Tamannaah Bhatia: డబ్బులు కోసం చూసుకోకుండా ఒప్పుకుంటే చిక్కులు తప్పవు మరి

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:21 PM

బాలీవుడ్ కి చెందిన సంజయ్ దత్, అక్షయ్ కుమార్, టాలీవుడ్ కి చెందిన అల్లు అర్జున్, ఇలా చాలామంది ఇప్పుడు తాజాగా తమన్నా భాటియా కొన్ని ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల ప్రచారంలో పాల్గొనటం వలన న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఇలాంటివాటిలో నటించే ముందుగా కేవలం డబ్బుకోసం కాకుండా, ఉత్పత్తుల గురించి బాగా అధ్యయనం చేసి ప్రచారం చేస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా వుంటాయని అంటున్నారు

Tamannaah Bhatia: డబ్బులు కోసం చూసుకోకుండా ఒప్పుకుంటే చిక్కులు తప్పవు మరి
Tamannaah Bhatia, Sanjay Dutt, Akshay Kumar

తెలుగులో మహేష్ బాబు చేసినన్ని వాణిజ్య ప్రకటన చిత్రాలు మరే నటుడు చెయ్యలేదేమో, అన్ని వాణిజ్య ప్రకటనల్లో కనపడతారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తరువాత 'అల వైకుంఠపురం లో', 'పుష్ప' విజయంతో అల్లు అర్జున్ కూడా కొన్ని వాణిజ్య ప్రకటనలు ఒప్పుకున్నారు. అలాగే చాలామంది దక్షిణాదికి చెందిన నటులు, బాలీవుడ్ నటులు, నటీమణులు ఈ వాణిజ్య ప్రకటనల్లో ఎక్కువగా కనిపిస్తూ వుంటారు. అయితే ఇలాంటి వాణిజ్య ప్రకటనల్లో ఒక్కోసారి అగ్ర నటులు, నటీమణులు పాల్గొన్నప్పుడు వాళ్ళు విమర్శలు కూడా ఎదుర్కోవలసి వచ్చింది.

maheshbabucommercialadd.jpg

అల్లు అర్జున్ రాపిడో వాణిజ్య ప్రకటన చేసినప్పుడు అతనికి విమర్శలు ఎదురయ్యాయి. రాష్ట్ర రోడ్ రవాణా సంస్థని విమర్శించే విధంగా అల్లు అర్జున్ ఆ వాణిజ్య ప్రకటనలో నటించారని, అలా ఒక ప్రభుత్వ సంస్థని విమర్శించడం తగదని అల్లు అర్జున్ కి న్యాయపరమైన నోటీసులు అప్పట్లో తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే కాదు, చాలామంది అగ్ర నటులు ఇటువంటి చిక్కుల్లో పడ్డారు.

తాజాగా ఇటు దక్షిణాదిలోనూ, అటు హిందీలోనూ రాణిస్తున్న నటీమణి తమన్నాకి కూడా ఇటువంటి న్యాయపరమైన నోటీసు వచ్చింది. తమన్నా భాటియా ఒక బెట్టింగ్ యాప్ వాణిజ్య ప్రకటనలో ప్రచారంలో భాగమైనందుకు గాను, సైబర్ సెల్ నుంచి ఆమెకి నోటీసులు పంపి విచారణకు హాజరు కావాల్సి వుంది అని చెప్పారు. ఎందుకంటే బెట్టింగ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహించే కొన్ని సంస్థలపై వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలున్నాయి. అందులోకి ఈ సంస్థలు క్రికెట్ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారాలు చేసేటప్పుడు, సరైన ఒప్పందాలు కుదుర్చుకోకపోవటం, అది తెలియకుండా తమన్నా లాంటి నటులు ఆ సంస్థల వాణిజ్య ప్రకటన ప్రచారాలకు బ్రాండ్ అంబాసడర్ గా ఉండటం ఇప్పుడు చిక్కులో పెట్టింది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.

alluarjunrapidoadd.jpg

వాణిజ్య ప్రకటనల్లో అగ్ర నటులు చెయ్యడం వలన వారి తాహతుని బట్టి వారి పారితోషికం కోట్లలో ఉంటుంది. సినిమాలు కాకుండా ఇలా వాణిజ్య ప్రకటనల్లో చేస్తున్నందుకు బాగానే పారితోషికం వస్తున్నా, ఇలాంటి చిక్కులు ఉండటం వలన కొందరు ఎందుకు తలనొప్పి అని చెయ్యడం మానేశారు. అయితే వారు ఇలాంటి వాణిజ్య ప్రకటనల్లో చేసేటప్పుడు కొంచెం ముందుగా అన్నీ చూసుకొని చేస్తే పరవాలేదు, లేదా చిక్కుల్లో పడాల్సి వస్తుంది.

గతంలో అక్షయ్ కుమార్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. అతను పాన్ మసాలా వాణిజ్య ప్రకటనలో చెయ్యడం విమర్శలకి తావిచ్చింది. టొబాకో బ్రాండ్స్ కి అగ్ర నటులు ఇచ్చినప్పుడు అభిమానులు వారిని తీవ్రంగా విమర్శించడం పరిపాటి. ఎందుకంటే ఒకపక్క సినిమా ప్రారంభం అయ్యే ముందు థియేటర్ లో సిగరెట్, పాన్ మసాలా లాంటివి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటూ మళ్ళీ అదే నటులు వాటిని ప్రమోట్ చెయ్యడానికి వాణిజ్య ప్రకటనల్లో కనిపించినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురుకొంటున్నారు. అక్షయ్ కుమార్ తన అభిమానులకి క్షమాపణలు చెప్పి ఇకముందు ఇలాంటి వాటిని ప్రమోట్ చెయ్యని అని కూడా చెప్పారు.

tamannaahveryhotphotos.jpg

బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ ఏదైనా ఒక ఉత్పత్తిని ప్రచారం చెయ్యడానికి ఒప్పుకుంటే, ఆ ఉత్పత్తి గురించి పూర్తిగా తెలుసుకొని, అది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనే విషయంపై కూలంకషంగా తర్ఫీదు చేసుకొని అప్పుడు ఒప్పుకుంటారు అని అంటారు. ఆలా చెయ్యడం వలన కొంత విమర్శలు తప్పుతాయి. లేదా మన డబ్బులు మాకొచ్చాయి, ఏ ఉత్పత్తి అయితే మనకేంటి, ప్రచార చిత్రీకరణ అయిపొయింది అని నటీనటులు అనుకుంటే, ఇక వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు విమర్శలు ఎదుర్కోక తప్పదు.

ఇప్పుడు చూడండి, తమన్నా తప్పు ఏమీ లేదు, కానీ ఆ వాణిజ్య ప్రచార ప్రకటన చేసినందుకు ఆమె విచారణను ఎదురుకోవాల్సి వచ్చింది. ఇంతకు ముందు కూడా చాలామంది నటీనటులు ఇలాంటివే ఎదుర్కన్నా, ఈ తమన్నా విషయంతో ఇకముందైనా తెలుసుకొని వాణిజ్య ప్రకటనల్లో పాల్గొంటారు అని ఆశిద్దాం.

Updated Date - Apr 27 , 2024 | 04:21 PM