సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: ఫిబ్ర‌వ‌రిలో.. రీ రిలీజ్‌ల జాత‌ర‌! ఉద‌య్ కిర‌ణ్.. 'మ‌న‌సంతా నువ్వే' కూడా! జోరుగా.. అడ్వాన్స్ బుకింగ్స్‌

ABN, Publish Date - Feb 03 , 2026 | 04:17 PM

ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే కారణంగా ఆ వారం, దానికి ముందు వారం కూడా కొన్ని ప్రేమకథా చిత్రాలు రీ-రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో '3, ఆరెంజ్, కాంచన, మనసంతా నువ్వే, లవ్ స్టోరీ' వంటి చిత్రాలు ఉన్నాయి.

Re Release

కొత్త సంవత్సరంలో రెండో మాసంలోకి అడుగుపెట్టేశాం. సహజంగా ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే సినిమాలకు పెద్దంత ఆదరణ లభించదు. అయితే శివరాత్రి కానుకగా సెంటిమెంట్ తో కొన్ని సినిమాలు జనం ముందుకు వస్తుంటాయి. కానీ ఈసారి ఫిబ్రవరి ఫస్ట్ వీకెండ్ లోనే ఏకంగా డజనుకు పైగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో గుణశేఖర్ (Gunasekhar) రూపొందించిన 'యుఫోరియా', శివ కందుకూరి (Siva Kandukuri) 'చాయ్ వాలా', నవీన్ చంద్ర (Naveen Chandra) 'హనీ', ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ నటించిన 'బరాబర్ ప్రేమిస్తే' కాస్తంత చెప్పుకోదగ్గవి. ఇక ఫిబ్రవరి రెండోవారంలో విశ్వక్ సేన్ (Vishwaksen) 'ఫంకీ', సంతోష్ శోభన్ (Santhosh Sobhan) 'కపుల్ ఫ్రెండ్లీ', త్రిగుణ్‌ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్', అర్జున్ సర్జా (Arjun Sarja) డైరెక్ట్ చేస్తున్న 'సీతాపయనం' తదితర చిత్రాలు రాబోతున్నాయి. ఫిబ్రవరి ద్వితీయార్థంలో వచ్చే సినిమాలపై ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఫిబ్రవరి 20న మాత్రం సుహాస్ నటిస్తున్న 'హే భగవాన్' మూవీ విడుదల కానుంది.


బహుశా అందుకేనేమో ఈ నెలలో రీ-రిలీజ్ సినిమాలపై డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ దృష్టి పెట్టారు. ఫిబ్రవరి 6 నుండి రీ-రిలీజ్ సినిమాల హంగామా మొదలు కాబోతోంది. ధనుష్‌, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రలు పోషించిన '3' మూవీ ఫిబ్రవరి 6న రీ-రిలీజ్ అవుతోంది. 2012లో వచ్చిన ఈ సినిమాతోనే అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులోని 'కొలవరి డీ' సాంగ్ అప్పట్లో యూత్ ను ఓ ఊపు ఊపేసింది.

ఐశ్వర్య రజనీకాంత్ సైతం '3'తో దర్శకురాలిగా పరిచయం అయ్యింది. దాదాపు పద్నాలుగేళ్ళ తర్వాత వస్తున్న 'త్రీ' మూవీకి తప్పకుండా ప్రేక్షకాదరణ లభిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఆ మర్నాడే అంటే ఫిబ్రవరి 7న రామ్ చరణ్‌ (Ramcharan), జెనీలియా జంటగా 'బొమ్మరిల్లు' భాస్కర్ తెరకెక్కించిన 'ఆరెంజ్' మూవీ రీ-రిలీజ్ అవుతోంది. ఇది కూడా '3' సినిమాలాగా ఫస్ట్ రిలీజ్ లో ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమాలనే మ్యూజికల్ హిట్ గా నిలిచింది. విశేషం ఏమంటే... అటు '3', ఇటు 'ఆరెంజ్' సినిమాలకు థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది.


ఫిబ్రవరి 13న లారెన్స్ 'కాంచన' మూవీ రీ-రిలీజ్ అవుతుండగా, ఫిబ్రవరి 14న ఉదయ్ కిరణ్‌ 'మనసంతా నువ్వే', నాగ చైతన్య, సాయిపల్లవి 'లవ్ స్టోరీ' చిత్రాలు రాబోతున్నాయి. అయితే ఈ మూడు సినిమాలు ఫస్ట్ రిలీజ్ లో సైతం ఘన విజయాన్ని సాధించాయి. వాలెంటైన్స్ డే కు 'మనసంతా నువ్వే, 'లవ్ స్టోరీ' పర్ ఫెక్ట్ మూవీస్ అని మేకర్స్ భావించి విడుదల చేస్తున్నారు. ఏదేమైనా... ఇలా గతంలో వచ్చిన సినిమాలే మళ్ళీ రావడంతో తమకు తగిన ధియేటర్లు దొరకడం లేదని కొందరు నిర్మాతలు వాపోతున్నారు. కానీ చెప్పుకోదగ్గ పెద్ద సినిమా లేకపోతే... కనీసం ఇలాంటి క్రేజీ మూవీస్ ను రీ-రిలీజ్ చేస్తే తమ ఆక్యుపెన్సీ పెరుగుతుందని ఎగ్జిబిటర్స్ అంటున్నారు. మరి ఈ రీ-రిలీజ్ మూవీస్ కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Updated Date - Feb 03 , 2026 | 07:33 PM