Vijay Devarakonda: విజయ్ ఫ్యాన్స్ కు రాహుల్ హామీ
ABN, Publish Date - Jan 22 , 2026 | 03:18 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులంతా అతని రాబోయే సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు. తమ దాహార్తిని తీర్చమంటూ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ను వేడుకొంటున్నారు. వారికి రాహుల్ అభయహస్తాన్ని అందించాడు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు సాలీడ్ సక్సెస్ వచ్చి చాలా యేళ్ళు గడిచిపోయింది. అయినా ఏదో ఒక సినిమాతో తమ హీరో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కకపోతాడా అని అతని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే వారి ఆశలను అడియాసలు చేసే సినిమాలు వస్తున్నాయి కానీ వారి విజయ దాహార్తిని తీర్చే చిత్రాలు మాత్రం రావడం లేదు. ఇప్పుడిక వారంతా విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityan) తెరకెక్కించబోతున్న సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో రష్మిక మందణ్ణ (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండటం వారికో శుభసూచకంగా కనిపిస్తోంది.
త్వరలో పెళ్ళిపీటలెక్కబోతున్న విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ ఇంతవరకూ రెండు సినిమాల్లో నటించారు. అందులో వీరి తొలి చిత్రం 'గీత గోవిందం' (Geetha Govindam) గ్రాండ్ విక్టరీని అందుకోగా, 'డియర్ కామ్రేడ్' గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంది. అయితే వీరిద్దరూ బాగా కనెక్ట్ అయ్యింది మాత్రం రెండో సినిమాతోనే! 'డియర్ కామ్రేడ్' (Dear Comrade) చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఇప్పుడు విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాను రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. గతంలో రాహుల్... విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' (Taxiwala) మూవీని తెరకెక్కించాడు. అది మంచి విజయాన్నే అందుకుంది.
అయితే... విజయ్ దేవరకొండ సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్న నేపథ్యంలో ఓ అభిమాని రాహుల్ సాంకృత్యన్ కు ఓ లేఖను రాశాడు. దానిని స్వయంగా రాహుల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'డియర్ కామ్రేడ్' సినిమా నుండి విజయ్ దేవరకొండ నటించిన ప్రతి సినిమాకూ తన స్నేహితులను, కుటుంబ సభ్యులను తీసుకుని వెళుతున్నానని, కానీ అలా వెళ్ళిన ప్రతిసారి తనకు నిరాశే ఎదురైందని ఆ అభిమాని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఎంతో కాలంగా తమ హీరోకు సరైన విజయం అనేది దక్కలేదని, కనీసం ఈ సినిమాతో అయినా ఆయన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించమని ఆ అభిమాని వేడుకున్నాడు. విజయ్ దేవరకొండ అందుకుంటున్న పరాజయాలతో తన వారి ముందు తలెత్తుకోలేకుండా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా ప్రారంభం నుండి తొలికాపీ రెడీ అయ్యే వరకూ ఎడిటింగ్ దశలోనూ విజయ్, రాహుల్ పక్కనే ఉండాల్సిందిగా ఆ అభిమాని కోరుకున్నాడు. అతని ఆవేదన అర్థవంతమైంది కావడంతో దానిపై రాహుల్ సాంకృత్యన్ స్పందించాడు. అభిమానుల ఆకలిని తీర్చే విధంగా సినిమా ఉంటుందని, అందుకు తాను హామీ ఇస్తున్నానని రాహుల్ తెలిపాడు. మరి విజయ్ దేవరకొండ అభిమానులు పెట్టుకున్న ఆశలను రాహుల్ ఏ మేరకు నెరవేర్చుతాడో చూడాలి.