Ramayana: కృత్రిమ మేధతో అలరించేలా 'రామాయణ'

ABN , Publish Date - Aug 06 , 2025 | 09:36 PM

ప్రస్తుతం ప్రతి రంగంలోనూ 'ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్' చోటు చేసుకుంటోంది. 'ఏఐ' వైపు సినిమారంగం మరింతగా పరుగులు తీస్తోంది. 'కృత్రిమ మేధ'తో అద్భుతాలు సృష్టించవచ్చునని మూవీ మేకర్స్ విశ్వసిస్తున్నారు.

Ramayana

Ramayana: ప్రస్తుతం ప్రతి రంగంలోనూ 'ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్' చోటు చేసుకుంటోంది. 'ఏఐ' వైపు సినిమారంగం మరింతగా పరుగులు తీస్తోంది. 'కృత్రిమ మేధ'తో అద్భుతాలు సృష్టించవచ్చునని మూవీ మేకర్స్ విశ్వసిస్తున్నారు. ఏఐతో రూపొందిన కొన్ని చిత్రాలు జనాన్ని ఆకట్టుకుంటూ ఉండడంతో హిందీలో తెరకెక్కుతోన్న భారీ పౌరాణిక చిత్రం 'రామాయణ (Ramayana)'లో పలు సన్నివేశాలను ఏఐ ఆధారంగా రూపొందించే పనిలో పడ్డారు మేకర్స్. కొన్నాళ్ళ క్రితం విడుదలైన 'రామాయణ' టీజర్ ను ఏఐతోనే రూపొందించారు. ఈ టీజర్ వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. శ్రీరాముని పాత్రలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయిపల్లవి, రావణునిగా యశ్ (Yash), హనుమంతునిగా సన్నీ డియోల్ నటిస్తోన్న 'రామాయణ'ను మొదట కేటాయించిన బడ్జెట్ కంటే రెట్టింపు చేసి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.


మొదట్లో 1600 కోట్ల రూపాయలతో 'రామాయణ' రూపొందిస్తామని ప్రకటించిన మేకర్స్ ఏఐతో సాగాలని నిర్ణయించి, ఆ బడ్జెట్ ను రూ.4000 కోట్లకు పెంచినట్టు సమాచారం. ఇంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అని కొందరికి అనుమానాలు కలగవచ్చు. ఇటీవల విడుదలైన యానిమేషన్ మైథలాజికల్ మూవీ 'మహావతార్ - నరసింహ' గ్రాఫిక్స్ తోనే మాయాజాలం చేసి కేవలం పది రోజుల్లోనే వంద కోట్లకు పైగా పోగేసి ఇండియిన్ యానిమేషన్ మూవీస్ లో ఓ రికార్డ్ నెలకొల్పింది. దాంతో మరికొన్ని పౌరాణిక గాథలు టెక్నాలజీవైపు పరుగెత్తడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి 'రామాయణ' వైపే సాగుతోంది. 'రామాయణ మొదటి భాగం' వచ్చే యేడాది దీపావళికి విడుదల కానుంది. తరువాత 2027 దీపావళికి రెండో భాగం రానుంది. అప్పటి దాకా 'రామాయణ' కోసం ఎదురుచూస్తోన్న ప్రేక్షకులను మధ్యలో మరికొన్ని ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అలరించే ప్రయత్నంలో ఉన్నారు సినీజనం.


కృత్రిమ మేధతో సాధ్యం కానిదంటూ ఏదీలేదని అంటున్నారు సినీజనం. కథను ఎంపిక చేసుకోవడం మొదలు, దానికి తగ్గ స్క్రీన్ ప్లే ను రూపొందించుకొని సెట్స్ కు వెళ్ళే దాకా కూడా ఏఐ సహకరిస్తుంది. ఇక చిత్రీకరణ సమయంలో ఏ సీన్ కు ఏ టైప్ ఆఫ్ లైటింగ్ అవసరం, ఆ సీన్ లో ఏ పాత్ర ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా నటిస్తే రక్తి కడుతుంది అన్న అంశాలలోనూ ఏఐ సహకరించనుంది. అంతెందుకు దివంగత నటీనటులను సైతం మళ్ళీ ప్రాణమున్న బొమ్మలుగా మన ముందు నిలపడానికి కూడా ఏఐ ఉపకరిస్తుంది. ఈ టెక్నాలజీతోనే శంకర్ 'ఇండియన్ -2'లో చనిపోయిన నటులు వివేక్, నెడుముడి వేణును క్రియేట్ చేశారు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఎవరూ ఏఐ వైపు దృష్టి సారించలేదు. కానీ, ఇప్పుడు యానిమేషన్ మూవీ 'మహావతార్- నరసింహ' ఘనవిజయం సాధించడంతో ఏఐతో మరింత బాగా పౌరాణికాలను రూపొందించవచ్చుననే భరోసాతో ఉన్నారు సినీజనం.


కథ ఎలా ఉండాలి మొదలు, నటీనటులు ఎలా నటించాలి, కెమెరా యాంగిల్స్ ఎలా సాగాలి, ఏ గ్రేడియేషన్ తో సీన్ ను రక్తి కట్టించవచ్చు - తదితర అంశాలలోనూ ఏఐ పాత్ర పోషించనుంది. నిర్మాతలు కృత్రిమ మేధ వెంటే పరుగు తీస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. కొందరు మేధావులు నటీనటులతో సంబంధం లేకుండా ఏఐ కేరెక్టర్స్ తోనే సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. కృత్రిమ మేధ వాడకం ఎక్కువైతే జనం ఏది అసలో, ఏది నకిలీనో తెలియక తికమక పడే అవకాశం ఉంది. దాంతో సజీవనటనకే ప్రాధాన్యమిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మళ్ళీ నాటకాలు ఊపందుకున్నా ఆశ్చర్య పోనక్కరలేదని కొందరి జోస్యం. 'అతి సర్వత్రా వర్జయేత్' అన్న నానుడిని అనుసరించి, ఏఐతో పని ఏ మేరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకుంటే మంచిది. అన్నిటికన్నా ముందుగా 'రామాయణ' సినిమా వచ్చి ఏ రీతిలో అలరిస్తుందో, దానిని బట్టే మన చిత్రసీమ ఏఐతో పయనించే తీరు ఉంటుంది.

Actor Praveen: నేను హీరోలా ఫీల్ అవ్వడం లేదు..

Vivek Agnihotri: నేను అక్కడ ట్రైలర్ రిలీజ్ చేస్తా.. నన్నెవరు ఆపుతారో చూస్తా

Updated Date - Aug 06 , 2025 | 09:36 PM