'జాడి' కథతో ప్రసిద్ధులైన 'నేనే సరోజ' నిర్మాత సదానంద్ కన్నుమూత!

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:00 AM

ప్రముఖ రచయిత, నిర్మాత సదానంద్‌ శారద కన్నుమూశారు. వందకు పైగా కథలు రాసిన ఆయన 'నేనే సరోజ' పేరుతో సినిమాను నిర్మించారు.

Sadanad Sarada

ప్రముఖ రచయిత సదానంద్‌ శారద మృతి విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలుగు సాహిత్యంలో సదానంద్‌ శారదకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన దాదాపు 150 కథలు రాశారు. 'జాడి, గొలుసు, పాల కంకి , సదానంద్ శారద కథలు' పేరిట నాలుగు కథా సంపుటాలు వెలువడినాయి. రచయిత సదానంద్ శారద కథలే కాకుండా రెండు నవలలను కూడా రాశారు. అంటరానితనం, తాగునీటి సమస్యపై వచ్చిన నవల 'మంచినీళ్ళ బావి'. అలానే 'ఆవలి తీరం' పేరుతో మరో నవల రాశారు. వరంగల్‌లో పుట్టి పెరిగిన పాకాల సదానంద్ ఉస్మానియాలో చదివి కామర్స్ లెక్చరర్ గా పనిచేశారు. సదానంద్ వివాహనంతరం, తన భార్య పేరును కలుపుకుని సదానంద్‌ శారదగా రచనలు చేశారు. మేడిగడ్డలో ఇట్టు కట్టుకుని విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న ఆయన సెప్టెంబర్‌ 24న తుది శ్వాస విడిచారనే విషయం ఆలస్యంగా సాహితీ లోకానికి తెలిసింది. సదానంద్‌ దశదిన కర్మ అక్టోబర్ 4న స్వగృహంలో జరుపుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.


విశేషం ఏమంటే... సహజంగా రచయితల సినిమాలు వేరే నిర్మాతలు సినిమాలుగా తీస్తుంటారు. కానీ సదానంద్‌ శారద ధైర్యం చేసిన తన రచనను, తానే సినిమాగా నిర్మించారు. శ్రీమాన్‌ గుమ్మడవెల్లి దర్శకత్వంలో సదానంద్‌ శారద కథ, మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చుతూ 'నేనే సరోజ' అనే సినిమాను నిర్మించారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈ సినిమా 2023 అక్టోబర్ 6న విడుదలైంది. ఈ సినిమాలో ఆయనో కీలక పాత్ర కూడా పోషించారు. కౌశిక్‌ బాబు, శాన్వీ మేఘన జంటగా నటించిన ఈ సినిమాలో చంద్రమోహన్‌, ఆనంద చక్రపాణి, సుమన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి:

కన్యత్వం చుట్టూ తిరిగే బోల్డ్ కథతో సినిమా.. సమంత బంగారమే స్ఫూర్తట

ఈ వారం మూడు కొత్త సినిమాలు.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయండి

ఫెడరేషన్ అధ్యక్షుడిపై జానీ మాస్టర్ వైఫ్ సుమలత యుద్ధం మొదలు

Updated Date - Oct 01 , 2026 | 11:22 AM