Star Wars: రజినికాంత్, విజయ్ అభిమానుల మధ్య యుద్ధం

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:56 PM

రజినీకాంత్, విజయ్ అభిమానులు సామాజిక మాధ్యమంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు ప్రయోగించుకుంటూ తమ నటుడిదే నంబర్ వన్ స్థానం అంటూ ఆ నటుల పారితోషికాలు గురించి వాగ్యుద్ధం చేసుకుంటున్నారు.

Star Wars: రజినికాంత్, విజయ్ అభిమానుల మధ్య యుద్ధం
Vijay and Rajinikanth

అగ్ర నటుల అభిమానులు వారి నటులపై వున్న అభిమానంతో వాగ్యుద్ధం చేసుకోవటం కొత్తేమీ కాదు కానీ, ఈ సామాజిక మాధ్యమం వచ్చాక మరీ ఎక్కువయిపోయాయి. ఈ అభిమానుల వార్స్ అనేవి ఒక్కోసారి ఒక్కో రకంగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. మొదట్లో తమ అభిమాన నటుల సినిమాలు ఎన్ని థియేటర్స్ లో విడుదలయ్యాయి, తరువాత కాస్త అవి ఆ సినిమాల కలెక్షన్స్ ఎంత చేశాయి అనే వాటిపైకి మళ్ళాయి. అలాగే తమ నటుల సినిమాలు ఎన్ని థియేటర్స్ లో వందరోజులు ఆడాయి, కొన్నిసార్లు సంవత్సరం కూడా ఆడిన రికార్డ్స్ ఉండేవి. అప్పట్లో అగ్ర నటుల అభిమానుల మధ్య ఎప్పటికప్పుడు మాటల యుద్ధం నడుస్తూ వచ్చేది. ఇప్పుడైతే అది ముదిరి మొదటిరోజు ఓపెనింగ్స్ వరకు వచ్చేసింది. అది కూడా దాటిపోయి ఇప్పుడు ఇంకో కొత్త కోణంలో ఈ అభిమానుల మధ్య వార్ మోడలింది.

అదేంటి అంటే, అభిమానుల మధ్య వినిపిస్తున్న‌ ప్రధాన పోటీ తమ అభిమాన నటుల పారితోషికం గురించి. ఇప్పుడు ప్రతి అగ్ర నటుడు తమ సినిమా ఒక్క భాషలో కాకుండా మొత్తం ఇండియా అంతా విడుదల చెయ్యాలని దానికి తగ్గట్టుగా పారితోషికాలు కూడా తీసుకుంటున్నారు. అలా చాలామంది నటుల మార్కెట్ కూడా బాగా విస్తరించింది కూడా. దానికి తగ్గట్టుగా ఆయా నటుల పారితోషికాలు కూడా బాగా పెరిగిపోయాయి.

thalapathyvijay.jpg

దక్షిణాదిలోనే ఇలా చాలామంది అగ్ర నటులకి అభిమాన సంఘాలు ఉండటం, వాళ్ళు తమ నటుడి గురించి సామాజిక మాధ్యమంలో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఇలా పారితోషికాలు విషయంలో తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్, విజయ్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమంలో విపరీతంగా వాగ్యుద్ధం జరుగుతోంది.

తెలుగు నటుడు ప్రభాస్ పారితోషికంగా రూ.150 కోట్లు తీసుకుంటూ దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకున్న నటుడిగా ఉండేవారు అనేవారు. అలాగే తమిళ సూపర్ స్టార్ విజయ్ కు 'వారసుడు' సినిమాకి గాను రూ.120 కోట్లు ఇచ్చారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ పారితోషికం ఒక్కసారిగా పెరిగిపోయింది అని, తాను చెయ్యబోయే ఆఖరి సినిమాకి అతని పారితోషికం రూ. 250 కోట్ల వరకు ఉందని విజయ్ అభిమానులు చెపుతున్నారు.

సినిమాలు మానేసి రాజకీయాల్లో పూర్తిగా కేటాయించడానికి విజయ్ చేయబోయే ఆఖరి సినిమాకు రూ. 250 కోట్ల పారితోషికం అని అభిమానులు చెపుతున్నా, ఈ సినిమాపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అసలు ఈ సినిమా ఉంటుందా, ఉండదా, ఉంటే దర్శకుడు ఎవరు అనే విషయంలో కూడా ఇంకా ఏమీ అనుకోలేదు అని తెలిసింది. కానీ విజయ్ కి ఎలివేషన్ ఇచ్చేందుకు అతని అభిమానులు దేశంలోనే అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నది తమ నటుడే అని చెప్పుకుంటున్నారు.

rajinikanthfans.jpg

విజయ్ అభిమానులు ఇలా చెప్పుకుంటూ ఉంటే, అదే తమిళ పరిశ్రమకి చెందిన రజనీకాంత్ అభిమానులు విజయ్ అభిమానులకి ధీటుగా ఓ అడుగు ముందుకేశారు. రజనీకాంత్ రాబోయే సినిమా 'కూలీ' కోసం రజినీ పారితోషికం రూ. 260 కోట్లు అంటూ ప్రచారం మొదలెట్టారు. రజినీకాంత్ కి ఒక్క తమిళంలోనే కాదు, మొదటి నుండి అతని స్టార్ డమ్ ప్రపంచం అంతా తెలుసు, రజినికాంత్ ఈ వయసులో కూడా 'జైలర్' లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారంటే అది అతనికున్న స్టార్ డమ్. అతనే ఎక్కువ పారితోషికం తీసుకున్న నటుడిగా చాలా కాలం వున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా విజయ్ అభిమానులు విజయ్ దే నంబర్ వన్ స్థానం అంటే ఒప్పుకునేది లేదంటున్నారు రజినీకాంత్ అభిమానులు.

గత రెండు రోజులుగా తమిళతంబీల మధ్య వాడిగా, వేడిగా ఈ చర్చ సామాజిక మాధ్యమంలో జోరుగా నడుస్తోంది. ఇదంతా చూసిన నెటిజెన్స్ మన తెలుగు నటుల అభిమానులు ఈ తరహా పారితోషికం గురించి గొడవలు పడకపోవటం కాస్త ఉపశమనం కలిగించే విషయంటున్నారు..! కానీ తెలుగు అగ్ర నటుల అభిమానులు మాత్రం ఊరుకుంటారా? త్వరలో వీళ్ళు కూడా మొదలెట్టేస్తారు అని అంటున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 01:56 PM