కమెడియన్ ఆలీకి అరుదైన గౌరవం..

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:32 PM

తెలుగు చిత్రసీమలో తనదైన విలక్షణ నటనతో, తిరుగులేని హాస్యంతో కోట్లాది మంది అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ యాక్టర్ ఆలీ (Ali)కి అరుదైన గౌరవం లభించింది.

Actor Ali

తెలుగు చిత్రసీమలో తనదైన విలక్షణ నటనతో, తిరుగులేని హాస్యంతో కోట్లాది మంది అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ యాక్టర్ ఆలీ (Ali)కి అరుదైన గౌరవం లభించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగానికి పరిచయమై, కమెడియన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, టీవీ హోస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న ఆలీ ఇప్పటివరకు 1100కి పైగా చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులు నవ్విస్తూ, మైమరపిస్తున్న ఆయన విశేష సేవలను గుర్తించి అబ్దుల్ కలామ్ ఫౌండేషన్, పర్వాజ్ మీడియా గ్రూప్ సంయుక్తంగా ఆలీని బిగ్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపిక చేశాయి.


దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగిన అవార్డుల వేడుకలో, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే చేతుల మీదుగా ఆలీ ఈ ప్రతిష్టాత్మక డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ అవార్డును అందుకోగా, అక్కడ హాజరైన ప్రముఖులు ఆయన్ను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా నటుడు ఆలీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒక తెలుగు నటుడిగా ఢిల్లీ స్థాయిలో ఇంతటి గౌరవప్రదమైన పురస్కారాన్ని అందుకోవడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందంటూ అవార్డు కమిటీకి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.


సినిమా రంగానికే కాకుండా సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన అనేకమంది ప్రముఖులకు కూడా ఈ వేడుకలో కమిటీ అవార్డులను అందజేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా పలు క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న ఆలీకి ఈ నేషనల్ లెవెల్ గుర్తింపు దక్కడం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

సెట్‌లో ప్రమాదం.. ఇమ్రాన్ హష్మీకి తప్పిన ప్రాణాపాయం

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాల విడుదల వాయిదా

RC17: కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు పూర్తి

Updated Date - Oct 14 , 2026 | 05:32 PM