Venkatesh: ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్‌.. 'ది పారడైజ్'ను స్ఫూర్తిగా తీసుకున్నారా? 

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:10 PM

విక్టరీ వెంకటేశ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

విక్టరీ వెంకటేశ్‌(Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ (Adharsha kutumbam)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా సినిమా విడుదల వాయిదా పడటంతో ఇప్పుడు మరో చర్చ మొదలైంది. ఈ సినిమాకు ట్రైలర్‌ విడుదల చేస్తారా? లేక ఎలాంటి ట్రైలర్‌ లేకుండానే నేరుగా థియేటర్లలోకి తీసుకొస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలే ఈ చర్చకు ప్రధాన కారణంగా నిలిచాయి. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ‘ది ప్యారడైజ్‌’ సినిమాకు ట్రైలర్‌ కట్‌ చేయలేదని ఆయన తెలిపారు. సినిమా కథ, కీలక సన్నివేశాలను ముందుగానే ప్రేక్షకులకు చూపించకుండా నేరుగా థియేటర్లలో అనుభూతి చెందేలా చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో ‘ఆదర్శ కుటుంబం’ విషయంలోనూ ఇదే ప్రమోషన్‌ స్ట్రాటజీని అనుసరిస్తారా అన్న చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతం దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ‘ది ప్యారడైజ్‌’కు ట్రైలర్‌ లేకపోవడాన్ని ఉదాహరణగా చెప్పారు.  అదే విధానాన్ని ‘ఆదర్శ కుటుంబం’కు కూడా అమలు చేస్తారని చెప్పలేం. వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ట్రైలర్‌ ద్వారా సినిమాపై మరింత హైప్‌ తీసుకురావాలనే ఆలోచన మేకర్స్‌కు ఉండొచ్చు. మరోవైపు త్రివిక్రమ్‌ మార్క్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎక్కువగా రివీల్‌ చేయకుండా నేరుగా థియేటర్లలో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకుంటే ట్రైలర్‌ను పక్కన పెట్టే అవకాశమూ ఉంది.

Updated Date - Oct 06 , 2026 | 05:16 PM