‘ఆదర్శ కుటుంబం’ కోసం ‘సమ్మర్ హాలిడేస్’ వాయిదా.. నవంబర్ 6న విడుదల

ABN , Publish Date - Oct 22 , 2026 | 01:18 PM

వెంకటేశ్‌–త్రివిక్రమ్‌ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల నేపథ్యంలో ధీరజ్ మొగిలినేని నిర్మించిన ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా మరోసారి వాయిదా పడింది. నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపు, టికెట్ ధరల పెంపుపై నిర్మాత ధీరజ్ మొగిలినేని కీలక వ్యాఖ్యలు చేశారు.

Summer Holidays Movie

ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు ధీరజ్ మొగిలినేని నిర్మించిన చిత్రం 'సమ్మర్ హాలిడేస్'. ఈ యేడాది మే1న విడుదల కావాల్సిన ఈ సినిమా రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు అక్టోబర్ 30న పక్కాగా వస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. అయితే ఇప్పుడు అదే రోజున వెంకటేశ్‌ - త్రివిక్రమ్‌ 'ఆదర్శ కుటుంబం' వస్తున్న నేపధ్యంలో మరోసారి ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈసారి ఖచ్చితంగా నవంబర్ 6న తమ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధీరజ్‌ మొగిలినేని మాట్లాడుతూ ఇవాళ చిత్రసీమలో ఉన్న పరిస్థితులను వివరించారు. ఆయన తమ చిత్రం గురించి మాట్లాడుతూ, 'నిజానికి నిర్మాతల మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. అయితే పెద్ద సినిమాల నిర్మాతల చిన్న చిత్రాలకు కాస్తంత గ్యాప్‌ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. వెంకటేశ్‌ 'ఆదర్శ కుటుంబం' సినిమా ఎప్పుడు వచ్చినా థియేటర్లు దొరకుతాయి. కానీ మేం తీసే చిన్న సినిమాలకు నాలుగు వారాల ముందు నుంచి ఎలర్ట్ గా ఉండాలి. నిజానికి అక్టోబర్ 30న వస్తుందని భారీగా పబ్లిసిటీ చేశాం. డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పుడు మరోసారి అప్పు తెచ్చుకుని పబ్లిసిటీ చేసుకోవాలి. ఇది నాలాంటి చాలామంది నిర్మాతల పరిస్థితి. అక్టోబర్ 30న వచ్చే మరికొందరు నిర్మాతలు సైతం తమ చిత్రాలను వాయిదా వేసుకుంటున్నారు. తమిళంలో సినిమాల విడుదల సమయంలో హీరోలకు, నిర్మాతలకు మధ్య మంచి అవగాహన ఉంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రారంభంలో పెద్ద నిర్మాతలు ఉండేవారు. సీనియర్‌ నిర్మాతలు యాక్టివ్‌గా ఉండేవారు. ఇప్పుడు వేరేవారు నడిపిస్తున్నారు. వారికి చిన్న నిర్మాతలంటే.. చిన్న చూపు ఉంది' అని అన్నారు.


పెద్ద సినిమాల టిక్కెట్ రేట్లను పెంచడం కూడా సమంజసం కాదని ధీరజ్ మొగిలినేని అన్నారు. 'ప్రభుత్వం అలా చేయడం వల్ల రెవిన్యూ కోసం అన్నీ థియేటర్స్ లో పెద్ద సినిమాలనే ఎక్కువ వేసుకుంటున్నారు. అన్ని సినిమాలకూ ఒకటే రేట్‌ ఉంటే చిన్న సినిమాలకు థియేటర్స్ ఉంటాయి. ఇండస్ట్రీకి మంచి జరగాలంటే టిక్కెట్‌ రేట్లు పెంచొద్దు' అని ఆయన అన్నారు. సమ్మర్ కు రావాల్సిన తమ 'సమ్మర్ హాలిడేస్' సినిమా దీపావళి హాలిడేస్ కు వస్తోందని, ఈసారి పక్కాగా విడుదల అవుతుందని మాస్టర్ రోహన్ అన్నారు. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని, తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు శ్రీకర్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

రగ్గడ్ లుక్‌లో రామ్ చరణ్.. ‘RC17’ స్క్రిప్ట్ రీడింగ్‌లో.. పిక్ వైరల్

నవ్వుల రాబరీ మొదలైంది.. హిలేరియస్‌గా ‘దొంగ నా కొడుకు’ టీజర్

తల లేని మొండెంతో.. ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్ అదిరింది

Updated Date - Oct 22 , 2026 | 01:19 PM