ఈ వారం థియేటర్లలో 8 సినిమాల సందడి... అందరి దృష్టి 'ఇట్లు అర్జున' పైనే!

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:17 PM

ఈ వారం థియేటర్లలో ఎనిమిది సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ‘ఇట్లు అర్జున’, ‘డీఎన్‌కే’, ‘డార్క్ చాక్లెట్’, ‘చంద్రయాన్’, ‘మాయలేడి’తో పాటు మరాఠీ ఆస్కార్ అధికారిక ఎంట్రీ ‘గోంధళ్’ తెలుగు అనువాదం ప్రేక్షకుల ముందుకు రానుంది.

This weekend movies

ఈ వారం మొత్తం ఎనిమిది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో ఒకటి డబ్బింగ్ సినిమా కాగా, మిగిలిన ఏడు స్ట్రెయిట్ మూవీసే. వీటిలో ఏవి ఆసక్తి కలిగిస్తున్నాయో తెలుసుకుందాం.

ఈ వారం భారీ చిత్రాలేవీ బాక్సాఫీస్ బరిలో దూకక పోయినా, కొన్ని ఆసక్తి కలిగించే సినిమాలు మాత్రం జనం ముందుకు వస్తున్నాయి. వీటిలో "గోట్, ఇట్లు అర్జున, డీయన్కే, డార్క్ చాక్లెట్, చంద్రయాన్, మాయలేడి, జయంత్ అండ్ ద జింగోపెన్" చిత్రాలు స్ట్రెయిట్ మూవీస్. కాగా ఈ యేడాది మన దేశం నుండి ఆస్కార్ కోసం అఫిసియల్ ఎంట్రీగా ఎన్నికైన 'గోంధళ్' ఒక్కటే అనువాద చిత్రం. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గోట్' సినిమా నవంబర్ 12నే వెలుగు చూసింది. నవంబర్ 13న ఆరు చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. 14వ తేదీన 'జయంత్ అండ్ ద జింగోపెన్' రానుంది.

ఆసక్తిరేకెత్తిస్తున్న 'ఇట్లు అర్జున'

ఈ వారం వచ్చే చిత్రాల్లో 'ఇట్లు అర్జున'కు టాప్ స్టార్స్ ప్రమోట్ చేయడంతో ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. ఈ సినిమా ద్వారా అనీష్ హీరోగా, మహేశ్ ఉప్పల దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో అనశ్వర రాజన్ నాయికగా నటించారు. దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న ఈ మూవీపై బజ్ బాగానే క్రియేట్ అయింది. తొలి చిత్రంలోనే అనీశ్ మూగవాడి పాత్రను పోషించడం విశేషమనే చెప్పాలి.

itlu.jpg


'లిటిల్ హార్ట్స్' ఫేమ్ మౌళి ప్రధాన పాత్రలో రూపొందిన 'దొంగ నా కొడుకు' చిత్రం ఇప్పుడు షార్ట్ ఫామ్‌ లో 'డీఎన్‌కే'గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై యూత్ లో మంచి క్రేజ్ ఉంది. శశాంక్ శ్రీవాస్తవాయ దర్శకత్వంలో రూపొందిన 'డార్క్ చాక్లెట్' డార్క్ కామెడీతో తెరకెక్కింది. రానా దగ్గుబాటి ఈ చిత్రానికి సమర్పకుడు కావడంతో ఈ మూవీపైనా ఆసక్తి చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో తెరకెక్కిన చిత్రం 'చంద్రయాన్'. హాస్యప్రధానంగా ఈ సినిమా రూపొందింది.

ప్రశంకర్ దర్శకత్వంలో రాకేశ్ వర్రే హీరోగా నటించి నిర్మించిన చిత్రం 'మాయలేడి'. రొమాంటిక్ కామెడీగా రూపొందిన 'మాయలేడి'పైనా జనాల్లో ఓ ప్రత్యేకమైన ఆసక్తి చోటు చేసుకుంది. గతంలో 'ఎవ్వరికీ చెప్పొద్దు' చిత్రాన్ని కూడా నిర్మించి నటించిన రాకేశ్ వర్రే అందులోనూ వైవిధ్యం ప్రదర్శించారు. అందువల్ల 'మాయలేడి'పైనా ఓ బజ్ క్రియేట్ అయింది.


ఈ యేడాది మన దేశం నుండి ఆస్కార్ కు అధికార ఎంట్రీగా ఎన్నికైన మరాఠీ చిత్రం 'గోంధళ్'ను తెలుగులో అనువదించారు.. సంతోష్ దవాఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్. 'గోంధళ్' అనేది మరాఠా ప్రాంతంలో ఓ జానపద సంప్రదాయం. ఇష్టంలేని పెళ్ళి చేసుకున్న సుమన్ అనే యువతి 'గోంధళ్' ఆచారాన్ని ఆసరాగా చేసుకొని తన ప్రియునితో కలసి భర్తను చంపాలని ప్లాన్ వేస్తుంది. ఒక్కరాత్రిలో జరిగే ఈ కథను దర్శకుడు నడిపిన తీరు ఆకట్టుకుంది. అందువల్ల తెలుగువారినీ అలరించడానికి డబ్ చేశారు. ఇక 14వ తేదీన నవీన్ దేశబోయిన దర్శకత్వంలో రూపొందిన 'జయంత్ అండ్ ద జింగో పెన్' రిలీజ్ అవుతోంది. ఈ ఎనిమిది సినిమాల్లో ఏ చిత్రం ప్రేక్షకులను ఎక్కువగా మెప్పిస్తుందో చూడాలి.

ALSO READ:
Rahul gowlikar: ఐడీల జారీలో జాప్యం లేదు.. సెన్సార్ సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తాం!

Censor Issue: చివరి నిమిషంలో టైటిల్ మార్చాలా? నిర్మాతలకు కోట్ల నష్టం తప్పదా?

Anil Ravipudi: ఓవర్సీస్‌లో అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. సందడే సందడి..

Updated Date - Nov 12 , 2026 | 04:40 PM