ప్యారడైజ్ కలెక్షన్స్ పై ఊహించని ప్రభావం!
ABN , Publish Date - Sep 15 , 2026 | 01:40 PM
నాని నటించిన పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' ఈ నెల 24న విడుదల అవుతోంది. ఆ మర్నాడే గణేశ్ నిమజ్జనం ఘనంగా జరుగబోతోంది. దాంతో ప్యారడైజ్ వీకెండ్ కలెక్షన్స్ మీద దీని ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' సినిమా వాయిదా పడుతుందేమోననే సందేహాన్ని కొద్ది రోజుల వరకూ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. అయితే అనుకున్న విధంగా సినిమాను సెప్టెంబర్ 24న ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేస్తామని, అందుకోసం ట్రైలర్ ను సైతం విడుదల చేయడం లేదని హీరో నాని తెలిపారు. ప్రతి నిమిషం తమకు విలువైనదేనని అందుకోసం సాంకేతిక నిపుణులు అహోరాత్రులు పని చేస్తున్నారని ఆయన ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. దాంతో 'ది ప్యారడైజ్' ఆగమనం ఖాయమని తేలిపోయింది.
'దసరా' మూవీ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో 'ది ప్యారడైజ్'కు మొదట్లోనే బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ప్రచార గీతాలు విడుదలైన తర్వాత అది అంబరాన్ని తాకింది. నానిని సరికొత్తగా చూడబోతున్నామని ఫ్యాన్స్ భావిస్తుంటే... మేకింగ్ పరంగా సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఆ పాటలు నిరూపించాయి. ఖచ్చితంగా టాలీవుడ్ లో 'ది ప్యారడైజ్' సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అంతా నమ్ముతున్నారు. అయితే ఇదే సమయంలో 'ప్యారడైజ్' కలెక్షన్స్ పై గణేశ్ నిమజ్జనం ప్రభావం చూపించబోతోంది.
సెప్టెంబర్ 14న ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండగను ఘనంగా చేసుకున్నారు. మరీ ముఖ్యంగా నైజాంలో ఈ పండగను వాడవాడలా చేసుకుంటారు. ప్రతి గల్లీ వినాయక మండపాలతో కళకళలాడుతుంటుంది. సహజంగా ఇళ్ళలో గణపతిని పెట్టుకుని పూజలు చేసుకునే వారు మూడో రోజు, ఐదో రోజు, ఏడో రోజు విగ్రహాలను నిమజ్జనం కోసం సమీపంలోని చెరువులకు వెళతారు. మరికొందరు ఉత్సాహవంతులు పనికట్టుకుని దేశ రాజధానిలో ఏ మూల నివాసం ఉన్నా... హుస్సేన్ సాగర్ కు వచ్చి నిమజ్జనం చేస్తారు. అయితే సహజంగా గణేశ్ మండపల్లోని విగ్రహాలను మాత్రం చాలా వరకూ పదకొండో రోజున నిమజ్జనానికి తీసుకొస్తారు. ఆ రకంగా చూస్తే ఈ ఏడాది 11 వ రోజు 24వ తేదీ వచ్చింది. ఇది నాని 'ప్యారడైజ్' మూవీ విడుదలయ్యే రోజు. ఆ రకంగా అందరూ అదే రోజు నిమజ్జనం చేస్తే... సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి.
ఈసారి నిమజ్జనం 11వ రోజు కాకుండా 12వ రోజు జరగుతుందని అంటున్నారు. అంటే సెప్టెంబర్ 25న జరుగుతుందన్న మాట. సహజంగా వినాయక నిమజ్జనాన్ని అనంత చతుర్దశి రోజు చేస్తారని, ఆ ముహూర్తం ఈసారి 25వ తేదీ వచ్చిందని పండితులు చెబుతున్నారు. అందువల్ల 25న రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జనం చేసినా... అది 'ప్యారడైజ్' మూవీకి రెండో రోజు. సో... సినిమా విడుదలైన మర్నాడు ఈ నిమజ్జన ప్రభావం కలెక్షన్స్ పై పడుతుంది. ఎందుకంటే... సాధారణ ప్రజలు నిమజ్జనంను పక్కన పెట్టి... ఎంత గొప్ప సినిమా అయినా చూడటానికి థియేటర్ కు వెళ్ళడానికి ఆసక్తి చూపించరు. ఆ రకంగా 'ది ప్యారడైజ్' వీకెండ్ కలెక్షన్స్ పై వినాయక నిమజ్జనం ప్రభావం ఖచ్చితంగా పడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా... జనాలు శని, ఆదివారాల్లో ఈ సినిమాను చూసి మొదటి రెండు రోజుల కలెక్షన్స్ లోటునూ తీర్చుతారేమో చూడాలి.
ఇవి కూడా చదవండి!
చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత సీమంతం పోస్ట్ వైరల్
పావలా శ్యామల కూతురికి 'మా' చేదోడు!
36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ ఏందయ్యా ఈ స్పీడ్!