను మూసిన తర్వాత ఎక్స్ లో కొంతమంది దర్శకులు 'అయ్యో... ఆయన కోసం మంచి పాత్రలు రాసుకున్నాన'ని చెప్పొచ్చు. అలానే 'ఆయన గొప్ప నటుడు కానీ రావాల్సినంత గుర్తింపు రాలేదు' అని బాధ పడొచ్చు. 'గ్రేట్ యాక్టర్... ఇంత త్వరగా దూరం అయిపోతాడని అనుకోలేదు' అని పోస్టులు పెట్టొచ్చు. అయితే మీరు ఆ క్వాలిటీస్ ఉన్న నటుడు ఇంకా బతికే ఉన్నాడని గుర్తించండి. నాకు మంచి పాత్రలను ఇవ్వండి. వాటిని గొప్పగా పోషించగలననే నమ్మకం నాకుంది. అవకాశాల కోసం ఒకరిని అడగడానికి నేనెప్పుడూ సిగ్గుపడను. నటించడం నా వృత్తి. నేను సంజీవంగా ఉండగానే మంచి పాత్రలు ఇవ్వమని అందరినీ కోరుతున్నాను' అని ఆశిష్ తెలిపాడు. ప్రతి వ్యక్తి ఓ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఏం చేశారన్నది కూడా ప్రధానమేనని ఆశిష్ చెబుతూ, గడిచిన పదిహేనేళ్ళలో తన ప్రయాణాన్ని గురించి అభిమానులకు తెలిపారు. వయసు ప్రతిభకు ప్రతిబంధకం కాదని భావించే ఆశిష్ విద్యార్థి రెండేళ్ళ క్రితం రూపాలి బారువా (Rupali Barua) ను ద్వితీయ వివాహం చేసుకున్నారు. మరి ఆయన వీడియో చూసిన తర్వాత అయిన దర్శక నిర్మాతలు ఆశిష్ కోరుకుంటున్న పాత్రలను ఇస్తారేమో చూడాలి.
Also Read: Bakasura Restaurant Review: 'బకాసుర రెస్టారెంట్' ఎలా ఉందంటే..
Also Read: Akhanda 2: ఏంటీ ఈ కన్ఫ్యూజన్..అసలు పోటీ ఉందా.. లేదా..