Hanuman Jayanti: తెలుగు సినిమాలో ఆంజనేయుడు అంటే ఆర్జా జనార్దన్ రావు

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:53 PM

తెలుగు చలన చిత్ర చరిత్రలో హనుమంతుడు అంటే అర్జా జనార్దన్ రావు పేరే గుర్తుండిపోతుంది. ఎందుకంటే అతను ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయారు. ఎన్నో సినిమాలలో అతను హనుమంతుని పాత్రలు వేసి మెప్పించారు, కానీ బాపుగారి 'సంపూర్ణ రామాయణం', 'రామాంజనేయ యుద్ధం' సినిమాలలో మాత్రం అర్జా చేసిన హనుమాన్ పాత్ర కలకాలం గుర్తుండిపోయేవి

Hanuman Jayanti: తెలుగు సినిమాలో ఆంజనేయుడు అంటే ఆర్జా జనార్దన్ రావు
Hanuman Jayanti

తెలుగులో వచ్చినన్ని పౌరాణిక చిత్రాలు ఇంకే భాషలోనూ రాలేదు అని చెపుతూ వుంటారు. పౌరాణికాలకి పెట్టింది పేరు తెలుగు చలన చిత్ర పరిశ్రమ. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదట్లో ఎక్కువగా వచ్చినవి పౌరాణిక చిత్రాలే. పౌరాణిక చిత్రాల్లో కొన్ని పాత్రలకు కొంతమంది నటులు స్థిరపడిపోతారు. ఆ పాత్ర గుర్తుకు రాగానే టక్కున మనకి ఆ నటుడు గుర్తుకు వచ్చేస్తాడు. రాముడు, కృష్ణడు అనగానే ఎన్ టి రామారావు ఎలా గుర్తుకు వస్తారో, పౌరాణిక సినిమాల్లో హనుమంతుడు అనగానే ఆర్జా జనార్ధన రావు కూడా అలాగే గుర్తుకు వస్తారు.

hanumanjayanti.jpg

హనుమంతుని పాత్ర వేయాలంటే ఆర్జా జనార్ధన రావు వేస్తేనే బాగుంటుంది, ఆ పాత్రకి తగిన హుందాతనం వస్తుంది అని అంటారు. జనార్ధన రావు కూడా పొడుగ్గా ఉండటం, దానికి తోడు అతను దేహ దారుఢ్యం లాంటి పోటీల్లో పాల్గొనడం, చిన్నప్పటి నుండి ఆటలపై, కసరత్తులపై ఎక్కువ దృష్టి సారించడంతో అతని దేహ దారుఢ్యం దృఢకాయంగా ఉంటూ హనుమంతుని పాత్రకి సరిగ్గా సరిపోయేది. ఇతను మిస్టర్ ఆసియా, మిస్టర్ హెర్క్యులస్ (1954), మిస్టర్ ఇండియా (1955)గా ఎన్నికయ్యారు.

మొదటిసారిగా 1968లో కమలాకర కామేశ్వరావు దర్శకత్వంలో 'వీరాంజనేయ' సినిమాలో ఆంజనేయుని పాత్ర పోషించారు ఆర్జా జనార్దన్ రావు. ఇందులో రాముడిగా కాంతారావు, సీతగా అంజలీదేవి చేశారు. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందిన సినిమా. ఆ తరువాత ఆర్జా జనార్దన్ రావుకి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా 'సంపూర్ణ రామాయణం'. దర్శకుడు బాపుగారు శోభన్ బాబు రాముడిగా, చంద్రకళ సీతగా, ఎస్వీ రంగారావు రావణాసురిడిగా తీసిన 'సంపూర్ణ రామాయణం' (1971) లో ఆర్జా జనార్ధనరావు హనుమంతుని పాత్రలో ఒదిగిపోయారు అని చెప్పాలి. అక్కడ హనుమంతుడు మాత్రమే ప్రేక్షకులకి కనిపిస్తారు అంటే ఆ పాత్రలో అతను ఎంతగా ఇమిడిపోయారో అర్థం అవుతుంది.

hanumanaarjaa.jpg

ఆ తరువాత బాపుగారు ఇంకో పౌరాణిక సినిమా తీశారు. ఈసారి ఎన్టీఆర్ రాముడిగా, అర్జా జనార్ధన రావు హనుమంతుడిగా 'రామాంజనేయ యుద్ధం' తీశారు. ఇది 1975లో వచ్చింది, గొప్ప విజయం సాధించింది. ఇందులో పాటలు, పద్యాలు అప్పట్లో ఘన విజయం సాధించటమే కాకుండా, పల్లెల్లో పండగలకి, పబ్బాలకి ఈ సినిమా పాటలు, పద్యాలు గ్రామ్ ఫోను రికార్డు వేసేవారు. మళ్ళీ దర్శకుడు బాపుగారు 'ముత్యాల ముగ్గు' అనే సాంఘీక సినిమా తీశారు, ఇందులో చిన్న ఫాంటసీ నేపథ్యంలో హనుమంతుని పాత్ర కూడా పెట్టారు. అది కూడా అర్జా జనార్దన్ రావు వెయ్యడం విశేషం. ఇలా హనుమంతుడి అంటే అర్జా జనార్దన్ రావుని గుర్తుకు వస్తారు.

hanumanjayantione.jpg

దర్శకుడు బాపుగారు వాగ్గేయకారుడు త్యాగయ్య కథా నేపథ్యంతో తీసిన 'త్యాగయ్య' సినిమాలో కూడా అర్జా జనార్ధన రావు హనుమంతుడి పాత్రలో మెరుస్తారు. జెవి సోమయాజులు ఇందులో త్యాగయ్య పాత్ర పోషిస్తారు. రావు గోపాల రావు, కెఆర్ విజయ ఇంకో రెండు ముఖ్య పాత్రల్లో కనపడతారు. దర్శకుడు గంగ 'ఆంజనేయ చరిత్ర' అనే సినిమా తీస్తూ అందులో ప్రధాన పాత్ర అయినా ఆంజనేయుడుగా ఆర్జా జనార్ధనరావునే తీసుకున్నారు. ఈ కథ మొత్తం అతనిపైనే నడుస్తుంది. ఈ సినిమా 1981లో వచ్చింది.

దర్శకుడు సీఎస్ రావు ' శ్రీకృష్ణా౦ఙనేయ యుద్ధము' అనే సినిమా 1972లో తీశారు. ఇందులో ఎన్టీఆర్ కృష్ణుడిగా వేస్తే, ప్రముఖ నటుడు రాజనాల హనుమంతుడి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో కూడా పాటలు అప్పట్లో గొప్ప విజయం సాధించాయి. ఇందులో హనుమంతుని పాత్ర ప్రధానపాత్ర కావటం విశేషం. ఇదే సినిమాలో అర్జా జనార్ధన రావు గరుత్మంతుడి పాత్రలో కనపడతారు.

Updated Date - Apr 23 , 2024 | 12:54 PM