ఒకే కథాంశంతో రెండు సినిమాలు.. ఒకే రోజు విడుదల!

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:16 PM

నవంబర్ 20న ఆకాశంలో ఒక తార, డియర్ ఆస్ట్రోనాట్ సినిమాలు విడుదల కానున్నాయి. ఆస్ట్రోనాట్ కావాలనే యువతుల కలల నేపథ్యంలో తెరకెక్కిన ఈ రెండు చిత్రాల కథాంశాలు ఒకేలా ఉండటం ఆసక్తికరంగా మారింది.

Aakasamlo Oka Tara - Dear Astronaut

నవంబర్ 20వ తేదీ అనువాద చిత్రాలతో కలిపి దాదాపు పది సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే అందరి దృష్టి రెండు సినిమాలపైనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ రెండు సినిమాల కథలు దాదాపుగా ఒక్కటే కావడం. అవే 'ఆకాశంలో ఒక తార', 'డియర్ ఆస్ట్రోనాట్‌'. దుల్కర్ సల్మాన్‌, శ్రుతిహాసన్, రుహాని శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న 'ఆకాశంలో ఒక తార' సినిమాను పవన్ సాదినేని దర్శకత్వంలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బ్యాక్‌ బోన్‌గా గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా బ్యానర్స్ నిలిచాయి. ఓ సాధారణ దిగువ తరగతి యువతి ఆస్ట్రోనాట్‌ కావడం కోసం ఎలాంటి కృషి చేసింది? ఆ సమయంలో ఓ యువకుడు ఆమెకు బాసటగా ఎలా నిలిచాడు? ఆమె తన లక్ష్యాన్ని ఛేదించడానికి పడిన శ్రమ ఏమిటీ? అనేది 'ఆకాశంలో ఒక తార' మూవీ కథగా తెలుస్తోంది. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. దీనిని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.


దాదాపుగా ఇలాంటి కథతోనే తెరకెక్కిన మరో సినిమా 'డియర్‌ ఆస్ట్రోనాట్‌'. చిన్నప్పటి నుంచి ఆస్ట్రోనాట్‌ కావాలని కలలు కన్న ఓ అమ్మాయి పెళ్ళి తర్వాత తన కల చెదిరిపోతుందని భయపడుతుంది. అయితే భర్త ప్రోత్సాహంతో ఆమె తన గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొందన్నదే 'డియర్‌ ఆస్ట్రోనాట్‌' కథ. ఈ సినిమాలో ప్రధాన పాత్రలను సౌమిత్‌, శ్రేయసి సేన్‌, కమల్ కామరాజు, గీతా భాస్కర్, దేవిప్రసాద్‌, చైత్ర తదితరులు పోషించారు. ఈ సినిమాను కార్తీక్‌ భాగ్యరాజ తెరకెక్కించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చురుకుగా పాల్గొని, చిత్ర బృందానికి బాసటగా నిలిచారు. నిజానికి 'డియర్‌ ఆస్ట్రోనాట్‌' సినిమాలో మొదట వరుణ్‌ సందేశ్‌, అతని భార్య వితికా శేరు నటించారు. కొంత భాగం షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అందుకు కారణాలను మాత్రం వివరించలేదు. దాంతో శ్రేయసి సేన్‌ను పెట్టి రీ-షూట్‌ చేశారు. ఈ యేడాది వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైన 'నిలవే' సినిమాతో శ్రేయసి సేన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడీ సినిమాతో పాటు 'మొహబ్బత్‌' అనే మరో సినిమాలోనూ నటిస్తోంది. విశేషం ఏమంటే... ఈ రెండు సినిమాల్లోనూ ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.


'ఆకాశంలో ఒక తార', 'డియర్‌ ఆస్ట్రోనాట్‌' సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్‌ కంటెంట్‌ చూసినప్పుడు ఈ రెండు సినిమాల కథాంశాలు ఒక్కటే అనే విషయం ఎవరికైనా తేలికగా అర్థమౌతుంది. ఈ రెండు సినిమాలూ నవంబర్ 20వ తేదీనే విడుదల అవుతున్నాయి. మరి ఒకరి సినిమా కథ గురించి మరొకరికి తెలియదా? అని సందేహం ఎవరికైనా వస్తుంది. కానీ ఈ విషయానికి సంబంధించి ఎవరూ స్పందించడం లేదు. బహుశా ఎవరి సినిమా మీద వారికి ప్రగాఢమైన నమ్మకం ఉండి ఉండొచ్చు. ఒకే కథాంశంతో రెండు సినిమాలు వచ్చినప్పుడు సహజంగా ప్రేక్షకులు భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో తెరకెక్కిన సినిమా వైపే మొగ్గు చూపుతారు. అంత మాత్రం చేత అలాంటి సినిమాలే విజయం సాధిస్తాయని చెప్పలేం. ఒక్కోసారి సినిమాలపై ఏర్పడే భారీ అంచనాలు సైతం ఫలితంపై ప్రభావం చూపుతాయి. ఏదేమైనా 'ఆకాశంలో ఒక తార', 'డియర్‌ ఆస్ట్రోనాట్‌' రెండూ కూడా మహిళా ప్రధాన సందేశాత్మక చిత్రాలు. ఈ రెండు కూడా విజయం సాధించాలని కోరుకుందాం.

ఇవి కూడా చదవండి:

మిడ్‌నైట్ అప్డేట్స్.. జక్కన్నా నీ స్ట్రాటజీని అందుకోవడం కష్టమే..

James Bond 007: కొత్త జేమ్స్‌బాండ్‌.. అదిరిపోయాడు

అనిరుధ్ స్వరాలకు..15 వసంతాలు

Updated Date - Nov 17 , 2026 | 02:26 PM