నటి ఆత్మహత్య ... సుప్రీమ్‌ జోక్యం!

ABN , Publish Date - May 26 , 2026 | 11:53 AM

'ముగ్గురు మొనగాళ్ళు' ఫేమ్‌ త్విశా శర్మ ఈ నెల 12న భోపాల్‌లో సూసైడ్ చేసుకుంది. నిందితులు న్యాయ వ్యవస్థకు చెందిన వారు కావడంతో నిష్పక్షపాత దర్యాప్తు కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కేసును సీబీఐకు అప్పగించింది.

Twisha Sharma

తెలుగులో దీక్షిత్‌ శెట్టి (Deekshith Shetty) సరసన 'ముగ్గురు మొనగాళ్ళు' (Mugguru Monagallu) చిత్రంలో హీరోయిన్‌గా నటించిన త్విశా శర్మ ఈ నెల 12న భోపాల్ లో అత్తవారింట ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. మోడలింగ్‌ నుండి సినిమాల్లోకి వచ్చిన త్విశా శర్మ (Twisha Sharma) ఐదు నెలల క్రితం న్యాయవాది సమర్థ్‌ సింగ్‌ను వివాహం చేసుకుంది. అయితే ఊహించని విధంగా ఆమె సూసైడ్‌ చేసుకోవడం అందరినీ కలచివేసింది. ఆర్థికపరమైన ఒత్తిడులు, వరకట్న వేదింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పుట్టింటి వారు ఆరోపిస్తే, ఆమెకు మాదక ద్రవ్యాల అలవాటు ఉందని అత్తింటి వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్విశా శర్మ కేసును మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది.


ఇదిలా ఉంటే... మృతురాలి అత్త గిరిబాల సింగ్‌ మాజీ న్యాయమూర్తి కావడంతో ఆమె ఈ కేసులో తన పరపతిని ఉపయోగిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. ఈ తరహా వార్తా కథనాలు సుప్రీమ్‌ కోర్టు (Supreme Court) దృష్టికి రావడంతో శనివారం దీనిని సుమోటోగా స్వీకరించింది. సోమవారం ఈ కేసు సుప్రీమ్‌ కోర్టు ప్రధాన నాయ్యమూర్తి సూర్యకాంత్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ పైకి వచ్చింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా ఈ కేసును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిందని, రెండోసారి పోస్ట్ మార్టమ్‌ను ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్) వైద్యుల బృందం భోపాల్‌కు వెళ్ళి నిర్వహించిందని, ఆ ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు.


'త్విశా శర్మ మరణం కేసులో నిందితులను న్యాయ వ్యవస్థ కాపాడుతోందం'టూ వస్తున్న కథనాలు తమను బాధకు గురిచేశాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. నిందితులు న్యాయ వ్యవస్థకు చెందిన వారు కావడం వల్లనే రక్షణ పొందుతున్నారనే విమర్శలను వారు తీవ్రంగా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వార్తల విషయంలో మీడియా సంయమనం పాటించాలని కోరారు. విచారణకు సంబంధించిన వ్యక్తుల వ్యాఖ్యలను నమోదు చేయకుండా ఉండాలని సూచన చేశారు. అలానే రెండు పక్షాల కుటుంబ సభ్యులు తమ ప్రకటనలను మీడియాకు కాకుండా దర్యాప్తు సంస్థలకు మాత్రమే ఇవ్వాలని సూచించారు. స్వేచ్ఛగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని సీబీఐ ఈ సందర్భంగా సుప్రీమ్‌ కోర్టుకు హామీ ఇచ్చింది. మరి త్విశా శర్మ కేసు ఎప్పటికి తెలుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ముగిసిన సమావేశం.. ఎగ్జిబిటర్స్ సమస్యలు విని చిరంజీవి ఆశ్చర్యం!

హరిరామజోగయ్య కుమారుడిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు

10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?

Updated Date - May 26 , 2026 | 11:55 AM