Dil Raju: 'లవ్ మీ' విడుదల వాయిదా?

ABN , Publish Date - Apr 16 , 2024 | 05:03 PM

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సోదరుడు కుమారుడు ఆశిష్ రెడ్డికి ఎలా అయినా విజయం వచ్చేట్టు చెయ్యాలని అహర్నిశలూ దగ్గరుండి అన్ని విభాగాల్లో చూసుకుంటూ వస్తున్న సినిమా 'లవ్ మీ'. ఈ సినిమా ఈనెల 25న విడుదల కావాల్సి వుంది, కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా వేయనున్నారని తెలిసింది

Dil Raju: 'లవ్ మీ' విడుదల వాయిదా?
Dil Raju and the team of Love Me

దిల్ రాజు తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డికి ఎలా అయినా విజయం వరింప చెయ్యాలని తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు 'లవ్ మీ' అనే సినిమా విడుదలకి సిద్ధం చేశారు. ఈ సినిమా విడుదల తేదీ కూడా ఏప్రిల్ 25 అని ప్రకటించిన సంగతి కూడా అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నారని తెలిసింది.

lovemeifyoudare.jpg

ఈ సినిమాకి అరుణ్ భీమవరపు దర్శకుడు కాగా, పెద్ద పెద్ద సాంకేంతిక నిపుణలని దిల్ రాజు ఈ సినిమా కోసం తీసుకు వచ్చారు. ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు, దేశంలో అత్యున్నత ఛాయాగ్రాహకుడు అయిన పీసి శ్రీరామ్ ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడిగా పని చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ఈ సినిమాకి సంగీతం అందించేందుకు తీసుకున్నారు. ఇక అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా ఇలా చాలా ప్రముఖ వ్యక్తులు ఈ సినిమాకి పని చేశారు.

Vaishnavi-Chaitanya

ఇదిలా ఉండగా 'బేబీ' సినిమాతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందిన కథానాయకురాలు వైష్ణవి చైతన్య ఈ 'లవ్ మీ' సినిమాలో ఆశిష్ రెడ్డి పక్కన చేస్తోంది. ఆమె కాకుండా ఇంకా నలుగురైదుగురు కథానాయకురాళ్లు ఉంటారని భోగట్టా. ఇంతమంది సాంకేతిక నిపుణలని తీసుకు రావటమే కాకుండా, దిల్ రాజు ప్రతిరోజు ఈ సినిమా గురించే పరితపిస్తూ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పని అంతా దగ్గరుండి చూసుకుంటున్నారు.

ashishreddy.jpg

అలాగే విడుదల తేదీ కూడా ఏప్రిల్ 25 అని అధికారికంగా ప్రకటించిన దిల్ రాజు, ఇప్పుడు ఎందుకో ఆ తేదీకి వద్దనుకున్నారు. వాయిదా వేయటమే మంచిది అనిపించి సినిమా ఇంకో రోజు విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు విపరీతమైన ఎండలు, దానికితోడు ఎన్నికల హడావిడి నడుస్తోంది, ఇంకో పక్క ఐపీఎల్ క్రికెట్ మ్యాచులు ఈ సమయంలో ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు వస్తారా అని చిన్న సందేహంతో వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. కొత్త విడుదల తేదీ ఎప్పుడనేది త్వరలోనే తెలుస్తుంది అని చెపుతున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 05:10 PM