ఈ యేడాది లోటును తీర్చబోతున్న నెక్ట్స్ సమ్మర్!
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:26 PM
ఈ సారి సమ్మర్ సందడి సరిగా లేదు. అందుకే సినీ ఫ్యాన్స్ చూపు రాబోయే వేసవి వైపు సాగుతోంది. 2027 సమ్మర్ రేస్ రంజుగా ఉంటుందని ఆశిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరుగుతాయా అన్నదే అనుమానం!?
వేసవి వస్తోందంటేనే సెలవుల కాలం వచ్చేస్తోందని సినీజనం ఆనందిస్తారు. ఎంచక్కా స్టూడెంట్స్ కు సెలవులు కావడం వల్ల థియేటర్స్ కళకళలాడతాయని ఎగ్జిబిటర్స్ ఆశ. అందువల్లే సమ్మర్ సీజన్ కు టాప్ స్టార్స్ మూవీస్ రిలీజ్ చేసి సక్సెస్ సాధించవచ్చని సినీజనం భావిస్తూంటారు. అలా బాక్సాఫీస్ ను షేక్ చేసిన అనేక చిత్రాలు సమ్మర్ లోనే వెలుగు చూడడం గమనార్హం! అయితే ఈ సారి అంత సందడి సాగదని తేలిపోయింది. జూన్ ఫస్ట్ వీక్ తో వేసవి సెలవులకు చాలా విద్యాసంస్థలు స్వస్తి పలుకుతాయి. అప్పటి దాకా ఒక్క టాప్ స్టార్ మూవీ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం జూన్ లో వస్తుందని అన్నారే కానీ, ఇప్పటి దాకా డేట్ ప్రకటించలేదు. సో - సమ్మర్ సందడి లేనట్టే అని భావిస్తున్నారు. ఇప్పటి నుంచే వచ్చే వేసవికి రాబోయే సినిమాలేవో అంటూ అటువైపు చూస్తున్నారు సినీ ఫ్యాన్స్.
రాబోయే వేసవి లక్ష్యంగా ముగ్గురు టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ రానున్నాయని తెలుస్తోంది. మార్చి 5వ తేదీనే ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తోన్న 'స్పిరిట్' రిలీజ్ కానుందని టాక్. ఇక ఏప్రిల్ 7వ తేదీన మహేశ్ హీరోగా రాజమౌళి రూపొందిస్తోన్న 'వారణాసి' విడుదల కానుంది. జూన్ 11వ తేదీన యన్టీఆర్- నీల్ మూవీ వస్తుందని ఇటీవలే ప్రకటించారు. ఈ మూడు చిత్రాలు ఓ ప్లానింగ్ ప్రకారమే వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ చిత్రాల మధ్య ఓ నెల గ్యాప్ ఉంటేనే మంచిది. వసూళ్ళ పరంగా అదే మంచి పద్ధతి. అన్ని బిగ్ మూవీస్ గంపగుత్తలా ఒకేసారి వస్తే ఏం లాభం- ఏదో ఒక సినిమాకు నష్టం వాటిల్లక తప్పదు. 'స్పిరిట్' రిలీజైన నెల రోజుల తరువాతే 'వారణాసి' రానుంది. దాంతో రెండు మూవీస్ సేఫ్ ! ఇక వేసవి ముగిసే సమయంలో వచ్చే యేడాది జూన్ 11న యన్టీఆర్ - నీల్ మూవీ విడుదల కానుంది. 'వారణాసి'కి, యన్టీఆర్ మూవీకి రెండు నెలల గ్యాప్ ఉంది కనుక ఏ లాంటి ఇబ్బంది లేదు. ఇదీ ట్రేడ్ పండిట్స్ అంచనా.
'స్పిరిట్', 'వారణాసి', 'యన్టీఆర్-నీల్' మూవీ అనుకున్న సమయానికే వస్తాయా? అన్నది అనుమానం. ఎందుకంటే టాప్ స్టార్స్ భారీ సినిమాలు ఈ మధ్య ప్రకటించిన తేదీకి రిలీజ్ కావడం లేదు. 'స్పిరిట్' మూవీ మార్చి 5వ తేదీకి సిద్ధం కాకపోవచ్చుననీ వినిపిస్తోంది. అదే జరిగితే, ఆ చిత్రం మే నెలను ఎంచుకుంటే మంచిదనీ ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. ఇక రాజమౌళి 'వారణాసి' అనుకున్న సమయానికే వచ్చేస్తుంది. జక్కన్న ప్లానింగ్ అలాంటిది మరి. యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటించిన తేదీకి రాకపోవచ్చుననీ కొందరిమాట. అదే జరిగితే ఆ సినిమా ఏకంగా దసరాను టార్గెట్ చేసుకోవచ్చుననీ వినిపిస్తోంది. అల్లు అర్జున్ 'రాకా' ఏకంగా డిసెంబర్ ను ఎంచుకుంది. కాబట్టి ప్రాబ్లెమ్ లేదు. మరి 2027 సమ్మర్ సందడిలో 'వారణాసి' సోలో పెర్ఫామెన్స్ తో రచ్చ చేస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?
అలా విమర్శించే వారిని వదలకండి: చంద్రబాబుకు బండ్ల సూచన
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!