టాలీవుడ్ స్టార్ హీరోస్.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్.. వీరిదే హవా

ABN , Publish Date - Nov 06 , 2026 | 09:16 PM

సౌత్ స్టార్స్‌లో ప్రస్తుతం టాలీవుడ్ హీరోస్ హవా విశేషంగా వీస్తోంది. ఉత్తరాదివారు సైతం తెలుగు స్టార్స్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మన సంగీత దర్శకుల కన్నా మిన్నగా తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ జర్నీ సాగుతూ ఉండడం చర్చనీయాంశమైంది.

Anirudh and Tollywood Heroes

ప్రస్తుతం భారతదేశంలోని సినిమా అభిమానుల్లో అధిక సంఖ్యాకులు టాలీవుడ్ (Tollywood) నుండి వచ్చే మూవీస్ కోసం ఎదురుచూస్తుంటారు. మన తెలుగు స్టార్స్ ప్రభాస్, జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించిన చిత్రాలకు ఉత్తరాదిన కూడా క్రేజ్ ఏర్పడింది. వీరు నటించిన ‘బాహుబలి’ సిరీస్, ‘పుష్ప’ సిరీస్, సలార్, ట్రిపుల్ ఆర్ వంటి సినిమాలు ఉత్తరాదిన సైతం విశేషాదరణ చూరగొన్నాయి. నార్త్‌లో వీరికి ఎంతటి క్రేజ్ ఉందంటే అంతకు ముందు వారు నటించిన కొన్ని సినిమాలను అదేపనిగా హిందీ, మరాఠీ భాషల్లోకి అనువదించి మరీ అక్కడ ప్రదర్శించారు. ఈ స్థాయి క్రేజ్ సౌత్‌లో మరే భాషా హీరోలకు లేదన్నది ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ ఎరిగిన సత్యం!


సౌత్ నుండి టాలీవుడ్ స్టార్స్‌కు మాత్రమే ఉత్తరాదిన ఆదరణ ఉందన్న మాట వాస్తవం. అందులో ఏలాంటి సందేహం లేదు. అయితే కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, తమన్ వంటి తెలుగు సంగీత దర్శకులు మన దగ్గర రాజ్యమేలుతున్నా, ఉత్తరాదిన వీరికి అంతగా క్రేజ్ లేదన్నది అంగీకరించవలసిన విషయం. ఓ ప్రాంతీయ చిత్రం ద్వారా ఆస్కార్ అవార్డును సంపాదించిన ఘనత కీరవాణి సొంతం.. అయినప్పటికీ ఉత్తరాదిన తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏ.ఆర్.రహమాన్, ఇళయరాజా, ఇప్పుడు అనిరుధ్ రవిచందర్‌కు ఉన్న క్రేజ్ మన సంగీత దర్శకులకు లేదన్నది పలువురి మాట. ఒకప్పుడు దక్షిణాదిన తెలుగు సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు, ఆదినారాయణరావు వంటివారు ఉత్తరాదిన కూడా తమ బాణీ పలికించారు. కొందరు ఉత్తరాది సంగీత దర్శకులు మన తెలుగు సంగీత దర్శకుల స్వరాలను యథాతథంగా అనుకరించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే తరువాతి రోజుల నుంచీ ముఖ్యంగా ఇళయరాజా ట్యూన్స్‌ను నార్త్ లో ఆనంద్ - మిళింద్, అనుమాలిక్, నదీమ్-శ్రవణ్ వంటి వారు విరివిగా ఉపయోగించుకున్నారు. దాంతో సౌత్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఇళయరాజా పేరు నార్త్‌లో మారుమోగింది. ఆ తరువాతి రోజుల్లో ఎ.ఆర్.రహమాన్ వచ్చేసి, స్ట్రెయిట్ హిందీ మూవీస్‌కు కూడా కంపోజ్ చేశారు. దాంతో రహమాన్ సంగీతం ఉత్తరాదివారికి సుపరిచితమైంది. ఆ రూటులోనే ఇప్పుడు అనిరుధ్ రవిచందర్ సాగుతున్నారు. అనిరుధ్ కూడా నేరుగా హిందీ చిత్రాలకు కంపోజ్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాకు అనిరుధ్ బాణీలు ఓ అట్రాక్షన్‌గా నిలిచాయి. ‘జవాన్’ భారీ విజయంతో అనిరుధ్ సంగీతం కోసం ఉత్తరాది చిత్ర నిర్మాతలు సైతం పరుగులు తీస్తున్నారు.


ఒకప్పుడు కీరవాణి సైతం ఎమ్.ఎమ్.క్రీమ్ పేరుతో కొన్ని హిందీ చిత్రాలకు పనిచేశారు. అయితే ఎందువల్లో రహమాన్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. రహమాన్ వేసిన పునాదిపైనే ఇప్పుడు అనిరుధ్‌కు అవకాశాలు లభిస్తున్నాయి. ‘జవాన్’ గ్రాండ్ సక్సెస్ తరువాత దేశంలోనే అత్యధిక పారితోషికం పుచ్చుకొనే స్థాయికి చేరారు అనిరుధ్. తెలుగు చిత్రాలు ఎంత ఘనవిజయం సాధించినా, వాటిలోని పాటలకంటే నటీనటులు, దర్శకులే మంచి క్రేజ్ సంపాదించారు. అందువల్ల మన తెలుగు సంగీత దర్శకుల కన్నా మిన్నగా తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ నార్త్‌లో రాజ్యమేలుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి టాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ ఉత్తరాదిన క్రేజ్ సంపాదించారు. వీరు కూడా తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్‌ను కాకుండా రహమాన్, అనిరుధ్‌నే ఎంచుకోవడం గమనార్హం. మరి నార్త్‌లోనూ సత్తా చాటే తెలుగు సంగీత దర్శకులు ఎప్పుడు వస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ‘ఫన్’.. వివరాలివే

డిసెంబర్‌లో పెళ్లికి సిద్ధమైన మరో జంట.. ఎవరో తెలుసుగా

అప్పుడనుకున్న టైటిల్ ఇప్పుడు.. కమల్ హాసన్ నెక్స్ట్ ఫిల్మ్‌ టైటిల్ ఇదే

Updated Date - Nov 06 , 2026 | 09:16 PM

15 ఏళ్ళ స్నేహం.. నాలుగేళ్ళ సంసారం.. చివరకు విడాకులు

రాధికా ఆప్టే వ్యాఖ్యలపై రెజీనా ఫైర్

సుడిగాలి సుధీర్‌ GOAT ట్రైలర్ వదిలిన దుల్కర్.. ఎలా ఉందంటే?

సాయి దుర్గ తేజ్ - కిరణ్‌ల నిశ్చితార్థం.. హాజరైన పలువురు సెలబ్రిటీలు

‘మహాకాళి’ నుంచి ‘అయిగిరి నందిని’ సాంగ్ విడుదల.. పూనకాలే