Raktha Charitra: సూర్య తొలి తెలుగు సినిమా రీ-రిలీజ్‌!

ABN , Publish Date - Jun 23 , 2026 | 03:00 PM

సూర్య తెలుగులో నటించిన తొలి చిత్రం 'రక్త చరిత్ర' రీ-రిలీజ్‌ కాబోతోంది. వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను సి. కళ్యాణ్‌ నిర్మించారు.

RGV Raktha Charitra

'ఒకసారి సినిమా తీసి విడుదల చేసిన తర్వాత దాని గురించి నేను అసలు పట్టించుకోను' అని చెబుతుండేవారు ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్‌ వర్మ. అయితే ఆయన తీసిన సినిమాల్లో 'శివ, రంగీలా' వంటి సూపర్ హిట్‌ చిత్రాలను రీ-రిలీజ్‌ చేశారు. 'రంగీలా' రీ-రిలీజ్‌కు పెద్దంత హంగామా చేయకపోయినా... 'శివ' సినిమాను 4కె లో రీ-రిలీజ్ చేసినప్పుడు వర్మ చేసిన సందడి అంతా ఇంతా కాదు. కానీ దానికి తగ్గ స్థాయిలో 'శివ' రీ-రిలీజ్‌ కు కలెక్షన్స్ వర్షం కురిపించలేక పోయింది. అయినా నిరాశపడకుండా వర్మ దాదాపు పదిహేనేళ్ళ క్రితం తాను రూపొందించిన 'రక్త చరిత్ర' మూవీని మరోసారి విడుదల చేయబోతున్నారు. చాలామందికి తెలియని విషయం ఏమంటే... తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఫస్ట్ స్ట్రయిట్‌ తెలుగు మూవీ ఇది!


రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలపై సినిమా తీస్తానని ఎంతోకాలం పాటు ఊరించిన వర్మ చివరకు 2010లో ఆ పని చేశారు. రాయలసీమ రక్తపాతాన్ని మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న రాజకీయ నాయకుల పదవీ కాంక్షను సైతం ఇందులో చూపించారు. 'రక్తచరిత్ర' మూవీని రెండు భాగాలుగా వర్మ తీశారు. పరిటాల రవిని పోలిన పాత్రను వివేక్ ఓబెరాయ్‌ చేయగా, మద్దెల చెరువు సూరి తరహా పాత్రను సూర్య చేశారు. ఇతర కీలక పాత్రలను సుదీప్, శతృఘ్నసిన్హా, రాధికా ఆప్టే, అభిమన్యుసింగ్‌, కోట శ్రీనివాసరావు తదితరులు పోషించారు. ఈ సినిమా 2010 అక్టోబర్ 22న విడుదల కాగా, దీని కొనసాగింపుగా 'రక్తచరిత్ర 2' అదే యేడాది డిసెంబర్‌లో వచ్చింది. అయితే మొదటి భాగానికి వచ్చిన స్పందన రెండో భాగానికి రాలేదు. అందుకే వర్మ ఇప్పుడు 'రక్తచరిత్ర' మొదటి పార్ట్‌ను జూలై 17న రీ-రిలీజ్‌ చేయబోతున్నారు.


ఈ రీ-రిలీజ్‌ ముచ్చట అలా ఉంచితే... కొద్ది రోజుల క్రితం వర్మ 'పోలీస్ స్టేషన్ మే భూత్' అనే సినిమాను రూపొందించారు. తన మనసుకు తోచినప్పుడల్లా వర్మ సోషల్ మీడియాలో ఈ సినిమా స్టిల్స్ ను పోస్ట్ చేస్తూ కొంత క్రేజ్‌ తీసుకొచ్చారు. రమ్యకృష్ణ, మనోజ్ వాజ్ పాయ్‌, రావు రమేశ్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించిన 'పోలీస్ స్టేషన్ మే భూత్‌' మూవీ ఎప్పుడు వస్తుందో ముందు చెప్పమంటున్నారు అభిమానులు.

r.jfif

ఇవి కూడా చదవండి:

పండంటి బిడ్డకు జననం.. నారా రోహిత్, శిరీష దంపతులకు ప్రమోషన్!

సమంత ప్రెగ్నెంట్ అని రివీల్ చేసిన చిరంజీవి.. ట్వీట్ వైరల్!

కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరే!

Updated Date - Jun 23 , 2026 | 03:43 PM