SV Ranga Rao: ముత్యాల సుబ్బయ్యకు ముచ్చెటమలు పట్టించిన ఎస్వీఆర్.. విషయం ఏమిటంటే?

ABN , Publish Date - Jan 02 , 2024 | 03:33 PM

సూపర్ స్టార్ కృష్ణ 1975లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కొత్త కాపురం’. ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌ తండ్రి పాత్రకు మొదట ఎస్‌.వి. రంగారావును తీసుకొన్నారు. ‘కొత్త కాపురం’ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఓ సన్నివేశం సందర్భంలో ఎస్వీఆర్ ఆగ్రహానికి ముత్యాల సుబ్బయ్య భయపడిపోయారు.

SV Ranga Rao: ముత్యాల సుబ్బయ్యకు ముచ్చెటమలు పట్టించిన ఎస్వీఆర్.. విషయం ఏమిటంటే?
SVR And Muthyala Subbaiah

సూపర్‌ స్టార్‌ కృష్ణ (Super Star Krishna)కు యాక్షన్‌ చిత్రాలు ఎంత పేరు తెచ్చాయో, కుటుంబ కథాచిత్రాలు కూడా అంత కంటే ఎక్కువ గుర్తింపునిచ్చాయి. అలాగే ఆయన పంచె కట్టి నటిస్తే చాలు సినిమా హిట్‌ అనేవారు ఆ రోజుల్లో. ఎన్నో చిత్రాలు ఆ మాటను నిజం చేశాయి కూడా. వాటిల్లో 1975లో వచ్చిన ‘కొత్త కాపురం’ (Kotha Kapuram) చిత్రం ఒకటి. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకొన్న ఈ సినిమాలో హీరో కృష్ణ సరసన భారతి నటించారు. పి.చంద్రశేఖరరెడ్డి దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్‌ తండ్రి పాత్రకు మొదట ఎస్‌.వి. రంగారావు (SV Ranga Rao)ను తీసుకొన్నారు. ఎస్వీఆర్‌లో ఉన్న ఏకైక బలహీనత ఏమిటంటే.. మద్యపానం. ఒక్కోసారి షూటింగ్స్‌ అన్నీ వదిలేసి, తోటకు వెళ్లి పోయి 15 రోజులు ఏకధాటిగా తాగేవారు అడుగు బయటకు పెట్టేవారు కాదు. ‘గురువుగారు సమాధిలో ఉన్నారు’ అనే వారంతా. ఆయన ఎప్పుడు బయటకు వస్తారా? అని నిర్మాతలంతా ఓపికగా ఎదురు చూసేవారు.

‘కొత్త కాపురం’ షూటింగ్‌ జరుగుతున్నప్పుడే రంగారావు అలా తోటలోకి వెళ్లిపోయారు. కానీ ఆ చిత్ర నిర్మాత వెంకటరత్నం మాత్రం ఆయన్ని వదిలిపెట్టలేదు. రోజూ రంగారావు దగ్గరకు వెళ్లేవారు. షూటింగ్‌కు రమ్మని బతిమాలేవారు. ఆయన పోరు పడలేక .. ‘సరే.. రేపటి నుంచి వస్తాను.. ప్లాన్‌ చేసుకో .. పో’ అని ఓ రోజు చెప్పారు రంగారావు. చెప్పినట్లుగానే ఆ మర్నాడు షూటింగ్‌కు ఆయన వచ్చారు.


Krishna.jpg

‘కొత్త కాపురం’ చిత్రం షూటింగ్‌లో ఓ తమాషా సంఘటన జరిగింది. సినిమా షూటింగ్‌ అనగానే వేషాలు ఇప్పించమని చిన్న చిన్న ఆర్టిస్టులు అసోసియేట్‌ డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ బతిమాలుతుంటారు. ‘కొత్త కాపురం’ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య (Muthyala Subbaiah) అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఓ ఆర్టిస్ట్‌ ‘ఏదన్నా వేషం ఇప్పించండి సార్‌’ అంటూ ఆయన్ని రోజూ వేధించేవాడు. అతని బాధ పడలేక సినిమాలో పోస్ట్‌మ్యాన్‌ వేషం ఉంటే అది అతనికి ఇచ్చారు సుబ్బయ్య. అది కూడా ఎస్వీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చే వేషం. . ‘సార్‌.. మీకు పోస్ట్‌ వచ్చింది’ అనే డైలాగ్‌ చెప్పాలి. ఆ ఆర్టిస్ట్‌ మొదట సంబర పడ్డారు కానీ సెట్‌లో ఎస్వీఆర్‌ గంభీర విగ్రహం చూసి అతను వణికిపోయాడు. డైలాగ్‌ చెప్పడానికి తడబడ్డాడు. రెండు మూడు టేకులు తినేసరికి రంగారావుకి కోపం వచ్చేసి ‘‘ఏయ్‌.. ఎవడురా వీడు.. ఎవడురా వీణ్ని తీసుకువచ్చింది?’ అంటూ గర్జించారు.

అందరూ ముత్యాల సుబ్బయ్య వంక చూశారు. ‘అమ్మా... కొంప మునిగిందిరా బాబూ’ అనుకున్నారు సుబ్బయ్య. కానీ దర్శకుడు పి.సి.రెడ్డి (PC Reddy) ఏదో చెప్పి, ఆయన్ని సేవ్‌ చేశారు. కాసేపటికి ఎస్వీఆర్‌కు కోపం తగ్గింది. ఆ ఆర్టిస్ట్‌ను దగ్గరకు పిలిచి ‘భయపడకు రా.. చిన్న డైలాగే కదా.. ధైర్యంగా చెప్పు’ అని ఎంకరేజ్‌ చేసి అతనితో చెప్పించారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ‘కొత్త కాపురం’ చిత్ర నిర్మాణ సమయంలోనే ఎస్వీఆర్‌ చనిపోయారు. దాంతో అప్పుడు గుమ్మడి (Gummadi)ని ఆ పాత్రకు ఎంపిక చేసి రంగారావు పాల్గొన్న సన్నివేశాలను రీ షూట్‌ చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Guntur Kaaram: మాస్‌ బీట్‌‌ని.. నెటిజన్లు మడతెట్టేస్తున్నారు..

****************************

*Kotabommali PS in OTT: ‘కోటబొమ్మాళి PS’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*********************************

*Vijayakanth: ‘కెప్టెన్’ విజయకాంత్ గురించి ఆయన తోబుట్టువులు ఏం చెప్పారో తెలుసా?

************************************

*NBK109: ‘యానిమల్’ స్టార్‌ని బాలయ్య మూవీ సెట్స్‌లోకి ఆహ్వానించిన ఊర్వశి..

********************************

Updated Date - Jan 02 , 2024 | 03:33 PM