వినాశనం అంతం కాదు.. నూతన శకానికి ఆరంభం: దర్శకుడు పా.రంజిత్
ABN , Publish Date - Sep 19 , 2026 | 08:25 AM
‘వినాశనం అనేది అంతం కాదు.. అది సరికొత్త నూతన శకానికి నాంది’ అనే గౌతమ బుద్ధుని పరమ సత్యాన్ని థీమ్‌గా తీసుకుని, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది వరల్డ్ ఆఫ్ వెట్టువం’.
‘వినాశనం అనేది అంతం కాదు.. అది సరికొత్త నూతన శకానికి నాంది’ అనే గౌతమ బుద్ధుని పరమ సత్యాన్ని థీమ్‌గా తీసుకుని, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది వరల్డ్ ఆఫ్ వెట్టువం’ (Vettuvam). నీలమ్ ప్రొడక్షన్స్, లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రానికి సంబంధించిన 5 నిమిషాల సుదీర్ఘమైన ట్రైలర్‌ను శుక్రవారం కోలీవుడ్ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఊహకందని రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చింది.
సినిమా నేపథ్యం గురించి దర్శకుడు పా.రంజిత్ (Pa. Ranjith) మాట్లాడుతూ.. ‘‘ఈ కథ ప్రధానంగా మూడు భిన్నమైన కాలాల్లో సాగుతుంది. గతం నాటి మనుషుల జీవన విధానం, వర్తమాన పరిస్థితులు వారి జీవితాలపై చూపే ప్రభావం, భవిష్యత్తులో మానవాళిపై ప్రకృతి తీసుకురాబోయే పెను మార్పులు.. ఈ మూడు కోణాల పరిణామాల మేళవింపే ‘వెట్టువం’. ఆ తర్వాత ఆకలి కోసం లేదా ఆత్మరక్షణ కోసం జంతువును వేటాడటం, తమ ఉనికిని, బలాన్ని నిరూపించుకోవడానికి మనుషులు చేసే భీకర పోరాటమే ఈ చిత్ర ప్రధాన కథాంశం’’ అని స్పష్టం చేశారు.
ముఖ్యంగా తమిళ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన ‘మల్లర్ కంభం’ ఆట, పురాతన ‘ఇంద్ర విళా’ ఉత్సవాలను వెండితెరపై మునుపెన్నడూ చూడని రీతిలో ఆవిష్కరించారు. ఈ మల్లర్ కంభం క్రీడా విన్యాసాల కోసం ప్రధాన నటీనటులు ప్రాణాలొడ్డి చేసిన కఠిన సాధన ట్రైలర్‌లో కొట్టొచ్చినట్లు కనిపించి గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఆర్య, దినేష్, శోభితా ధూళిపాళ్ల లీడ్ రోల్స్‌లో విశ్వరూపం చూపించగా.. కలైయరసన్, మైమ్ గోపి, గురు సోమసుందరం, షబ్బీర్, జాన్ విజయ్, సాయిదీనా, ఆనంద్ స్వామి, హరీశ్ ఉత్తమన్ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో మెరిశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ‘వెట్టువం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
‘అగధ’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎందులో అంటే
‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్.. రా, రస్టిక్ అండ్ బోల్డ్‌గా ఆశిష్ గాంధీ రచ్చ
‘RC17’ మ్యూజిక్ డైరెక్టర్.. అనిరుధ్ కూడా కాదా!