మరో వివాదంలో ఇరుముడి.. 7 ప్రశ్నలతో నిలదీసిన తెలంగాణ కార్మిక శాఖ..
ABN, Publish Date - Oct 31 , 2026 | 09:58 PM
మాస్ మహారాజా రవితేజ (Raviteja), ప్రియా భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన చిత్రం ఇరుముడి(Irumudi). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదిలో రిలీజైన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
మాస్ మహారాజా రవితేజ (Raviteja), ప్రియా భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన చిత్రం ఇరుముడి(Irumudi). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదిలో రిలీజైన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రికార్డు కలక్షన్స్ రాబట్టిన ఈ సినిమా వివాదాలను కూడా అలాగే తీసుకొచ్చిపెట్టింది. ఒకటి కాదు రెండు కాదు.. ఇరుముడి రిలీజ్ అయ్యాక చాలా వివాదాలు తలెత్తాయి. ఇక ఈ సినిమా థియేటర్ నుంచి ఓటీటీకి వచ్చాక కూడా వివాదాలు తప్పలేదు. తాజాగా మరోసారి ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో ఒక మైనర్ బాలికతో చిత్రీకరణ నిర్వహించడంపై తెలంగాణ కార్మిక శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుముడి సినిమాలో మణమ్మగా నటించిన బేబీ నక్షత్ర మైనర్ కావడంతో నిబంధనలకు విరుద్ధంగా మైనర్లను సినిమా షూటింగుల్లో ఉపయోగించారనే కోణంలో కార్మిక శాఖ అధికారులు పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ చిత్ర నిర్మాతలకు అధికారికంగా నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసులలో అధికారులు ప్రధానంగా ఏడు అంశాలపై నిర్మాతలను తీవ్రంగా ప్రశ్నించారు. షూటింగ్కు ముందే జిల్లా మేజిస్ట్రేట్ నుంచి తగిన అనుమతులు తీసుకున్నారా లేదా, అలాగే బాలిక తల్లిదండ్రుల నుంచి అధికారిక సమ్మతి పత్రాలు పొందారా అని నిలదీశారు. వీటితో పాటు షూటింగ్ రోజులకు సంబంధించిన కాల్షీట్లు, హాజరు పట్టిక, రోజువారీ పని గంటల వివరాలను తమ ముందుంచాలని ఆదేశించారు. బాలిక సంక్షేమం, భద్రతపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. చిత్రీకరణ సమయంలో బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. అలాగే సెట్లో భద్రత కోసం ప్రత్యేక సంరక్షకుడిని నియమించారా అని అడిగారు. అంతేకాకుండా, చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం బాలిక పారితోషికంలో 20 శాతం మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా లేదా అని ప్రశ్నించడంతో పాటు ప్రమోషన్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో బాలికను భాగస్వామ్యం చేయడంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఇక ఈ సంచలన వ్యవహారంపై నవంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు పూర్తి ఆధారాలు, సమ్మతి పత్రాలతో తమ కార్యాలయంలో నేరుగా విచారణకు హాజరుకావాలని కార్మిక శాఖ అధికారులు నిర్మాతలను ఆదేశించారు. కార్మిక శాఖ రంగంలోకి దిగడంతో ప్రస్తుతం టాలీవుడ్లో ఈ ఇరుముడి నోటీసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఈ నోటీసులపై మైత్రీ మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.