రాజమౌళిని.. మించి పోయిన సుకుమార్! లెక్కల మాస్టార్.. కొత్త ట్రెండ్
ABN, Publish Date - Mar 08 , 2026 | 07:14 AM
భారతీయ చిత్ర పరిశ్రమలో ఎస్.ఎస్. రాజమౌళి ఒక అజేయమైన శక్తిగా ఎదిగారు. వరుస బ్లాక్‌బస్టర్లతో కేవలం దేశంలోనే కాకుండా, ఆసియా వ్యాప్తంగా తనకంటూ ఒక బలమైన ముద్ర వేశారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎస్.ఎస్. రాజమౌళి ఒక అజేయమైన శక్తిగా ఎదిగారు. వరుస బ్లాక్‌బస్టర్లతో కేవలం దేశంలోనే కాకుండా, ఆసియా వ్యాప్తంగా తనకంటూ ఒక బలమైన ముద్ర వేశారు. భారీ బడ్జెట్ చిత్రాలను వెండితెరపై అద్భుతాలుగా మలచడంలో ఆయనది అందెవేసిన చేయి. రాజమౌళి సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అయినప్పటికీ, తన టీమ్ నుండి కొత్త దర్శకులను తయారు చేసే విషయంలో మాత్రం ఆయన తన తోటి దర్శకులతో పోలిస్తే కాస్త వెనుకబడి ఉన్నారనే చర్చ టాలీవుడ్‌లో తరచుగా జరుగుతుంటుంది.
ముఖ్యంగా సుకుమార్ (Sukumar) విషయానికి వస్తే, ఆయన కేవలం గొప్ప సినిమాలనే కాకుండా, పరిశ్రమకు సరికొత్త దర్శకులను కూడా పరిచయం చేశారు. సుకుమార్ వద్ద పనిచేసిన ఎంతోమంది సహాయ దర్శకులు ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు. 'ఉప్పెన'తో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు (Buchi Babu Sana), 'దసరా'తో మాస్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో పాటు విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు (Karthik Varma Dandu), తాజాగా మృత్యుంజయ్ సినిమాతో ఆకట్టుకున్న హుస్సేన్ షా కిరణ్ (Hussain Sha Kiran) వంటి వారు సుకుమార్ శిష్యరికంలో రాటుదేలిన వారే.
ఆయన చుట్టూ ఉన్న ఈ సృజనాత్మక వాతావరణం కొత్త తరం మేకర్స్‌కు ఒక బలమైన పునాదిగా మారుతోంది. సుకుమార్ దగ్గర శిక్షణ పొందిన వారు కేవలం దర్శకులుగానే కాకుండా, సినిమాలోని వివిధ క్రాఫ్టుల్లో కూడా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దీనివల్ల ఆయన చుట్టూ ఒక పటిష్టమైన మెంటార్‌షిప్ వ్యవస్థ ఏర్పడింది. రాజమౌళి (Rajamouli) తన సినిమాలపై పెట్టే శ్రద్ధ, ఆయన వర్కింగ్ స్టైల్ అద్భుతంగా ఉన్నా, ఆయన శిష్యగణం నుండి మాత్రం ఇప్పటివరకు ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ రాకపోవడం గమనార్హం. రాజమౌళి వద్ద పనిచేసిన అశ్విన్ గంగరాజు వంటి వారు ప్రయత్నాలు చేసినా, అవి ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాయి.
మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కూడా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో తనదైన ముద్ర వేశారు. వెంకీ కుడుముల (Venky Kudumula) వంటి దర్శకులు త్రివిక్రమ్ స్కూల్ నుండి వచ్చి 'ఛలో', 'భీష్మ' వంటి హిట్ చిత్రాలను అందించారు. నిజానికి ఒక సీనియర్ దర్శకుడు కచ్చితంగా తన టీమ్ నుండి కొత్త దర్శకులను తయారు చేయాలని ఎక్కడా రాసి లేదు. అది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. మెంటార్‌షిప్ అనేది ఒక బాధ్యత కంటే కూడా, ఒక దర్శకుడు తన విజన్‌ను తర్వాతి తరానికి అందించే ఒక ప్రక్రియగా చూడాలి.
ఏది ఏమైనా, రాజమౌళి వంటి మేధావి వద్ద పనిచేసే అసిస్టెంట్స్ భవిష్యత్తులో ఆయన మేకింగ్ స్టైల్‌ను గానీ, ఆ భారీ విజన్‌ను గానీ అడాప్ట్ చేసుకుని బయటకు వస్తే టాలీవుడ్‌కు అది పెద్ద ఎసెట్ అవుతుంది. ఆయన శిష్యుల నుంచి కూడా భారీ స్థాయి చిత్రాలు వస్తే భారతీయ సినిమా స్థాయి మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. రాజమౌళి స్కూల్ నుండి ఒక పాన్ ఇండియా స్థాయి దర్శకుడు ఎప్పుడు వస్తాడా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.