Vijay Antony: చాలా రోజులు అరటిపళ్ళు తిని బతికా..

ABN , First Publish Date - 2023-05-16T16:27:52+05:30 IST

‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) చిత్రం మే 19న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విజయ్‌ ఆంటోనీ సినిమా గురించే కాకుండా.. తన వ్యక్తిగత జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు, ఆకలి కేకల గురించి చెప్పుకొచ్చారు. అవేంటో ఆయన మాటల్లోనే..

Vijay Antony: చాలా రోజులు అరటిపళ్ళు తిని బతికా..
Vijay Antony

విజయ్ ఆంటోనీ(Vijay Antony) చిత్రాలెప్పుడూ ప్రత్యేకతను సంతరించుకుని ఉంటాయి. అందుకే ఆయన చిత్రాలకు ప్రత్యేక అభిమానులుంటారు. ముఖ్యంగా ‘బిచ్చగాడు’ (Bichagadu) సినిమాతో కోలీవుడ్‌‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా మంచి విజయాన్ని, ఎందరో అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మల్టీ టాలెంట్ ప్రదర్శిస్తూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ని, స్టేటస్‌ని ఆయన క్రియేట్ చేసుకున్నారు. సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఇలా పలు క్రాఫ్ట్స్‌లో తనదైన తరహాలో విజయ్ ఆంటోని దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) చిత్రం మే 19న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విజయ్‌ ఆంటోనీ సినిమా గురించే కాకుండా.. తన వ్యక్తిగత జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు, ఆకలి కేకల గురించి చెప్పుకొచ్చారు. అవేంటో ఆయన మాటల్లోనే..

vijay-1.jpg

‘‘మాది తమిళనాడు (Tamil Nadu)లోని నాగర్‌కోయిల్‌. నాన్న గవర్నమెంట్ ఆఫీస్‌లో క్లర్క్‌గా పని చేసేవారు. నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. ఆయన చనిపోవడంతో.. అప్పటి వరకు సాఫీగా సాగిన మా కుటుంబం ఒక్కసారిగా తలకిందులైంది. కుటుంబ భారం మొత్తం అమ్మపైనే పడింది. సొంత ఇల్లు లేదు. ఎక్కడ ఉండాలో కూడా తెలియదు.. అప్పుడు బంధువుల ఇళ్లల్లో కొన్నాళ్లు ఉన్నాం. ఆ తర్వాత నాన్న ఉద్యోగం అమ్మకు ఇచ్చారు. అమ్మకు ఉద్యోగం వచ్చిందనే ఆనందంలో మాకు వెంటవెంటనే షాకులు తగిలాయి.

Vijay-2.jpg

అమ్మకు ఉద్యోగం వచ్చిన చోట.. ఉండటానికి మాకెవరూ ఇల్లు అద్దెకు ఇవ్వలేదు. దీంతో అమ్మ ఎంతో బాధపడింది. ఆ చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్‌లో మేము ముగ్గురం జాయిన్‌ అయ్యాం. మమ్మల్ని కలవడానికి అమ్మ ప్రతి రోజూ మేముండే హాస్టల్‌కి వచ్చేది. కానీ హాస్టల్ వాళ్లు రావద్దని కండీషన్ పెట్టారు. అలా రోజూ వస్తే.. మిగతా పిల్లలు బాధపడతారని చెప్పి అమ్మను హాస్టల్‌కు రావద్దని అన్నారు. అప్పటి నుంచి మేమంతా వారానికి ఒక్కసారి మాత్రమే కలుసుకునేవాళ్లం. అప్పుడే అమ్మకి వేరే చోటకి ట్రాన్స్‌ఫర్ అయింది. చెల్లిని తీసుకుని అమ్మ అక్కడికి వెళ్లిపోయింది. వారు వెళ్లిన కొన్ని రోజులకు నేనుండే హాస్టల్‌కు సెలవులు ఇచ్చారు. అప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక శ్రీలంక (Srilanka) శరణార్థ విద్యార్థులతో కలిసి కొన్నాళ్లు ఉండిపోయాను. అప్పుడు కేవలం అరటిపళ్ళే నా ఆహారం. అలా చాలా రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది.

Vijay-3.jpg

ఆ సమయంలోనే సినిమా వాళ్లకు రాజభోగాలు ఉంటాయని అర్థమైంది. అందుకే సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నా. ఈ విషయం అమ్మకు చెప్పా. ఆ తర్వాత చదువు నిమిత్తం చెన్నైకి వచ్చేశా. చదువుకుంటూనే మరో వైపు సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేశా. నాకు తెలిసిన స్నేహితుల వద్ద సౌండ్‌ ఇంజనీరింగ్‌లో మెళకువలు నేర్చుకున్నా. నేను కట్టిన కొన్ని ట్యూన్స్‌ను సీడీగా చేసి ఓ సంస్థకు పంపించా. వాళ్లే నాకు సీరియల్స్‌లో అవకాశం ఇచ్చారు. అలా.. ఎలాంటి శిక్షణ లేకుండానే మ్యూజిక్‌ డైరెక్టర్‌‌ని అయ్యాను. ‘డిష్యుం’ (Dishyum) తో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సక్సెస్‌ అందుకున్నా. ఆ తర్వాత తమిళం, కన్నడతోపాటు తెలుగులో వచ్చిన ‘మహాత్మ’ (Mahatma), ‘దరువు’ (Daruvu) చిత్రాలకు స్వరాలు అందించాను. అదే సమయంలో కొన్ని సినిమాలకు ఎడిటర్‌ (Editor)గా కూడా పని చేశా. సంగీత దర్శకుడిగా (Music Director) మంచి పేరు వచ్చినా.. ఏదో తెలియని వెలితి నన్ను వెంటాడేది. నేను చిన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిందే నటుడవ్వాలని. ఎన్ని చేస్తున్నా.. నటుడవ్వాలనే నా కోరిక మాత్రం నన్ను బలంగా నడిపిస్తుండేది. ఇంట్లో వాళ్లకి ఈ విషయం తెలిసి.. మొదట షాకయ్యారు. అంతా బాగానే నడుస్తుంది కదా.. ఇప్పుడెందుకు అని అన్నారు. అయినా సరే.. వినలేదు. నా మనసు చెప్పినట్లు ముందుకు వెళ్లిపోయా.

Vijay-4.jpg

‘విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌’ (Vijay Antony Film Corporation) అనే బ్యానర్‌ స్థాపించి.. ‘నాన్‌’తో హీరోగా ఎంట్రీ ఇచ్చా. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘నకిలీ’ (Nakili) పేరుతో విడుదలై మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత నేను చేసిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. వాటిలో ‘బిచ్చగాడు’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి నా ప్రతి చిత్రం తెలుగులోనూ రిలీజ్‌ చేస్తున్నాను. ‘బిచ్చగాడు 2’ విషయానికి వస్తే.. ఇది సీక్వెల్‌ కాదు. మొదటి దానితో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ సినిమాలో సోదరి సెంటిమెంట్‌ ఉంటుంది. ఇది కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నా’’ అని విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Nikhil: అమిత్ షా నుంచి నాకూ ఆహ్వానం వచ్చింది.. కానీ?

*Tiger Nageswara Rao: ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్సయింది.. ఈ సారి వేట మామూలుగా ఉండదట!

*Anasuya: రంగమ్మత్త కాదు.. సుమతిగా బోల్డ్ క్యారెక్టర్‌లో!

*Spy Teaser: ‘కార్తికేయ 2’ని మించి.. నిఖిల్ మరో సాహసం చేస్తున్నాడు

*AadiKeshava Glimpse: పంజా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం

Updated Date - 2023-05-16T16:27:52+05:30 IST