గొప్ప మనసు చాటుకున్న వినోద్ కుమార్.. ఏం చేశారంటే

ABN , Publish Date - Aug 26 , 2026 | 01:28 PM

వెండితెరపై నటుడిగానే కాకుండా, నిజ జీవితంలోనూ నటుడు వినోద్ కుమార్ మంచి మనసుతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంటారు. ముఖ్యంగా తన వద్ద పనిచేసే సిబ్బందిని, తనను అభిమానించే వారిని కుటుంబ సభ్యుల్లా ఆదరించే గొప్ప వ్యక్తిత్వం ఆయనది.

Vinod Kumar generosity

‘‘కర్తవ్యం, మౌన పోరాటం, భారత్ బంద్, పీపుల్స్ ఎన్‌కౌంటర్, మామగారు, సీతారత్నం గారి అబ్బాయి’’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ నటుడు వినోద్ కుమార్ (Vinod Kumar). వెండితెరపై నటుడిగానే కాకుండా, నిజ జీవితంలోనూ తన మంచి మనసుతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంటారు. ముఖ్యంగా తన వద్ద పనిచేసే సిబ్బందిని, తనను అభిమానించే వారిని కుటుంబ సభ్యుల్లా ఆదరించే గొప్ప వ్యక్తిత్వం ఆయనది. తాజాగా ఆయన కనబరిచిన ఔదార్యం వినోద్ కుమార్‌లోని మానవత్వానికి, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.


తాడేపల్లిగూడెంకు చెందిన సతీష్ (Sathish) సుమారు 20 ఏళ్ల పాటు వినోద్ కుమార్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా, పర్సనల్ టచప్ బాయ్‌గా నమ్మకంగా పనిచేశారు. అనంతరం కుటుంబ బాధ్యతల రీత్యా తాడేపల్లిగూడెం చేరుకుని సెక్యూరిటీ గార్డ్ ఏజెన్సీతో పాటు మిత్రుడి ఆసుపత్రి వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే, ఇటీవల ‘పరదేశి’ అనే సినిమా షూటింగ్ నిమిత్తం తాడేపల్లిగూడెం వచ్చిన వినోద్ కుమార్.. తన పాత సహాయకుడిని ఏమాత్రం మర్చిపోలేదు. సతీష్‌ను ప్రత్యేకంగా పిలిపించుకోవడమే కాకుండా, స్వయంగా అతని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో దాదాపు రెండు గంటలకు పైగా సరదాగా గడిపారు. వారిచ్చిన ఆతిథ్యాన్ని ఆప్యాయంగా స్వీకరించి, సతీష్ తల్లి చేతిలో బట్టలు కొనుక్కోవాలంటూ రూ. 20,000 పెట్టి తన పెద్ద మనసును చాటుకున్నారు.


satish.jpg

ఈ సందర్భంగా సతీష్ తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ వినోద్ కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘వినోద్ కుమార్ వద్ద 20 ఏళ్లు పనిచేసినా, ఆయన నన్ను ఎప్పుడూ ఒక వర్కర్‌లా చూడలేదు. ఊరికి వచ్చిన తర్వాత కూడా నెలకు రెండు మూడు సార్లు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవారు. ప్రతి పండక్కీ మా కుటుంబానికి బట్టల కోసం డబ్బులు పంపుతారు. రెండేళ్ల క్రితం నాకు బైపాస్ సర్జరీ అయినప్పుడు రూ. 50,000 పంపి ఆదుకున్నారు. ఇప్పుడు షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చి, మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించడం నా జీవితంలో మర్చిపోలేను. షూటింగ్ స్పాట్‌లో పాత రోజులను గుర్తుచేస్తూ నాతోనే టచప్ చేయించుకున్నారు. ఆయన కుమారుడు త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నారు. నా చేతుల్లో పెరిగిన ఆ బాబు తండ్రిని మించిన గొప్ప హీరో కావాలని కోరుకుంటున్నాను’’ అని సతీష్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ట్వీట్.. వాట్టే టైమింగ్

2.5 కోట్లతో భారతీరాజా స్మారక మండపం.. సీఎం విజయ్‌పై ప్రశంసలు

Toxic Twitter Review: ‘ఇరుముడి’కి థియేటర్లు పెంచుకోవచ్చట!

Updated Date - Aug 26 , 2026 | 01:28 PM