నా జీవితంలో నటించిన వారికి ఆస్కార్‌ ఇవ్వొచ్చు: ఆర్తి

ABN , Publish Date - Sep 12 , 2026 | 08:23 AM

కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి), ఆయన సతీమణి ఆర్తిల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న వివాదం మరోసారి తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

Jayam ravi and Aarti

కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి), ఆయన సతీమణి ఆర్తి (Aarti)ల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న వివాదం మరోసారి తీవ్ర దుమారాన్ని రేపుతోంది. వైవాహిక బంధంలో తలెత్తిన మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోగా, విడాకుల పిటిషన్ ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో రవి మోహన్ (Ravi Mohan) తన కెరీర్‌లో సరికొత్త అడుగులు వేస్తూ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ప్రముఖ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో ‘ఆన్ ఆర్డినరీ మేన్’ (An Ordinary Man) అనే చిత్రాన్ని నిర్మిస్తూ, తానే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు బెంగళూరుకు చెందిన ప్రముఖ గాయని, తన స్నేహితురాలు కెనీషా ఫ్రాన్సిస్‌ను సంగీత దర్శకురాలిగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించడం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది.


ఈ పరిణామాల వేళ ఆర్తి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక ఘాటైన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తమిళంలో అగ్ర నటులైన కమల్ హాసన్, విక్రమ్, సూర్య, అజిత్‌ల పేర్లను ప్రస్తావిస్తూ ఆమె తీవ్రస్థాయిలో సెటైర్లు వేశారు. ‘‘సూర్య, అజిత్, విక్రమ్, కమల్.. వీళ్లందరికంటే ఎక్కువగా నా జీవితంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి చేసిన నటనకు ఏకంగా ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు’’ అంటూ దెప్పిపొడిచారు. నేరుగా ఎవరి పేరూ ప్రస్తావించనప్పటికీ, భర్త రవి మోహన్‌ను ఉద్దేశించే ఆమె ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారని నెటిజన్లు భావిస్తున్నారు.


విడాకుల వ్యవహారం మొదలైనప్పటి నుంచి ఇద్దరి మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రవి మోహన్ మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ తాను బాధితుడినని పేర్కొనగా, ఆర్తి కూడా పలు సందర్భాల్లో గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడు కెనీషా ఫ్రాన్సిస్‌తో ప్రాజెక్ట్ ప్రకటన రావడం, దానికి కౌంటర్‌గా ఆర్తి ‘ఆస్కార్ నటన’ అంటూ పోస్ట్ పెట్టడంతో కోలీవుడ్ సర్కిల్స్‌లో ఈ వ్యక్తిగత వివాదం మరింత ముదిరినట్లయింది.

ఇవి కూడా చదవండి:

రామ్ పోతినేని బిగ్ సర్‌ప్రైజ్.. హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ

చిరు ‘కాకా’పై థమన్ మాస్ ప్రామిస్.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

ప్రముఖ ఓటీటీ లైన్‌లోకి.. ‘విశ్వంభర’ రిలీజ్‌కు క్లియరెన్స్ వచ్చినట్టేనా?

Updated Date - Sep 12 , 2026 | 08:28 AM