40 ఏళ్ళ విక్టరీ వెంకటేశ్ సినీ ప్రస్థానం.. ఈ విషయాలు తెలుసా

ABN , Publish Date - Aug 15 , 2026 | 04:41 PM

హీరోగా విక్టరీ వెంకటేశ్ తొలి సినిమా ‘మనవూరి పాండవులు’ ఆగస్ట్ 14తో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంటే వెంకటేశ్ తెర వయసు నాలుగు పదులే అన్నమాట,

Victory Venkatesh

హీరోగా విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) తొలి సినిమా ‘మనవూరి పాండవులు’ ఆగస్ట్ 14తో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంటే వెంకటేశ్ తెర వయసు నాలుగు పదులే అన్నమాట. ఈ నాలుగు దశాబ్దాలలో వెంకటేశ్ కెరీర్ సాగిన తీరును గమనిస్తే..

పదేళ్ళ వయసులో వెంకటేశ్ తొలిసారి తన తండ్రి డి. రామానాయుడు నిర్మించిన ‘ప్రేమనగర్’ సినిమాలో చిన్నప్పటి సత్యనారాయణగా నటించారు. ఆ తరువాత మళ్ళీ తెరపై కనిపించలేదు. అమెరికాలో చదువు పూర్తి చేసుకొని వచ్చాక వెంకటేశ్ మనసులోని కోరిక తెలుసుకున్న డి. రామానాయుడు ‘కలియుగ పాండవులు’తో తనయుడిని హీరోగా పరిచయం చేశారు. అలా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు వెంకటేశ్ రూపంలో సొంత హీరో దొరికారు. ‘కలియుగ పాండవులు’కు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీతో ఖుష్బూ తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. పరుచూరి బ్రదర్స్ రచనతో రూపొందిన ‘కలియుగ పాండవులు’ చిత్రం 1986 ఆగస్ట్ 14న విడుదలైంది. ఆ చిత్రం నటునిగా వెంకటేశ్‌కు మంచి పేరు సంపాదించి పెట్టింది.


ఆరంభంలో వరుస ఫ్లాపులు పలకరించిన వెంకటేశ్‌కు బి. గోపాల్ డైరెక్షన్‌లో రూపొందిన ‘రక్తతిలకం’ మంచి విజయాన్ని అందించింది. ఆ పై గోపాల్ దర్శకత్వంలోనే రూపొందిన ‘బొబ్బిలి రాజా’ బంపర్ హిట్‌ను సొంతం చేసింది. ‘శత్రువు, కూలీ నంబర్ వన్, క్షణక్షణం’ చిత్రాల తరువాత వెంకటేశ్ నటించిన ‘చంటి’ ఇండస్ట్రీ హిట్‌గా వెలిగింది. ఈ మూవీ హిందీ రీమేక్ ‘అనాడీ’లోనూ వెంకటేశ్ నటించి బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. వరుసగా రీమేక్ మూవీస్‌లో నటిస్తూ సందడి చేశారు వెంకటేశ్. ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, ప్రేమించుకుందాం రా, పెళ్ళిచేసుకుందాం, సూర్యవంశం, గణేశ్, ప్రేమంటే ఇదేరా, రాజా’ సినిమాలతో వరుస విజయాలు చూశారు వెంకటేశ్. ‘కలిసుందాం రా, జయం మనదేరా, నువ్వు నాకు నచ్చావ్, వసంతం, మల్లీశ్వరి, సంక్రాంతి, లక్ష్మీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, తులసి, నమో వేంకటేశ’ వంటి సినిమాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


Kaliyuga-Pandavulu.jpg

పలుమార్లు వరుస విజయాలతో సాగిన వెంకటేశ్ నటునిగానూ తనదైన బాణీ పలికించారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను రంజింప చేశారు. ‘ప్రేమ’ చిత్రంతో తొలిసారి ఉత్తమనటునిగా నంది అవార్డు అందుకున్న వెంకటేశ్.. తరువాత ‘ధర్మచక్రం, గణేశ్, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలతోనూ బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డుని సొంతం చేసుకున్నారు. ఐదుసార్లు ఉత్తమ నటునిగా నందిని అందుకున్న ఏకైక హీరోగా నిలిచారు వెంకటేశ్. ప్రేక్షకుల రివార్డులతో పాటు ప్రభుత్వ అవార్డులూ సొంతం చేసుకున్న వెంకటేశ్.. యంగ్ హీరోస్ తోనూ నటించి సక్సెస్ చూశారు. గత యేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో భారీ విజయం సాధించిన వెంకటేశ్ ‘నాట్ ఔట్’గానే సాగుతున్నారు. తన తరం హీరో చిరంజీవితో కలసి ‘మన శంకర వరప్రసాద్ గారు’లో నటించి ఆకట్టుకున్నారు వెంకీ. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘ఆదర్శకుటుంబం AK47’లోనూ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మరో చిత్రంలోనూ నటిస్తున్నారాయన. రాబోయే సినిమాలతోనూ వెంకటేశ్ అలరిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Sunday TV Movies: ఆదివారం.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే

నా మాటలను వక్రీకరించారు: ట్రోలింగ్‌పై అనసూయ సంచలన పోస్ట్

Updated Date - Aug 15 , 2026 | 04:55 PM