సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

టాలీవుడ్‌లో మళ్ళీ పౌరాణిక ప్రభంజనం

ABN, Publish Date - Jul 07 , 2026 | 04:04 PM

పౌరాణికాలు తెరకెక్కించడంలో తెలుగువారి తరువాతే ఎవరైనా . ఇది జగమెరిగిన సత్యం. టెక్నాలజీ ఉరకలు వేస్తున్న ఈ తరుణంలో మళ్ళీ టాలీవుడ్ జనం చూపు పురాణగాథల వైపు పరుగులు తీయడం విశేషం.

Murugan- ntr

తెలుగు సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోతోంది. అందునా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నింపుకొని జనాన్ని మురిపిస్తున్నాయి మన చిత్రాలు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలను తెరకెక్కించడంలో తెలుగువారికి సాటి రారెవరు అన్న పేరు సంపాదించారు మనవాళ్ళు. ఈ నేపథ్యంలోనే తెలుగు సినీజనం చూపు పౌరాణికాలవైపు విశేషంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. కొందరు మైథలాజికల్ స్టోరీస్ ను ఆధారం చేసుకొని నవీనపంథాలో పయనిస్తున్నారు. మొన్న ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి', రాబోయే మహేశ్-రాజమౌళి 'వారణాసి' ఆ తీరున సాగినవే... 'కల్కి' చిత్రానికి సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. అయితే మరికొందరు పూర్తిస్థాయి పౌరాణికాలను తెరకెక్కిస్తున్నారు. యన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ రూపొందించబోయే 'మురుగన్' ఆ కోవకు చెందిందే. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలు సైతం పురాణగాథలతో అలరించే ప్రయత్నం చేస్తున్నాయి.


తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' వంటి పౌరాణికంతోనే ఊపిరి పోసుకుంది. ఆరంభంలో నాటకఫక్కీలో పలు పురాణగాథలను చిత్రాలుగా మలిచారు మనవాళ్ళు. అయితే నటరత్న యన్టీఆర్ ఆగమనంతో మన పురాణగాథలకు విశేషమైన గుర్తింపు లభించింది. యన్టీఆర్ నటించిన పలు పౌరాణిక చిత్రాలు హిందీ, బెంగాలీ భాషల్లోకి అనువాదమై అలరించాయి. దాంతో భారతీయ ఇతిహాసాలు, పురాణాలను తెరకెక్కించడంలో తెలుగువారిదే పైచేయి అన్న మాట వెలుగు చూసింది. యన్టీఆర్ అనేక పురాణపాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. దాంతో ఆయన ధరించనటువంటి పాత్రలను ఎంచుకుంటున్నారు ఈ తరం నటులు. మరికొందరు యన్టీఆర్ పోషించిన పాత్రలను మోడరన్ టెక్నాలజీతో రంగరించి జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ యన్టీఆర్ పౌరాణికాలే స్ఫూర్తిగా నిలిచాయని కొత్తగా చెప్పక్కర్లేదు.

ఇప్పటిలా సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లక ముందే తెలుగువారు అద్భుతమైన పౌరాణిక చిత్రాలు రూపొందించారు. ఆ నమ్మకంతోనే నవతరం దర్శకులు సైతం మోడరన్ టెక్నాలజీతో మన మైథలాజికల్ స్టోరీస్ ను రక్తి కట్టించవచ్చునని ఆశిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో 'వాయుపుత్ర' అనే భారీ మోషన్ క్యాప్చర్ మూవీ తెరకెక్కనుంది. 'హను-మ్యాన్'తో మురిపించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం 'జై హనుమాన్'ను రూపొందిస్తున్నారు. అరుణ్ కుమార్ రాపోలు 'హనుమత్ సుందరకాండ' అనే 3డి యానిమేషన్ మూవీ తీస్తున్నారు. ఇక జూనియర్ యన్టీఆర్ తో త్రివిక్రమ్ తెరకెక్కించబోయే పౌరాణికం వైపే పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పౌరాణికాల్లో తనకు తానే సాటి అనిపించుకున్న యన్టీఆర్ మనవడు తారక్ తో తెరకెక్కుతోన్న చిత్రమది. అందులోనూ వినోదభరిత చిత్రాల దర్శకుడు త్రివిక్రమ్ తీస్తోన్న సినిమా .అందునా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గాథతో తెరకెక్కుతోన్న మూవీ కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై మరింత ఇంట్రెస్ట్ కలుగుతోంది. రాబోయే తెలుగువారి పౌరాణిక చిత్రాలు ఏ స్థాయిలో అలరిస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి:

పాలిటిక్స్‌లోకి ధనుష్.. ఈ హడావుడి అంతా అందుకేనా?

అక్కినేని వారబ్బాయికి.. నందమూరి వారసుని 'మాట సాయం'!

Updated Date - Jul 07 , 2026 | 04:05 PM