మాకు టాక్సిక్ వద్దు.. ఇరుముడి కావాలి!
ABN, Publish Date - Aug 27 , 2026 | 06:32 PM
విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఇరుముడి సినిమా చుట్టూ రోజురోజుకూ మరింత క్రేజ్ పెరుగుతోంది.
మాస్ మహారాజా రవితేజ ( raviteja) నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ (irumudi) ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంటోంది. విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా చుట్టూ రోజురోజుకూ మరింత క్రేజ్ పెరుగుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టి టాలీవుడ్‌ను సంబ్రమాశ్యర్యాలకు గురి చేస్తోంది. ఇరుముడి’ విడుదలైన తర్వాత పట్టణాలు, నగరాలు మాత్రమే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ మంచి స్పందన అందుకుంటోంది.
కొన్ని ప్రాంతాల్లో అదనపు షోలు, మరికొన్ని చోట్ల కొత్త స్క్రీన్ల కోసం ప్రేక్షకుల నుంచి డిమాండ్ అంతకతకూ పెరుగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సినిమాకు వస్తున్న స్పందన విశేషంగా ఉంది. సినిమాలోని ఎమోషనల్ అంశాలు, యాక్షన్ ఎపిసోడ్స్, రవితేజ నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కుటుంబ ప్రేక్షకులు సైతం థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ పాజిటివ్ టాక్ కారణంగానే విడుదలైన రోజులతో పోలిస్తే తర్వాతి రోజుల్లో కూడా ఆక్యుపెన్సీ స్థాయిలు బలంగా కొనసాగుతున్నాయి.
ఇప్పటికే తెలంగాణ మక్తల్‌లో ప్రేక్షకులు మాకు ఇరుముడి సినిమా ప్రదర్శించాలంటూ రొడ్డెక్కిన పరిస్థితి మరువకు ముందే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ ఉప్పల్ (Uppal) ) లోని ఏషియన్ రాజ్యలక్ష్మి (Asian Rajya Lakshmi) థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటన ఇరుముడి సినిమాకు ఏర్పడిన క్రేజ్‌ను ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. కాగా బుధవారం ఈ థియేటర్‌లో ఇరుముడి స్థానంలో టాక్సిక్ సినిమా ప్రదర్శిస్తుండగా స్తానికులు ఫైర్ అయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం నుంచి స్థానిక ప్రేక్షకులు, అభిమానులు ఈ థియేటర్‌లో కూడా ‘ఇరుముడి’ ప్రదర్శించాలని కోరుతూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ వద్ద అభిమానులు తమ అభిమాన హీరో సినిమాను చూడాలన్న ఉత్సాహంతో నినాదాలు చేస్తూ కనిపించారు. మొత్తంగా చూస్తే ‘ఇరుముడి’పై ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తి, థియేటర్ల వద్ద కనిపిస్తున్న సందడి చూస్తంఉటే రాబోయే రోజుల్లో సినిమా ఏ స్థాయి వరకు వెళ్లి చేరుతుందో అని అటు సినీ లవర్స్, ఇండస్ట్రీ పెద్దలు ఆసక్తిగా చూస్తున్నారు.