విక్టరీ వెంకటేశ్ అక్టోబర్ సెంటిమెంట్.. మరోసారి కలిసొస్తుందా?
ABN , Publish Date - Sep 19 , 2026 | 09:08 AM
మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లో సాగుతోన్న విక్టరీ వెంకటేశ్ ఈ అక్టోబర్‌లో ‘ఆదర్శకుటుంబం’తో రాబోతున్నారు. అక్టోబర్ 2న ఈ చిత్రం జనం ముందుకు వస్తోంది. అచ్చివచ్చిన నెలలో వెంకటేశ్ మూవీ రిలీజ్ అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లో సాగుతోన్న విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) ఈ అక్టోబర్‌లో ‘ఆదర్శకుటుంబం’ (Aadarsha Kutumbam)తో రాబోతున్నారు. అక్టోబర్ 2న ఈ చిత్రం జనం ముందుకు వస్తోంది. అచ్చివచ్చిన నెలలో వెంకటేశ్ మూవీ రిలీజ్ అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. మరి అక్టోబర్‌లో వెంకటేశ్ చిత్రప్రయాణం ఎలా సాగిందో చూద్దాం.
‘విక్టరీ’ అనే పదాన్ని వెంకటేశ్ పేరు ముందు తగిలించినప్పుడు కొన్ని కామెంట్స్ వినిపించాయి. అయితే ‘విక్టరీ’ పదం విలువ పెంచుతూ వెంకటేశ్ సక్సెస్ రూటులో సాగిపోయారు. అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. పలు బ్లాక్ బస్టర్స్‌నూ, అనేక బాక్సాఫీస్ రికార్డ్స్‌నూ అందుకున్నారు వెంకీ. అయినా ఈ నాటికీ ‘ఫ్యామిలీ హీరో’ ఇమేజ్‌తోనే సాగుతున్న వెంకటేశ్ రాబోయే ‘ఆదర్శకుటుంబం- ఏకే 47’లోనూ అదే తీరున కనిపిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ఇటీవలే రిలీజై.. జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘హారికా అండ్ హాసినీ’ పతాకంపై యస్. రాధాకృష్ణ నిర్మించిన ‘ఆదర్శకుటుంబం’ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. వెంకటేశ్‌కు సంక్రాంతి సీజన్ అచ్చివచ్చినట్టే అక్టోబర్ మాసం కూడా కలసివచ్చింది. వెంకటేశ్ హీరోగా అక్టోబర్‌లో ఇప్పటి వరకు రిలీజైన సినిమాల్లో అధిక శాతం విజయం సాధించాయి. అదీ విశేషం.. అందువల్లే ఫ్యాన్స్ ‘ఆదర్శ కుటుంబం’ కూడా అదరహో అనిపిస్తుందని ఆశిస్తున్నారు.
వెంకటేశ్ కెరీర్‌లో అక్టోబర్‌లో రిలీజైన మొట్టమొదటి సినిమా ‘వారసుడొచ్చాడు’. 1988 అక్టోబర్ 3న విడుదలైన ‘వారసుడొచ్చాడు’ మంచి విజయం సాధించింది. 1991లో వచ్చిన ‘క్షణక్షణం’ ఆకట్టుకుంది. 1992 అక్టోబర్ 2న విడుదలైన ‘సుందరకాండ’ బంపర్ హిట్టయింది. 1994లో వచ్చిన ‘ముద్దుల ప్రియుడు’ అంతగా ఆకట్టుకోకపోయినా, 1996 అక్టోబర్ 17న జనం ముందు నిలచిన ‘పవిత్రబంధం’ సూపర్ హిట్ అయింది. ఆ మరుసటి సంవత్సరం అక్టోబర్ 9న రిలీజైన ‘పెళ్ళిచేసుకుందాం’ కూడా విజయపథంలో పయనించింది. ఆ తరువాతి యేడాది అక్టోబర్ 30న వచ్చిన ‘ప్రేమంటే ఇదేరా’ కూడా సక్సెస్ రూటులో సాగింది. ఇలా వరుసగా మూడేళ్ళు అక్టోబర్ హిట్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించారు వెంకటేశ్. 2000 అక్టోబర్ 7న వచ్చిన ‘జయం మనదేరా’ సూపర్ హిట్టయింది. 2002 అక్టోబర్ 11న రిలీజైన ‘జెమిని’ పరవాలేదనిపించింది. 2007 అక్టోబర్ 12న విడుదలైన ‘తులసి’ కూడా ఘనవిజయాన్ని అందుకుంది. 2008 అక్టోబర్ 2న ప్రేక్షకులను పలకరించిన ‘చింతకాయల రవి’ భలేగా వినోదం పంచింది. ఇలా ఇప్పటి వరకు వెంకటేశ్ అక్టోబర్ మూవీస్‌లో ఒకే ఒక్క ‘ముద్దుల ప్రియుడు’ మినహాయిస్తే అన్నీ సక్సెస్‌ను సొంతం చేసుకున్నవే కావడం విశేషం. ఆ కారణంగానే ‘ఆదర్శ కుటుంబం’ కూడా మంచి విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
వెంకటేశ్ అక్టోబర్ చిత్రాల్లో రెండు గాంధీ జయంతి కానుకగా విడుదలయ్యాయి. అవి ‘సుందరకాండ’, రెండోది ‘చింతకాయల రవి’. ఈ రెండూ వినోదం పంచాయి. ఇప్పుడు ‘ఆదర్శకుటుంబం-ఏకే 47’ (Aadarsha Kutumbam House No: 47) టీజర్ చూస్తోన్నా, అదే తీరున నవ్వులు పూయించే అవకాశం ఉందనిపిస్తోంది. ఫ్యామిలీ కోసం హీరో పోరాడే చిత్రాలలో అధికభాగం సక్సెస్ సాధించాయి. అలాగే వెంకటేశ్ మూవీస్ కూడా ఫ్యామిలీ సెంటిమెంట్‌తో విజయపథంలో పయనించాయి. ఇలా చూసినా ‘ఆదర్శకుటుంబం’ సినీ ఫ్యాన్స్‌ను అలరిస్తుందని భావించవచ్చు. గతంలో వెంకటేశ్ చిత్రాలకు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తొలిసారి ఆయనను డైరెక్ట్ చేసిన ‘ఆదర్శకుటుంబం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వాటిని ‘ఆదర్శకుటుంబం’ ఏ తీరున అందుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
వినాశనం అంతం కాదు.. నూతన శకానికి ఆరంభం: దర్శకుడు పా.రంజిత్
‘అగధ’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎందులో అంటే
‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్.. రా, రస్టిక్ అండ్ బోల్డ్‌గా ఆశిష్ గాంధీ రచ్చ