Bakasura Restaurant Review: 'బకాసుర రెస్టారెంట్‌' ఎలా ఉందంటే..

ABN , Publish Date - Aug 08 , 2025 | 03:40 PM

హాస్య నటుడిగా అలరించిన ప్రవీణ్ మెయిన్ లీడ్ గా నటించిన చిత్రం బకాసుర రెస్టారెంట్‌. హాంగర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఉందో చూద్దాం,

సినిమా రివ్యూ: 'బకాసుర రెస్టారెంట్‌' (Bakasura Restaurant Review)
విడుదల తేది: 08–8–2025


కమెడియన్‌ ప్రవీణ్ వైవిధ్యమైన పాత్రలు పోషించారు. గోదావరి యాస, డిఫరెంట్‌ మ్యానరిజం ఆయన బలం. ప్రవీణ్‌ కీలక పాత్ర పోషించిన 'బకాసుర రెస్టారెంట్‌' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టైటిల్‌ ప్రకటించినప్పటి నుంచి పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌ వరకూ అన్ని ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. హంగర్‌ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రంలో వైవా హర్ష కీ రోల్‌ లో కనిపించారు. ఎస్‌జే శివ దర్శకత్వం వహించిన 'బకాసుర రెస్టారెంట్' జనాన్ని ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం...


కథ:

పరమేశ్ (ప్రవీణ్‌) మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలో పుట్టి కష్టపడి చదివి ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తాడు. సొంతగా వ్యాపారం పెట్టాలని,  ఓ మంచి రెస్టారెంట్‌ పెట్టి.. కస్టమర్‌లకు నాణ్యమైన భోజనం వడ్డించాలని అతని  కోరిక. కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కల కలగానే ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేని జాబ్‌ చేస్తుంటాడు. అతనితో కలసి మరో నలుగురు బ్యాచిలర్స్‌ ఉంటారు. ఈజీగా డబ్బు సంపాదించి రెస్టారెంట్‌ పెట్టాలని ఈ టీమ్‌ 'ఘోస్ట్‌ హంటింగ్‌ యూట్యూబ్‌  ఛానల్‌' మొదలు పెడతారు. ఆ జర్నీలో ఒక బంగ్లాకి వెళ్ళినప్పుడు క్షుద్ర పూజలకు సంబంధించిన ఓ పుస్తకం దొరుకుతుంది. అందులో ఉన్న ప్రయోగాలు చేస్తుండగా కొన్నేళ్ల క్రితం చనిపోయిన బక్క సూరి అలియాస్‌ బకాసురుడు (వైవా హర్ష) ఆత్మ నిద్రలేస్తుంది. ఆ ఆత్మ హైదరాబాద్‌కి చికిత్స కోసం పరమేశ్ ఇంటికి వచ్చిన అంజి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ ఆత్మ బయటకు రావడానికి కారణం ఏంటి? రెస్టారెంట్‌ పెట్టాలనే పరమేశ్‌ కల నేరవేరిందా లేదా అన్నది మిగతా కథ.


Bakasura.jpg
విశ్లేషణ:
హారర్‌ కామెడీ జానర్‌ చిత్రాలకు సక్సెస్‌ రేట్‌ ఎక్కువ. కానీ తెరకెక్కించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కథనం పట్టు విడవకుండా ఉండాలి. అప్పుడు సినిమా సక్సెస్‌ బాట పడుతుంది. అయితే ఇక్కడ దర్శకుడు తీసుకున్న పాయింట్‌ మంచిదే కానీ.. తెరకెక్కించడంలో తడబడ్డాడు. ఓ మనిషిలో ఆత్మ రావడం, వింతలు సృష్టించడం ఎన్నో సినిమాల్లో చూశాం. దర్శకుడు తీసుకున్న కథ కొత్తదేమీ కాదు. హారర్‌ కామెడీని 'హంగర్‌ కామెడీ' అని జోడించాడు.  కథ ప్రారంభంలోనే ముందు ముందు ఏం జరగబోతుందో ప్రేక్షకుడికి ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది. ఫస్టాఫ్‌ అంతా ఐదుగురు బ్యాచిలర్స్‌ నడుమ సాగుతుంది. అక్కడి వరకూ అంత ఆసక్తిగా ఏమీ అనిపించదు. సెకండ్ హాఫ్ లో అసలు కథ రివీల్‌ చేశాడు. వైవా హర్ష ఎంట్రీతో నవ్వులు మొదలవుతాయి. అక్కడి నుంచి సినిమా కాస్త వేగంగానూ, ఆసక్తికరంగానూ నడుస్తుంది. అతని ఫ్లాష్‌బ్యాక్‌ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో సూటిగా చెప్పినా, బకాసుర పాత్ర, తదితర సన్నివేశాల్లో లాజిక్స్‌ మిస్‌ అయ్యాయి. ద్వితీయార్ధంలో దర్గా దగ్గర ఉప్పల్‌ బాలు టీమ్‌ చేసే సందడి నవ్విస్తుంది. ఓ మనిషి బాధతో చనిపోతే అది ఆత్మగా ఎందుకు మారుతుంది. అది ఏమేం చేస్తుంది. అది శాంతించాలంటే ఏం చేయాలి అనే విషయాలను దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ పార్టును వినోదాత్మకంగానూ, భావోద్వేగంగానూ తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రీకరణలోనే తడబాటు కనిపించింది.
 
నటీనటుల పనితీరు..

ఇప్పటిదాకా ప్రవీణ్‌ హాస్య నటుడిగానే చూశాం. ఈ సినిమాకు అతనే హీరో. పరమేశ్ పాత్రలో ప్రవీణ్‌ చక్కగా నటించాడు. వెండితెరపై నవ్వులు పూయించిన ఆయన ఇందులో చిందులు వేశాడు.. ఎమోషన్స్‌ను పండించాడు. అన్నింటి కన్నా కథను తన భుజాలపై మోశాడు.  హాస్యనటుడిగా తన శైలిని ఎక్కడా మిస్‌ చేయలేదు. అతని తర్వాత అంతగా ఆకట్టుకున్న ఆ పాత్ర ఫస్‌ బకెట్‌ ఫణిదే. వైవా హర్ష తన ఫ్లాష్‌ బ్యాక్‌ చెప్పడం భావోద్వేగాన్ని కలిగిస్తుంది. అతను తెరపై కనిపించినంత సేపు ఆకట్టుకున్నాడు. కృష్ణ భగవాన్‌ తన పాత్రకు న్యాయం చేశారు. ప్రవీణ్‌ చుట్టూ ఉన్న నలుగురు కుర్రాళ్లు, కేజీఎఫ్‌ గరుడరామ్‌ ఇతర పాత్రధారులు పరిధి మేరకు నటించారు. కథకు తగ్గట్టు వికాస్‌ బడిశా బ్యాక్‌గ్రౌండ్‌ చక్కగా అందించారు. పాటల్లో అంత ఇంపాక్ట్‌ లేదు. బాల సరస్వతి సినిమాటోగ్రఫీ నేచురల్‌గా ఉంది. సింపుల్‌ లొకేషన్స్‌లో సినిమాను పూర్తి చేశారు. నిర్మాతలు లక్ష్మయ్య ఆచారి, జనార్దన్‌ ఆచారి కథకు తగ్గట్టు ఖర్చు చేశారు. చిన్న సినిమా అయినా నిర్మాణ విలువలు బావున్నాయి. కమెడియన్ గా మంచి  పేరు తెచ్చుకున్న ప్రవీణ్ ని మెయిన్ లీడ్ గా పెట్టి సినిమా తీసిన నిర్మాతల గట్స్ ను  అభినందించాల్సిందే. ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌ ఫస్టాఫ్‌కు కత్తెర వేస్తే బావుండేది. ప్రథమార్ధ వీక్షణకు ఓర్పు అవసరం- తరువాతి సగం నవ్వులతో సాగుతుంది.


ట్యాగ్‌లైన్‌: ప్రవీణ్‌ రెస్టారెంట్‌
రేటింగ్‌: 2.5/5

Updated Date - Aug 08 , 2025 | 07:08 PM