Actor Sriman: తెలుగులో అవకాశం అడగాలని గొంతు వరకూ ఉండేది!
ABN, Publish Date - Jul 03 , 2026 | 06:41 PM
తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి అలరించారు తెలుగు నటుడు శ్రీమన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ వందల చిత్రాల్లో నటించిన మాతృభాషలో సరైన అవకాశం రాలేదే అన్నది ఆయన బాధ.
తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి అలరించారు తెలుగు నటుడు శ్రీమన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ వందల చిత్రాల్లో నటించిన మాతృభాషలో సరైన అవకాశం రాలేదే అన్నది ఆయన బాధ. అనిల్ రావిపూడి ఆ కోరిక తీర్చి, ఆ బాధను తొలగించారు. హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్వకత్వంలో వెంకటేశ్, కల్యాణ్‌రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రంలో శ్రీమన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే వారం రోజులు షూటింగ్ కూడా చేశారు. ఈ మేరకు ఆయన అనిల్ రావిపూడికి కృతజ్ఞతలు చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఏమన్నారంటే..
‘‘నేను తెలుగు డైలాగ్‌లు మాట్లాడి రెండు మూడేళ్లు అవుతుంది. తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయితే నా క్యారెక్టర్‌కి నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. నేను తెలుగు అబ్బాయిని, తెలుగు మాట్లాడటం వచ్చు కాబట్టి. ఎంతో కాలంగా తెలుగు సినిమాలో గుర్తుండిపోయే పాత్ర రాకపోతాదా అని ఎదురుచూస్తున్నా. నా తమిళ సినిమాలు చూసిన మన దర్శకులెందరో నన్ను గుర్తు పట్టి ఫలాన సినిమాలో క్యారెక్టర్ బావుంది అని చెబుతుంటారు. ‘నేను తూర్పు గోదావరి జిల్లా చెందిన జి. మామిడాడకు చెందిన తెలుగువాడిని. ఒక్క అవకాశం ఇవ్వండి సర్’ అనిగొంతు చివరి వరకూ వస్తుంది కానీ అడగలేకపోయాను. అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు. హైదరాబాద్‌లో ‘వారిసు’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దిల్ రాజు ద్వారా అనిల్ రావిపూడితో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆయన్ని అడిగేశా మిమ్మల్ని ఓసారి కలవచ్చా అని. షూర్‌గా రండీ అన్నారు. అప్పటికే ఆయన తీసిన సినిమాలు చూశా. కామెడీ టైమింగ్ అంటే ఇష్టం. 2022 నుంచి ఆయన్ను ఫాలో అవుతున్నా. ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం. నేను అంటే ఆయనకు ప్రేమ. ఇప్పటికి ఆయన నుంచి పిలుపు వచ్చింది.
ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న వెంకటేశ్, కల్యాణ్‌రామ్ సినిమాలో మంచి క్యారెక్టర్ రాశారు. చక్కని టీమ్‌తో కాంబినేషన్ కుదిరింది. షూటింగ్ మొదలై వారం రోజులు అయింది. అద్భుతమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. మంచి టీమ్‌తో పని చేశానన్నా ఆనందం నాలో కలిగింది. రెండు మూడు నెలల ముందే ఈ సినిమా చేస్తానని తెలుసు. అందుకే తమిళంలో నాలుగు సినిమాలు వదిలేశా. అక్కడ నా ఫ్రెండ్స్ అయిన డైరెక్టర్స్ అంతా సపోర్ట్ చేశారు. నా మాతృభాషలో అవకాశం అందుకున్నానని చాలా ఆనందంగా ఉంది. ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్‌లో సినీ ప్రియులు గుర్తించి ఫలానా సినిమాలో చూశాం అంటూ పొగడుతారు, సెల్ఫీలు తీసుకుంటారు. కానీ లాస్ట్‌లో మీ పేరేంటి అంటారు. అక్కడే బాధ కలుగుతుంది. తమిళంలో వందల సినిమాల్లో చేసిన సొంత భాష తెలుగులో గుర్తింపు రాలేదే అన్న బాధ ఉంది. అది అనిల్ రావిపూడి సినిమాతో తీరుతుంది’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
దసరా బరిలో.. చిరంజీవి వర్సెస్ రజనీకాంత్ వర్సెస్ ధనుష్!
72nd National Awards: జ్యూరీ ఛైర్మన్ మలయాళీ కాబట్టి.. అల్లు అర్జున్‌కి డౌటేనా!?