Super Star Krishna: పాడీ లేదు, పంటా లేదు అని ఆత్రేయ వదిలేసి వెళ్ళిపోయిన సినిమా 'పాడిపంటలు'

ABN , First Publish Date - 2023-08-15T15:21:21+05:30 IST

'అల్లూరి సీతారామరాజు' సినిమా తరువాత విడుదలైన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కృష్ణకి. ఏ నిర్మాత ముందుకు రాలేదు కృష్ణతో సినిమా తీయడానికి, అప్పుడు ఏమి చెయ్యాలా అని అలోచించి ఒక నిర్మాతని తనే వెతుక్కున్నాడు. అది ఎవరో కాదు, అతనే, తన సొంత బ్యానర్ పద్మాలయ మీద తీసిన ఆ సినిమానే 'పాడిపంటలు'. ఆ సినిమా ఎలా మొదలైంది, ఎలా విడుదలైంది...

Super Star Krishna: పాడీ లేదు, పంటా లేదు అని ఆత్రేయ వదిలేసి వెళ్ళిపోయిన సినిమా 'పాడిపంటలు'
Krishna and Vijayanirmala in Paadi Pantalu

ఇంతకు ముందు సూపర్ స్టార్ కృష్ణ (SuperStar Krishna) గారు 'అల్లూరి సీతారామరాజు' #AlluriSeetharamaraju సినిమా చేసాక ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి అని అనుకున్నాం కదా. ఇంచుమించు ఒక 15 సినిమాల వరకు కృష్ణగారివి ఫ్లాప్ అయ్యాయి, ఒక్క నిర్మాత కూడా కృష్ణ గారితో సినిమా చెయ్యడానికి ముందుకు రాలేదంటే ఆశ్చర్యమే కదా. ఇది 1975లో కృష్ణ పరిస్థితి. 1966 లో 'గూఢచారి 116' #Gudachari116 విడుదలైన దగ్గర నుండి 1975 వరకు రోజుకు మూడు షిఫ్టులు, సంవత్సరానికి 15 సినిమాలు చేసిన కృష్ణకి పని లేకుండా పోయింది, నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. 'రాజేశ్వరి విలాస కాఫీ క్లబ్' #RajeswariVilasaCoffeeClub సినిమా మాత్రమే షూటింగ్ జరుగుతోంది కానీ అదీ చాలా నత్త నడకగా సాగుతోంది. 1975 ద్వితీయార్ధం లో ఒక్క సినిమా కూడా చేతిలో లేదు.

paadipantalu1.jpg

అప్పుడు ఏమి చెయ్యాలా అని అలోచించిన కృష్ణ, ఇక వేరే మార్గం లేదు, తన కోసం తనే ఒక సినిమాని నిర్మించుకోవాలి అని తన స్వంత బ్యానర్ పద్మాలయాలో (PadmalayaStudios) సినిమా చెయ్యడానికి ప్లాన్ చేశారు. అప్పుడు దర్శకుడు పిసి రెడ్డి (PCReddy) చెప్పిన కథ కృష్ణకి బాగా నచ్చింది. అదే 'పాడిపంటలు' #Paadipantalu సినిమా. ఆ కథ నచ్చడంతో ఆత్రేయ (Atreya) ని పిలిచి స్క్రిప్ట్ వర్క్ చెయ్యమన్నారు. ఒక నెల రోజులు పని చేసాక, ఆత్రేయ 'ఇందులో పాడీ లేదు, పంటా లేదు' అని మధ్యలోనే వెళ్లిపోయారు. ఏమి చెయ్యాలో తోచక అప్పుడు మహారధిని (Maharadhi) పిలిచి స్క్రిప్ట్ వర్క్ చెయ్యమన్నారు.

మహారథి, పిసి రెడ్డి, కృష్ణ కూర్చొని స్క్రిప్ట్ మొత్తం తయారు చేశారు. మహారథి మాటలు బాగా రాసారు అని కృష్ణ సంతోషంగా వున్నారు. విజయవాడ, గుడివాడ మధ్యలో మణికొండ అనే వూరు ఉంటే అక్కడ అవుట్ డోర్ లో 1975 అక్టోబర్ 1న షూటింగ్ మొదలెట్టారు. అక్కడ ఒక మోతుబరి రైతు ఇంట్లో కృష్ణ స్టే చేశారు. మొదటి రోజు షూటింగ్ చేసి ఇంటికొచ్చి పడుకున్నాక రాత్రి 10 గంటలకి, మద్రాసు నుండి ఫోను వచ్చింది, ఆదుర్తి సుబ్బారావు (AdurthiSubbaRao) గారు పోయారని. కృష్ణకి మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి, వెళ్లి తీరాలి. కానీ ట్రాన్స్ పోర్ట్ ఏమీ లేదు. కారులో వెళితే అందుకోలేము, ఆ రాత్రి ఆ టైములో మద్రాసు పోవడానికి ట్రైన్స్ లేవు కానీ తప్పకుండా వెళ్ళాలి. ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో కృష్ణ కి ఒక విషయం తెలిసింది.

అప్పట్లో హిందూ పేపర్ కోసం చెన్నై నుండి ఒక ఫ్లైట్ వచ్చి విజయవాడలో పేపర్స్ దింపి మళ్ళీ చెన్నై వెళ్లిపోయేది. అది తెల్లవారుజామున వచ్చి వెళ్ళేది. కృష్ణ తన పరపతి వుపయోగించి ఆ హిందూ పేపర్ తెస్తున్న ఫ్లైట్ లో విజయనిర్మలతో (Vijayanirmala) పాటు మద్రాసు వెళ్లి ఆదుర్తి అంత్యక్రియలకు హాజరయ్యారు. అక్కడ రెండు రోజులు వుంది మళ్ళీ మణికొండ షూటింగ్ కి వచ్చేసారు. షూటింగ్ జరుగుతూ ఉండగానే మధ్యలో కృష్ణ కి ఇంకో చేదు కబురు అందింది. కృష్ణ బాగా ఇష్టపడే, అలాగే పరిశ్రమలో కృష్ణ పెద్దదిక్కుగా భావించే చక్రపాణిగారు (Chakrapani) పోయారని. ఇలా కృష్ణకి అతి దగ్గరి వ్యక్తులు ఇద్దరు పోవడం బాధనిపించింది. ఇద్దరితో పని చేస్తున్న సినిమాలు విడుదల కాకముందే వాళ్ళు పోవటం ఇంకా బాధాకరం. 'రాజేశ్వరి విలాస కాఫీ క్లబ్' కి నిర్మాత చక్రపాణి గారు, అలాగే ఆదుర్తితో చేసిన చివరి సినిమా 'గాజుల కిష్టయ్య' #GajulaKishtayya విడుదల కాకపోవటం.

paadipantalu3.jpg

ఇలా బాధల మధ్యలోనే 'పాడిపంటలు' సినిమా ఎలా అయినా సంక్రాంతికి విడుదల చెయ్యాలని రాత్రి, పగలు పని చేస్తున్నారు అందరూ. ఆలా పని చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి పద్మాలయా వారి 'పాడిపంటలు' సంక్రాంతికి విడుదల అని పేపర్ లో ప్రకటన ఇచ్చారు కృష్ణ. అది చూసి వెంటనే నవయుగ ఫిలిమ్స్ (NavayugaFilms) డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ రావు, కృష్ణ దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు. అతని కృష్ణకి బాగా కావాల్సిన వ్యక్తి, అలాగే కృష్ణ సినిమాలు ఎక్కువగా ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేసాడు. అందుకని వెంటనే అతను కృష్ణకి 'పాడిపంటలు' సంక్రాంతికి వద్దు అని చెప్పారు. "నువ్వు ఫ్లాపుల్లో వున్నావు, అవతల రామారావుగారి (NTRamaRao) 'వేములవాడ భీమకవి', శోభన్ బాబు (SobhanBabu) గారి 'పిచ్చిమారాజు', అలాగే నాగేశ్వర రావు (AkkineniNageswaraRao) గారు అమెరికా నుండి వచ్చిన తరువాత చేసిన మొదటి సినిమా 'మహాకవి క్షేత్రయ్య' కూడా సంక్రాంతికే విడుదలవుతోంది, వాళ్ళందరూ ఫామ్ లో వున్నారు, నువ్వు ఫ్లాపులొ వున్నావు, కాబట్టి నా మాట విని 'పాడిపంటలు' ఫిబ్రవరి కి పోస్టుపోన్ చెయ్యి", అని చెప్పారు.

అతను ఎంత చెప్పిన కృష్ణ వినిపించుకోలేదు, "నా నిర్ణయంలో మార్పు లేదు" అని చెప్పారు కృష్ణ. "అయితే నీ ఖర్మ' అని చెప్పి వెళ్లిపోయారు నవయుగ చంద్రశేఖర్ రావు. అనుకున్నట్టుగానే 1976, జనవరి 14 న 'పాడిపంటలు' విడుదల చేశారు కృష్ణ. 'వేములవాడ భీమకవి', 'పిచ్చిమారాజు' అదే సంక్రాంతికి విడుదలయ్యాయి, ఆదుర్తి మరణంతో 'మహాకవి క్షేత్రయ్య' పోస్ట్ ఫోన్ అయింది. "నా నమ్మకాన్ని నిజం చేస్తూ, చాలామంది అంచనాలను తలకిందులు చేస్తూ, 'పాడిపంటలు' పెద్ద హిట్ అయింది," అని అన్నారు కృష్ణ. ఈ సినిమా తరువాత మంగళగిరి (Mangalagiri) సమీపంలో స్టూడియో నిర్మాణం చెయ్యాలని స్థలం కూడా చూసారు, కానీ మళ్ళీ హైద్రాబాదు బెటర్ అనుకోని అక్కడే స్టూడియో నిర్మించారు. ఈ 'పాడిపంటలు' విజయంతో కృష్ణ మళ్ళీ వెనక్కి చూసుకోలేదు.

Updated Date - 2023-08-15T15:21:21+05:30 IST