సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: నిర్మాతలుగా నవతరం హీరోలు

ABN, Publish Date - Aug 10 , 2026 | 03:58 PM

టాలీవుడ్ హీరోలు కొందరు నిర్మాతలుగానూ అలరించే ప్రయత్నంలో ఉన్నారు. తామే నటిస్తూ కొన్ని- ఇతర హీరోలతో మరికొన్ని సినిమాలు నిర్మిస్తూ సాగుతున్నారు. మరి వీరిలో సక్సెస్ రూటులో పయనిస్తున్నవారు ఎందరు!?

Tollywood Heroes

ఇప్పటి హీరోల్లో కొందరు నటనలో కొనసాగుతూనే నిర్మాతలుగానూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ రూటులో సాగినవారెందరో ఉన్నారు. నవతరం కథానాయకుల్లో రామ్ పోతినేని, మంచు మనోజ్ వంటివారు చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 'రాపో సినిమాటిక్స్' పతాకంపై తన సోదరుడు పోతినేని కృష్ణ నిర్మాతగా రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక మంచు మనోజ్ 'ఎమ్.ఎమ్.ఆర్ట్స్' పతాకంపై ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇతరులకు అవకాశాలు కల్పించే పనిలో ఉన్నారు. వీరిద్దరూ ప్రొడ్యూసర్స్ గా 'ఆన్ ద వే'లోనే ఉన్నారు. వీరి సినిమాలు జనం ముందుకు వచ్చాకే వారి అభిరుచి ఏ పాటిదో తెలుస్తుంది.

ఇంతకు ముందు నితిన్, విజయ్ దేవరకొండ, అల్లరి నరేశ్, సుధీర్ బాబు వంటివారు కూడా నిర్మాతలుగా మారారు. అఖిల్ హీరోగా నితిన్ 'అఖిల్' సినిమా నిర్మించారు. 'మీకు మాత్రమేచెబుతా' అనే చిత్రంతో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారారు. ఈ ఇద్దరు హీరోలు ఇతరులతో చిత్రాలు నిర్మించేసి తరువాత నిర్మాణం వైపు చూడలేదు. అల్లరి నరేశ్ 'బందిపోటు', సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' సినిమాల్లో హీరోలుగా నటిస్తూనే నిర్మించారు. మళ్ళీ చిత్ర నిర్మాణంవైపు వీరు కూడా చూడకపోవడం గమనార్హం. కిరణ్ అబ్బవరం ఇతరులతో 'తిమ్మరాజు పల్లి టీవీ' నిర్మించారు. తాను హీరోగా నటిస్తూ- దర్శకత్వం వహిస్తూ కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం బహుముఖ ప్రజ్ఞ బయల్పడనుంది.


అసలు పేరున్న హీరోలు సినిమాలు నిర్మించడమన్నది ఇప్పట్లోనే ఏదో మొదలయిందని ఈ తరం ప్రేక్షకులు భావించవచ్చు. కానీ, తెలుగు సినిమాలో తొలి స్టార్ హీరోగా నిలచిన మహానటుడు చిత్తూరు వి.నాగయ్యనే నిర్మాత, దర్శకునిగా సినిమాలు నిర్మించి ఆకట్టుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'త్యాగయ్య' చిత్రం అప్పట్లో అఖండ విజయం సాధించింది. ఎన్నో కేంద్రాలలో విజయోత్సవాలు జరుపుకుంది. నాగయ్యను ఏనుగు అంబారీలపై ఊరేగేలా చేసింది 'త్యాగయ్య'. ఆయన స్ఫూర్తితోనే తరువాత ఎందరో హీరోలు నిర్మాతలుగానూ సాగారు.

నాగయ్యను ఆదర్శంగా తీసుకొని తరువాతి రోజుల్లో మేటి నటులుగా రాజ్యమేలిన యన్టీఆర్, ఏయన్నార్ కూడా చిత్ర నిర్మాణంలో సాగారు. యన్టీఆర్ తన తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాతగా 'యన్.ఏ.టి.' పతాకంపై మరపురాని చిత్రాలు నిర్మించారు. ఏయన్నార్, దుక్కిపాటి మధుసూదనరావుతో కలసి 'అన్నపూర్ణ' బ్యానర్ పై జనం మెచ్చే చిత్రాలు రూపొందించారు. వీరి తరువాతి తరం హీరోలయిన కృష్ణ, కృష్ణంరాజు కూడా సొంత చిత్ర నిర్మాణంతో సాగారు. ఆ పై నటనిర్మాతగా మోహన్ బాబు రికార్డ్ స్థాయిలో చిత్రాలు నిర్మించారు. మంచు విష్ణు కూడా తండ్రి మోహన్ బాబు బాటలో పయనిస్తూ '24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ' బ్యానర్ పై సినిమాలు తెరకెక్కించారు. తాత యన్టీఆర్ చూపిన దారిలో నడుస్తూ నందమూరి కళ్యాణ్ రామ్ 'యన్టీఆర్ ఆర్ట్స్' పతాకంపై పలు చిత్రాలు నిర్మించి నటించారు. ఇతర హీరోలతోనూ చిత్రాలు తెరకెక్కించారు. తన సినిమాల ద్వారా పలువురు ప్రతిభావంతులైన దర్శకులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.


యన్టీఆర్ తనయుల్లో నటనిర్మాతలుగా హరికృష్ణ, బాలకృష్ణ సాగారు. బాలకృష్ణ తన తండ్రి యన్టీఆర్ బయోపిక్ ను రెండుభాగాలుగా నిర్మించారు. తరువాత మళ్ళీ చిత్ర నిర్మాణం చేపట్టలేదు. ఏయన్నార్ తనయుడు నాగార్జున మాత్రం ఇప్పటికీ నటనిర్మాతగా సాగుతున్నారు. చిరంజీవి తాను సమర్పకునిగా తమ్ముడు నాగబాబు నిర్మాతగా 'అంజనాప్రొడక్షన్స్' పతాకంపై అనేక చిత్రాలు నిర్మించారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా తమ 'కొణిదెల ప్రొడక్షన్స్', 'మెగా పిక్చర్స్' పతాకాలపై చిత్ర నిర్మాణం సాగిస్తున్నారు. ఇక మహేశ్ బాబు తాను హీరోగా నటించే చిత్రాల్లో భాగస్వామిగా చిత్ర నిర్మాణంలో సాగుతున్నారు. ఇతర హీరోలతోనూ ఆయన కొన్ని సినిమాలు నిర్మించారు. సందీప్ కిషన్ ఇప్పటికే మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. నాని కూడా నిర్మాతగా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్ పై అనేక చిత్రాలు తెరకెక్కించారు. ఇతరులతో చిత్రాలు నిర్మించి, 'హిట్-3'లో తానే హీరోగా నటించారు నాని. పవన్ కళ్యాణ్ తన అభిమాని అయిన నితిన్ హీరోగా 'ఛల్ మోహనరంగ' సినిమా నిర్మించారు.. ఆ పై పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై తానే హీరోగా 'ఓజీ' తెరకెక్కించారు. ప్రస్తుతం ఆ మూవీ రెండో భాగాన్ని నిర్మించే పనిలో ఉన్నారు పవన్.

నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా 'దూత-2' వెబ్ సిరీస్ లో నిర్మాణభాగస్వామిగా మారారు. ఇలా సీనియర్ హీరోలు, నవతరం కథానాయకులు అందరూ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటూ పోతున్నారు. అయితే వీరిలో ఎందరు సక్సెస్ సాధించారు అన్నదే కీలకం. విజయం సాధించిన వారు చిత్రనిర్మాణంలోనే కొనసాగుతున్నారు. చేదు అనుభవం రుచిచూసినవారు మరోమారు చిత్ర నిర్మాణం వైపు చూడడం లేదు. రాబోయే రోజుల్లో ఇంకెందరు హీరోలు నిర్మాతలుగా మారతారో. ఎందరు నటనిర్మాతలుగా సాగుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మెగా ట్రీట్.. ‘వారణాసి’లో రాముడిగా మహేష్.. హనుమంతుడిగా ఎవరంటే

ఫ్యాన్స్‌ ప్రెషర్‌ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే సాధ్యమైంది..

బై ఎలక్షన్ వద్దని చెప్పినా వినని జానీ మాస్టర్ వైఫ్.. ఫలితాలు విడుదల

Updated Date - Aug 10 , 2026 | 04:00 PM