Elections 2024: టాలీవుడ్‌లో ముఖ్యమంత్రులుగా చేసిన నటులు వీరే..

ABN , Publish Date - May 08 , 2024 | 06:15 PM

నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ కూటమి ఒకవైపు, వైఎస్ జగన్ మరోవైపు.. ఒకరినొకరు రాజకీయ విమర్శలు చేసుకుంటూ.. ప్రచారంలో మునిగిపోయారు. ఎన్నికల తేదీ మరింత దగ్గరకు వచ్చేయడంతో.. ఇప్పుడంతా ఏపీ సీఎం ఎవరవుతారనేలా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ వెండితెరపై సీఎంలుగా చేసిన నటీనటుల వివరాలేంటో ఒకసారి చూద్దాం..

Elections 2024: టాలీవుడ్‌లో ముఖ్యమంత్రులుగా చేసిన నటులు వీరే..
Tollywood Chief Ministers

రెండు తెలుగు రాష్ట్రాలలో (Telugu States) ఇప్పుడు రాజకీయ వాతావరణం వేడెక్కింది. సూర్యుడి భగభగలను మించేలా ఇప్పుడు పొలిటికల్ హీట్ ఉందంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఒకవైపు ఐపీఎల్ జరుగుతున్నా కూడా.. తెలుగు రాష్ట్రాలలో రాజకీయంపైనే ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయంటే.. ఏ రేంజ్‌లో జనాలు.. పాలిటిక్స్ గురించి ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ పొలిటికల్ హీట్ దాదాపు 100 డిగ్రీలు అన్నట్లుగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మోదీ (Modi) కూటమి ఒకవైపు.. వైఎస్ జగన్ అండ్ టీమ్ (YS Jagan and Team) మరోవైపు.. ఒకరినొకరు రాజకీయ విమర్శలు చేసుకుంటూ.. ప్రచారంలో మునిగిపోయారు. ఎన్నికల తేదీ (Elections 2024) మరింత దగ్గరకు వచ్చేయడంతో.. ఇప్పుడంతా ఏపీ సీఎం ఎవరవుతారనేలా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ వెండితెరపై సీఎంలుగా చేసిన నటీనటుల వివరాలేంటో ఒకసారి చూద్దాం..

Krishna.jpg

సూపర్ స్టార్ కృష్ణ: ‘ముఖ్యమంత్రి’ (Super Star Krishna Mukhyamantri)

ముఖ్యమంత్రి ఎవరు అనే ఆసక్తికర చర్చ నడుస్తున్న నేపధ్యంలో సూపర్ స్టార్ కృష్ణ రీల్ లైఫ్‌లో అదే పేరుతో సినిమా తీసి అందరినీ అలరించారు. ఈ సినిమాలో సీఎంగా ఆయన నటనకు జనాలు నీరాజనాలు పలికారు. సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన ఈ సినిమాను టి. శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. శాఖమూరి సాంబశివరావు సహనిర్మాతగా వ్యవహరించారు. కృష్ణ సరసన అంబిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి చక్రవర్తి స్వరాలను సమకూర్చారు. అప్పట్లో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.


ANR.jpg

అక్కినేని నాగేశ్వరరావు: ‘రాజకీయ చదరంగం’ (ANR Rajakeeya Chadarangam)

1989లో విడుదలైన ‘రాజకీయ చదరంగం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యమంత్రిగా నటించారు. పద్మాలయ స్టూడియోస్ పతాకంపై కృష్ణ సమర్పణలో జి. హనుమంత రావు, జి. ఆదిశేషగిరి రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పి. చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, సుజాత ప్రధాన పాత్రలలో నటించారు. ఇందులో సత్యమూర్తి పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు సీఎంగా పవర్ ఫుల్ నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.

Megastar.jpg

మెగాస్టార్ చిరంజీవి: ‘ముఠామేస్త్రి’ (Megastar Chiranjeevi Muta Mestri)

అప్పటి వరకు చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివ‌రి సినిమా అంటే అది ‘ముఠామేస్త్రి’ సినిమానే. 1993లో వచ్చిన ముఠామేస్త్రి సినిమా.. మార్కెట్ యార్డ్‌లో కూలీగా పని చేసే ఒక సాధారణ వ్యక్తి.. అనుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కావడమే ఈ సినిమా కథాంశం. చిరంజీవి సరసన మీనా – రోజా హీరోయిన్లుగా నటించారు. దేశభక్తి కలిగిన బోసు పాత్రలో చిరంజీవి ఇందులో నటించారు. రాజ్-కోటి సంగీతంలో వచ్చిన ఈ సినిమా పాటలు అప్పట్లో ట్రెండ్‌ని క్రియేట్ చేశాయి. ఈ సినిమా టైమ్‌లోనే మెగాస్టార్‌కి పాలిటిక్స్‌లోకి రావాలనే ఆలోచన వచ్చినట్లుగా ఇప్పటికీ టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తుంటాయి.


Rana.jpg

రానా దగ్గుబాటి: ‘లీడర్, నేనే రాజు నేనే మంత్రి’ (Rana Daggubati Leader and Nenu Raju Nenu Mantri)

రానా దగ్గుబాటి మొదటి చిత్రంలోనే ముఖ్యమంత్రిగా నటించి అందరి మన్ననలను అందుకున్నారు. రాజకీయ నాయకుల అవినీతి, పదవీ కాంక్షల చుట్టూ నడిచే కథతో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అర్జున్ ప్రసాద్‌‌గా రానా అభినయానికి ఇప్పటికీ ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. చాలా బరువైన కథలో రానా పర్ఫెక్ట్‌గా నటించి.. తొలి సినిమాతోనే అద్భుతమైన ప్రశంసలను అందుకున్నారు. రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. యంగ్ హీరోలలో ముఖ్యమంత్రిగా చేసిన నటుడిగా రానాకు ఈ చిత్రం అప్పట్లో మంచి గుర్తింపును ఇచ్చింది. మరో సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో సీఎంగా ఎన్నుకోబడినప్పటికీ.. రానా తన రాధ (కాజల్ అగర్వాల్) కోసం ప్రాణత్యాగం చేస్తాడు.

Balakrishna.jpg

నందమూరి బాలకృష్ణ: ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ (Balakrishna in NTR Mahanayakudu)

లెజండ్ నందమూరి తారక రామారావు నిజజీవితం మరియు రాజకీయ జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మించిన సినిమా ‘ఎన్టీఆర్: మహానాయకుడు’. NBK ఫిల్మ్స్, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఎన్టీఆర్ జీవిత చరిత్రలో మొదటిది ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ కాగా, రెండో సినిమా ‘ఎన్టీఆర్: మహానాయకుడు’. ఇందులో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించి.. సీఎం అయ్యే వరకు ఆద్యంతం కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Mahesh-Babu.jpg

సూపర్ స్టార్ మహేష్ బాబు: ‘భరత్ అనే నేను’ (Super Star Mahesh Babu Bharath Ane Nenu)

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఒక సెన్సేషనల్ సినిమాగా ‘భరత్ అనే నేను’ సినిమా నిలిచిపోతుంది. ఈ సినిమాలో భరత్ రామ్ పాత్రలో మహేష్ బాబుని చూసిన వారంతా.. సీఎం అంటే ఇలా ఉండాలి అనుకున్నారంటే, ఈ సినిమా ఎంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Nasser.jpg

నాజర్: ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ (Nasser in Cameraman Gangatho Rambabu)

సీనియర్ యాక్టర్ నాజర్.. పవన్ కళ్యాణ్ హీరో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు. సినిమాలో ఆయనకు తక్కువ సీన్లే ఉన్నప్పటికీ.. చాలా ప్రభావవంతమైనవి అవి ఉంటాయి. మరీ ముఖ్యంగా రాంబాబుని చైతన్యవంతుడిని చేసే పాత్రగా నాజర్ పాత్ర ఉంటుంది. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

giribabu.jpg

గిరిబాబు: ‘ఎవడైతే నాకేంటి’ (Giribabu Evadaithe Nakenti)

మరో సీనియర్ యాక్టర్ గిరిబాబు.. రాజశేఖర్ హీరోగా నటించిన ‘ఎవడైతే నాకేంటి’ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు. మేజర్ సూర్య పాత్రలో రాజశేఖర్ నటించిన ఈ చిత్రంలో.. కొన్ని అనుకోని కారణాల వల్ల రాజశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తాడు. అతనికి గిరిబాబు మంత్రి పదవి ఇస్తానని చెప్పి.. తమ పార్టీకి సపోర్ట్ చేయమని అడుగుతాడు. మినిస్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజశేఖర్ ఓ ఆట ఆడుకుంటాడు. అప్పట్లో హిట్ సినిమాగా ఈ సినిమా నిలిచింది. రాజశేఖర్ సరసన సంవృత సునీల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ సతీమణి జీవితా రాజశేఖర్ తెరకెక్కించారు. చిన్నా సంగీతం అందించారు.

Kota.jpg

కోట శ్రీనివాసరావు: ‘ప్రతినిధి’ (Kota Srinivasa Rao Prathinidhi)

సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి’ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించారు. ప్రశాంత్ మండవ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనాన్ని క్రియేట్ చేసింది. ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేసి తన అదుపులో ఉంచుకునే పాత్రలో మంచోడు శ్రీనుగా నారా రోహిత్ నటనకు ప్రశంసలు దక్కాయి. శుభ్ర అయ్యప్ప హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించారు.


Yatra-2.jpg

మమ్ముట్టి: ‘యాత్ర 2’ (Mammootty in Yatra 2)

‘యాత్ర’, ‘యాత్ర 2’ సినిమాలలో మలయాళ నటుడు మమ్ముట్టి ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలలోనూ మమ్ముట్టి కనిపిస్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి జీవించేశారనేలా ఆయనకు ప్రశంసలు దక్కాయి. మహి. వి. రాఘవ ఈ రెండు చిత్రాలను తెరకెక్కించారు.

vijay-deverakonda.jpg

విజయ్ దేవరకొండ: ‘నోటా’ (Vijay Deverakonda Nota)

తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘నోటా’. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా చక్కని అభినయం కనబరిచారు. మరీ ముఖ్యంగా తన తండ్రితోనే పోటీపడటం అనేది ఈ చిత్ర మెయిన్ కాన్సెఫ్ట్. ఇందులో కూడా నాజర్ సీఎంగా నటించారు. అవినితి ఆరోపణలతో నాజర్ జైలుకి వెళ్లడంతో.. ఆ సీటులోకి వరుణ్ (విజయ్ దేవరకొండ) వస్తాడు. అతను సీఎం అయిన తర్వాత.. పరిస్థితులు ఏంటనేదే ఇక్కడ ఆసక్తికంగా దర్శకుడు చెప్పగలిగాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా నిలబడలేదు. మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం అందించారు.

Jagapathi.jpg

జగపతిబాబు: ‘అధినేత’ (Jagapathi Babu Adhinetha)

వీరమాచనేని సూరిబాబు పాత్రలో జగపతిబాబు నటించిన సినిమా ‘అధినేత’. ఆసక్తికరమైన కథ, కథాంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు కాసేపు సీఎంగా అలరిస్తాడు. ముందు సీఎం దగ్గర పనిచేసే వ్యక్తిగా నటించిన సూరిబాబు.. ఆ తర్వాత సీఎం ఎలా అయ్యాడు? మళ్లీ ఆ పదవిని ఎలా పోగొట్టుకున్నాడనేదే ఈ సినిమా కథ. శ్రద్ధాదాస్‌, హంసానందిని హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను వి. సముద్ర తెరకెక్కించారు. కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ దేవ సంగీతం అందించారు.

Updated Date - May 08 , 2024 | 06:15 PM