K. S. Chithra: తెలుగు వారు.. న‌న్ను అమ్మలా ఆదరిస్తున్నారు

ABN , Publish Date - Sep 29 , 2026 | 07:33 AM

నేను ఎక్కడికెళ్లినా తెలుగు వారు నన్ను అమ్మలా ఆదరిస్తున్నారు. నా ముఖ కవళికలను బట్టే శ్రీకృష్ణలాంటి సింగర్లు నాకేం కావాలో అర్థం చేసుకోవడం నా అదృష్టం’ అని ప్రముఖ గాయని కె.ఎస్ చిత్ర అన్నారు.

K. S. Chithra

గాయని చిత్ర (K. S. Chithra) మరోమారు హైదరాబాద్ వాసులను తన గానామృతంతో మురిపించేందుకు సిద్ధమయ్యారు. నవంబరు చిత్రామృతం 3.0 పేరిట సంగీత విభావరి నిర్వహించబోతున్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో ఓ స్టూడియోలో ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్రతో పాటు నిర్వాహక సంస్థలు జోరా, ఎన్ చాట్ మీడియా ప్రతినిధులు వినయెడ్డి, సంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ హైదరాబాద్‌లో నిర్వహించబోయే అతి పెద్ద సంగీత విభావరిగా ఇది నిలవనుందన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు గాయ‌ని చిత్ర అభిమానులు ఆమె పాడిన గీతాలతో ఓ మ్యాషప్ చేసి వినిపించారు.

అమ్మలా.. ఆదరిస్తున్నారు

‘తెలుగు అనగానే నాకు గుర్తొచ్చేది ఇక్కడివారు నా మీద చూపించే అభిమానమే. నేను ఎక్కడికెళ్లినా తెలుగు వారు నన్ను అమ్మలా ఆదరిస్తున్నారు. నా ముఖ కవళికలను బట్టే శ్రీకృష్ణలాంటి సింగర్లు నాకేం కావాలో అర్థం చేసుకోవడం నా అదృష్టం’ అని ప్రముఖ గాయని కె.ఎస్ చిత్ర అన్నారు. త్వ‌ర‌లో ‘చిత్రామృతం 3.0’ సంగీత కచ్చేరి జరగనున్న సందర్భంగా ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు.

‘ఎంత పెద్ద గాయనీగాయకులకైనా స్టేజ్‌ ఫియర్‌ కొంచెం ఉండాలి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా స్టేజ్‌ ఎక్కడానికి ముందు కడుపు మీద చేయి పెట్టుకుని కనిపించేవారు. స్టేజ్‌ ముందున్న అంత మంది ప్రేక్షకులను మెప్పించడం మాటలు కాదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి రోజూ సాధన చేయాలి’ అని అన్నారు. కెరీర్‌లో ఎంతో కష్టపడి పాడిన పాటలున్నాయని, కొన్నిసార్లు పాటలు పాడాక భావోద్వేగానికి గురైన సందర్భాలున్నాయని తెలిపారు.

‘నువ్వే కావాలి’ చిత్రంలో ‘కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు’ అనే పాట పాడిన తర్వాత ఏడుపు ఆగలేదని తెలిపారు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గాయని జానకి గురించి మాట్లాడుతూ ‘జానకిగారు నాకు మాతృ సమానురాలు. ఆమెను మానసిక గురువుగా భావిస్తుంటాను. ఆవిడ కన్ను మూశాక నేను చేసిన ప్రతి కచ్చేరిలోనూ ఆమె పాటలను పాడుతున్నాను’ అని చెప్పారు.

Updated Date - Sep 29 , 2026 | 07:47 AM