TFTDDA: జానీ మాస్టర్ వైఫ్ సుమలత స్కెచ్ అదిరిందిగా.. కోర్టు సంచలన తీర్పు
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:56 AM
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో కొద్దిరోజులుగా రాజుకుంటున్న అంతర్గత వివాదానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో కొద్దిరోజులుగా రాజుకుంటున్న అంతర్గత వివాదానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి వి.వి. సుమలతా దేవి (VV Sumalatha Devi) వేసిన పక్కా లీగల్ ఎత్తుగడతో ప్రత్యర్థులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసోసియేషన్ పాలకవర్గాన్ని చట్టవిరుద్ధంగా చేజిక్కించుకునేందుకు కొందరు సాగిస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ కూకట్‌పల్లిలోని రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 13న నిర్వహించతలపెట్టిన జనరల్ బాడీ సమావేశంపై న్యాయస్థానం మధ్యంతర ఇంజంక్షన్ (స్టే) విధించింది.
ప్రస్తుతం 2025-2027 కాలపరిమితికి ఎన్నుకోబడిన సుమలతా దేవి నాయకత్వంలోని కార్యవర్గం చట్టబద్ధంగా కొనసాగుతోంది. అయితే బైలా నిబంధనలను ఉల్లంఘిస్తూ కొందరు వ్యక్తులు ఆగస్టు 30న ఇందిరా నగర్‌లోని హోటల్ అనుపమలో అనధికారిక సమావేశాన్ని నిర్వహించి, తమకు తాముగా నకిలీ కమిటీని ప్రకటించుకున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా అసోసియేషన్ అధికారిక ఈమెయిల్ ఐడీని హ్యాక్ చేసి, జూబ్లీహిల్స్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు ఫోర్జరీ లేఖలు పంపి ఖాతాల సంతకాలు మార్చేందుకు యత్నించారని ఆరోపించారు. అసోసియేషన్‌కు చెందిన 537 మంది సభ్యుల సంక్షేమం కోసం దాచిన సుమారు రూ. 4 కోట్ల నిధులను కాపాడేందుకు న్యాయపరమైన రక్షణ కల్పించాలని కోరారు.
పిటిషనర్ దాఖలు చేసిన ఆధారాలు, పోలీసు ఫిర్యాదులను పరిశీలించిన న్యాయమూర్తి కావ్య జాడ ప్రతివాదుల చర్యలను ప్రాథమికంగా తప్పుపట్టారు. కే. రాఘవేంద్ర, వై. మెహర్ బాబా తదితర ప్రతివాదులెవరూ సెప్టెంబర్ 13న ఎలాంటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించకూడదని నిషేధం విధించారు. అసోసియేషన్ అధికారిక లెటర్ హెడ్లు, సీల్స్ వాడటంపై.. బ్యాంకులు ఇతర శాఖలకు లేఖలు రాయడంపై పూర్తి ఆంక్షలు విధించారు. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో సుమలతా దేవి తన పదవిని, అసోసియేషన్ నిధులను కాపాడుకోవడంలో పైచేయి సాధించారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇవి కూడా చదవండి:
దేవిశ్రీ కాదు.. సుక్కు, చరణ్ ‘RC17’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
నా జీవితంలో నటించిన వారికి ఆస్కార్ ఇవ్వొచ్చు: ఆర్తి
రామ్ పోతినేని బిగ్ సర్‌ప్రైజ్.. హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ