The Paradise: ‘ది ప్యారడైజ్’ వచ్చేది ఆ నెలలోనేనా!
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:20 AM
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం మరోసారి వాయిదా పడినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ సినిమా మరోసారి వాయిదా అనగానే నాని ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.
ప్యాన్ ఇండియా సినిమా అంటేనే భారీ అంచనాలు, వందల కోట్ల వ్యాపారం. అయితే, ఇటీవలి కాలంలో ఈ స్థాయి సినిమాలకు విడుదల తేదీలను మార్చడం అనేది సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. గత ఐదేళ్ల కాలంలో అనుకున్న సమయానికి, రెండు కంటే తక్కువ సార్లు వాయిదా పడి థియేటర్లలోకి వచ్చిన పెద్ద చిత్రాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఎంతటి అగ్ర హీరోల సినిమాలైనా ఈ రీషెడ్యూల్స్ ఇబ్బందులను ఎదుర్కోక తప్పడం లేదు. ఇప్పుడు ఇదే బాటలో నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) కూడా చేరినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది.
వాస్తవానికి ఈ చిత్రాన్ని ముందుగా ఆగస్ట్ 21న విడుదల చేస్తామని ప్రకటించారు. అదే తేదీకి రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా కూడా బరిలోకి దిగుతుండటంతో, పోటీని నివారించేందుకు నాని సినిమా వెనక్కి తగ్గుతోందని తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, వాయిదా పడటం మాత్రం దాదాపు ఖాయమేనని సమాచారం. ప్రస్తుతం చిత్ర బృందం ఒక నెల ఆలస్యంగా, అంటే సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే యోచనలో ఉందట. ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ కొత్త తేదీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. పైగా అక్టోబర్‌లో బాలకృష్ణ 111వ సినిమా, ‘ఆదర్శ కుటుంబం’.. అలాగే నవంబర్‌లో 'రామాయణ' వంటి భారీ చిత్రాలు లైన్లో ఉన్నాయి కాబట్టి, సెప్టెంబర్ ముగింపే ఈ సినిమాకు సేఫ్ జోన్ అని భావిస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు సినిమా ఆలస్యమవడానికి ప్రధాన కారణం షూటింగ్ పరంగా ఎదురవుతున్న సవాళ్లేనని వినికిడి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆయన ఎంత వేగంగా పని పూర్తి చేయాలని చూస్తున్నా, మేకింగ్‌లో ఉన్న క్లిష్టత వల్ల పనులకు బ్రేకులు పడుతూనే ఉన్నాయట. హీరో నాని పూర్తి సహకారం అందిస్తున్నప్పటికీ, కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ కోసం ఎక్కువ వర్కింగ్ డేస్ కేటాయించాల్సి వస్తోందని తెలుస్తోంది. దీనికి తోడు ఇతర నటీనటుల డేట్లు ఒకేసారి సర్దుబాటు కావడం చిత్ర యూనిట్‌కు పెద్ద టాస్క్‌గా మారింది. ప్రస్తుతం షూటింగ్‌తో పాటే సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుతున్నారు.
అయితే, ఈ ఆలస్యానికి వెనుక అసలు సిసలైన సమస్య మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే టాప్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న అనిరుధ్ నుంచి కాల్ షీట్స్, రీ-రికార్డింగ్ సమయం దొరకడం మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ‘ది ప్యారడైజ్’ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, ఆయన నుంచి బెస్ట్ అవుట్ పుట్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రాబట్టాలంటే మరికొంత సమయం ఇవ్వక తప్పదు. ఆగస్ట్ నాటికి ఇవన్నీ పూర్తి కావడం అసాధ్యమని తేలడంతోనే టీమ్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మొదటి సాంగ్ వచ్చినా, సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఎప్పుడనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి ఈ వాయిదా సస్పెన్స్ మరికొద్ది రోజులు కొనసాగేలా ఉంది.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!
మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు