సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘బాహుబలి’ని దాచాడు కానీ.. మహేష్‌ని జక్కన్న దాచలేకపోతున్నాడా

ABN, Publish Date - Aug 07 , 2026 | 02:42 PM

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా నుంచి మరో సీన్ లీక్ కావడంతో టీమ్ షాక్‌కు గురైంది.

Varanasi facing repeated leaks from shooting locations

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’ (Varanasi). ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ హిట్ల తర్వాత జక్కన్న తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ పాన్‌ వరల్డ్‌ మూవీని కూడా సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి వరుసగా లీకులు బయటకొస్తున్నాయి. దీంతో జక్కన్న టీమ్‌ షాక్‌కు గురవుతోంది.


సాధారణంగా రాజమౌళి తన ప్రతి సినిమాను ఒక శిల్పంలా చెక్కుతారు. ఆ శిల్పం పూర్తయ్యేవరకు ఎలాంటి పిక్ లేదా వీడియో బయటకు రాకుండా అత్యంత జాగ్రత్తపడతారు. గతంలో ‘బాహుబలి’ (Baahubali) సమయంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే కాన్సెప్ట్‌ను సంవత్సరాల పాటు సస్పెన్స్‌లో ఉంచిన చరిత్ర ఆయనది. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా దాదాపు అదే స్థాయిలో ప్రైవసీ కాపాడారు. కానీ, ‘వారణాసి’ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. వరుసగా బయటకొస్తున్న లీక్‌లు రాజమౌళిని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. సినిమా కాన్సెప్ట్ టీజర్ రిలీజ్‌ టైమ్‌లోనే డ్రోన్ షాట్‌తో లీక్ చేశారని రాజమౌళి స్వయంగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది అక్కడితో ఆగలేదు. గతంలో ఒడిశాలో కీలకమైన షెడ్యూల్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల విజువల్స్ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాత్ర ఈ సినిమాలో అత్యంత కీలకంగా ఉండబోతోందనే ప్రచారం జోరుగా జరిగింది. అలాంటి సమయంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ వీల్‌ చైర్‌లో కూర్చున్న వీడియో బయటకొచ్చింది. ఇక.. రాముడి గెటప్‌లో ఉన్న మహేష్ లుక్ గురించి రాజమౌళి పదే పదే ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. టీజర్‌ రిలీజ్‌ సమయంలో మహేశ్‌ రాముడి గెటప్‌లో ఉన్న ఫోటో చాలా అద్భుతంగా ఉందని.. దాన్ని ఫోన్‌లో వాల్‌పేపర్‌ పెట్టుకున్నానని రాజమౌళి చెప్పారు. కానీ, దాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా చెప్పారు. అయితే దాన్ని ఎంత సీక్రెట్‌గా ఉంచాలని చూసినా, ఆ రాముడి గెటప్ వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇటీవల మళ్లీ షూటింగ్ లొకేషన్ క్లిప్ ఒకటి లీక్ అవడం చిత్ర బృందాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారణాసి సెట్‌లో మహేష్‌ బాబుపై చిత్రీకరిస్తున్న పలు సీన్‌లను కొంత మంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో విడుదల చేశారు.


రాజమౌళి సినిమా సెట్ అంటేనే సాధారణంగా రెండంచెల భద్రత ఉంటుంది. లొకేషన్‌లోకి వెళ్లేముందు హీరో, ఆయన పీఏల నుంచి టెక్నీషియన్లు, లొకేషన్ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌లను సబ్మిట్ చేయాల్సిందే. అంతటి కఠినమైన రూల్స్ ఉన్నప్పటికీ.. ఈ లీకులు ఎలా వస్తున్నాయి? అనే ప్రశ్న ఇప్పుడు జక్కన్న టీమ్‌ను వేధిస్తోంది. అయితే టెక్నాలజీ పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘బాహుబలి’ కాలంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో హై జూమ్‌ కలిగిన అత్యాధునిక మొబైల్స్‌, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాయి. వీడియో రికార్డ్‌ చేసిన క్షణాల్లోనే అది సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైపోతోంది. వందలాది మంది పనిచేసే ప్రొడక్షన్ లొకేషన్లలో లేదా అవుట్‌డోర్ సెట్స్‌లో ఎక్కడో ఒకచోట ఎవరూ గమనించని సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే దర్శక-నిర్మాతలకు ఈ డిజిటల్ యుగంలో లీకులు ఒక అతిపెద్ద సవాలుగా మారాయి. సినిమాలోని ప్రధానమైన సర్‌ప్రైజ్‌లు ముందే లీక్ అయితే థియేటర్‌లో ప్రేక్షకుడు పొందే ఆ థ్రిల్లింగ్ అనుభూతి ఖచ్చితంగా దెబ్బతింటుంది. అందుకే, మహేష్ బాబు - రాజమౌళి కలల ప్రాజెక్ట్ ‘వారణాసి’ని కాపాడుకునేందుకు, రాబోయే షెడ్యూల్స్ కోసం జక్కన్న టీమ్ భద్రతను మరింత పెంచి, లీకులకు చెక్ పెట్టేందుకు అత్యంత కఠినమైన చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఈ వార్తలపై కూడా ఓ లుక్ వేయండి:

కొరియన్ కనకరాజు టాక్‌పై మెగాస్టార్ స్పందనిదే..

Lenin OTT: లెనిన్.. ఓటీటీకి వ‌చ్చేశాడు

Korean Kanakaraju: వరుణ్ తేజ్ కొరియన్‌ కనకరాజు రివ్యూ

Updated Date - Aug 07 , 2026 | 02:42 PM