కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరే!

ABN , Publish Date - Jun 22 , 2026 | 07:26 PM

సినిమా నిర్మాణం అంటేనే ఎంతో రిస్క్‌తో కూడుకున్న జాబ్.. అందునా ఆడవాళ్ళకు మరింత కష్టతరమైనది. అయినా కొందరు హీరోయిన్స్ చిత్ర నిర్మాణం బాటపట్టారు. సినిమాలు నిర్మించడం అంత ఈజీ కాదంటూనే ఆ రూటులో సాగుతున్నారు.

Tollywood Actresses Turned Producers

సినిమా నిర్మాణం అంటేనే ఎంతో రిస్క్‌తో కూడుకున్న జాబ్.. అందునా ఆడవాళ్ళకు మరింత కష్టతరమైనది. అయినా కొందరు హీరోయిన్స్ చిత్ర నిర్మాణం బాటపట్టారు. సినిమాలు నిర్మించడం అంత ఈజీ కాదంటూనే ఆ రూటులో సాగుతున్నారు. అభిరుచి అలాంటిది మరి. ఇప్పుడేనా! తెలుగు సినిమా గోల్డెన్ ఎరాలోనూ నటీమణులు నిర్మాతలుగా మెప్పించారు. ఆ ముచ్చటేంటో చూద్దామా..

కష్టానికి తగ్గ ఫలితం...

అందాల తార సమంత (Samantha) నిర్మించి, నటించిన ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) చిత్రం ఈ మధ్యే విడుదలైంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మా ఇంటి బంగారం’ జనాన్ని ఆకట్టుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ‘నటించడం ఎంతో ఈజీ- కానీ చిత్ర నిర్మాణం అంత సులువు కాదు’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు సమంత. ‘మా ఇంటి బంగారం’ నిర్మాతగా సమంత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కానీ, మొత్తానికి నటనే మేలు అనే భావనకు వచ్చారు సమంత. ఆమె చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం ‘శుభమ్’ అనే చిత్రాన్ని కూడా సమంత నిర్మించారు. అందులో ‘గెస్ట్ అప్పియరెన్స్’ ఇచ్చిన సమంత.. ఈ సారి ‘మా ఇంటి బంగారం’లో మాత్రం పూర్తి స్థాయిలో టైటిల్ రోల్ ధరించారు. ఈ మూవీతో ఆమెకు మంచి లాభాలే వస్తాయని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి.


అభిరుచిని చాటుకుంటూ...

తెలుగు చిత్రసీమలో పేరున్న హీరోయిన్స్ నిర్మాతలుగానూ అలరించడం కొత్తేమీ కాదు. అలనాటి మేటి నటి పి.కృష్ణవేణి కూడా నిర్మాతగా అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించారు. 1949లో కృష్ణవేణి నిర్మించిన ‘మనదేశం’ చిత్రంతోనే మహానటుడు, నటరత్న యన్టీఆర్ చిత్రసీమకు పరిచయం అయ్యారు. అలా నాయికలు కూడా నిర్మాతలుగా తమ అభిరుచిని చాటుకున్నారు. ఆ తర్వాత కృష్ణవేణి బాటలోనే పయనిస్తూ మరో నటి లక్ష్మీరాజ్యం కూడా నిర్మాతగా మారి తన టేస్ట్‌కు తగ్గట్టుగా.. ‘దాసి, హరిశ్చంద్ర, నర్తనశాల, శకుంతల, రామ్ - రహీమ్, మగాడు’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆమె కూడా నిర్మాతగా విజయం సాధించారు. లక్ష్మీరాజ్యం నిర్మించిన ‘నర్తనశాల’ పలు అవార్డులు, రివార్డులు సంపాదించింది. ఈ మూవీ దేశవిదేశాల్లో ఆదరణ చూరగొనడం విశేషం.


Bhanumati-Ramakrishna.jpg

భానుమతి తీరే వేరు..

బహుముఖ ప్రజ్ఞకు మరో పేరు భానుమతీ రామకృష్ణ (Bhanumathi Ramakrishna). నటిగానే కాదు గాయనిగా, రచయిత్రిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా భానుమతి తనదైన బాణీ పలికించారు. తొలిసారి దర్శకత్వం వహిస్తూ ‘చండీరాణి’ చిత్రాన్ని 1953లో నిర్మించారు భానుమతి. అందులో ద్విపాత్రాభినయం చేయడమే కాదు, సంగీత పర్యవేక్షణ కూడా నిర్వహించారు. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసి ఆ రోజుల్లోనే ‘పాన్ ఇండియా మూవీ’గా తన ‘చండీరాణి’ చిత్రాన్ని నిలిపారు భానుమతి. ఈ సినిమా శతదినోత్సవాలు జరుపుకుంది. ఆ పై భర్త రామకృష్ణ దర్శకత్వంలోనూ, కొన్ని చిత్రాలకు తానే దర్శకత్వం వహిస్తూ ఆమె చిత్రాలు నిర్మించారు. అందరూ బాలలతో భానుమతి నిర్మించి, దర్శకత్వం వహించిన ‘భక్త ధ్రువ మార్కండేయ’ ఆ రోజుల్లో ఎందరికో మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది.

అంజలీదేవి బాణీ

తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లోనే మరికొందరు నటీమణులు నిర్మాతలుగానూ రాణించారు. వారిలో అంజలీ పిక్చర్స్ పతాకంపై పలు మరపురాని చిత్రాలు నిర్మించిన నటి అంజలీదేవి (Anjali Devi)ని మరువరాదు. తన తరం హీరోలు యన్టీఆర్, ఏయన్నార్ తోనూ.. తర్వాత కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవితోనూ చిత్రాలు నిర్మించి ప్రేక్షకులను రంజింప చేశారు అంజలీదేవి. ఆమె నిర్మించిన చిత్రాలకు భర్త ఆదినారాయణ రావు సంగీతం సమకూర్చి అలరించారు. సంగీతసాహిత్యాలకు పెద్దపీట వేసి.. అంజలీదేవి, ఆదినారాయణ రావు సినిమాలను ప్రేక్షకుల ముందు నిలిపారు.

Vijaya-nirmala.jpg

అదే బాటలో మరికొందరు..

మహానటి సావిత్రి (Savitri) కూడా కొన్ని చిత్రాలు నిర్మించారు. నటి, దర్శకురాలు విజయనిర్మల సైతం విజయకృష్ణా పిక్చర్స్ పతాకంపై సినిమాలు తెరకెక్కించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. తరువాతి తరం హీరోయిన్లు జయసుధ, జయప్రద కూడా చిత్ర నిర్మాణంతో సాగారు. జయసుధ తన అభిరుచిని చాటుకుంటూ భర్త నితిన్ కపూర్‌తో కలసి సినిమాలు నిర్మించారు. జయప్రద తన తమ్ముడు శ్రీరామ్‌తోనూ, తన అక్క కొడుకు సిద్ధు హీరోగానూ రెండు సినిమాలు తీశారు. నటుడు రాజశేఖర్ భార్య నటి జీవిత కూడా తన భర్త హీరోగా కొన్ని చిత్రాలు నిర్మించారు.. కొన్నిటికి దర్శకత్వం వహించారు. ఈ మధ్య కాలంలో మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటూ సాగుతున్నారు. బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో మంచు లక్ష్మి (Manchu Lakshmi) నిర్మించిన ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా..’ ఆకట్టుకుంది. ఇందులో తన తమ్ముడు మంచు మనోజ్‌ను హీరోగా నటింప చేశారామె. ఇంకా మహేష్ బాబు సోదరి మంజుల (Manjula) నిర్మాతగా చేసిన ‘పోకిరి’, ‘ఏ మాయ చేసావే’ చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన విషయం తెలియంది కాదు.


Charmi-Kaur.jpg

నవతరం మెచ్చేలా...

అందంతో హిందోళాలు పాడించడమే కాదు.. నిర్మాతలుగానూ ఆకట్టుకున్నవారు మరికొందరు తెలుగునాట కనిపిస్తారు. ఓ నాటి నటి కళ్యాణి కూడా అప్పట్లో తన భర్త సూర్య కిరణ్ దర్శకత్వంలో ‘సిక్స్ ఛాప్టర్స్’ అనే మూవీ తెరకెక్కించారు. నటి రాశి కూడా తన భర్త శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘మహారాజశ్రీ’ అనే సినిమాను నిర్మించారు. ఒకప్పుడు అందాలభామగా అలరించిన ఛార్మి కౌర్, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ భాగస్వామిగా చిత్రాలు నిర్మిస్తున్నారు. వీరిద్దరూ విజయ్ సేతుపతి హీరోగా నిర్మించిన ‘స్లమ్ డాగ్- 33 టెంపుల్ రోడ్’ అనే మూవీ త్వరలో విడుదల కానుంది. ఇక నటుడు నాగబాబు కూతురు నిహారిక (Niharika) కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా, ప్రస్తుతం నిర్మాతగానే అభిరుచికి తగ్గ మూవీస్ నిర్మిస్తూ సాగుతున్నారు. తన అన్న వరుణ్ తేజ్ హీరోగా ‘బరి’ అనే చిత్రాన్ని ఆమె నిర్మిస్తున్నారు. ఇలా ఎందరో నటీమణులు నిర్మాతలుగానూ రాణించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది నటీమణులు నిర్మాతలుగా మారి అలరిస్తారో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

ఆ ప్రకటనలను నమ్మవద్దు: ‘వెంకీఅనిల్5’ టీమ్ హెచ్చరిక

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

అందరి ముందు శ్రీలీలను అవమానించిన సీఎం భార్య..

Updated Date - Jun 22 , 2026 | 07:27 PM