‘రావు బహదూర్’ రివ్యూ

ABN , Publish Date - Jul 03 , 2026 | 01:59 PM

సత్యదేవ్ కథానాయకుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆయన కీలక పాత్రధారిగా తెరకెక్కిన ఓ అరడజను చిత్రాలు విడుదలయ్యాయి. అయితే వాటిలో ఏదీ తనకి సరైన రిజల్ట్ ఇవ్వలేదు. ఈసారి ఎంతో ధీమాగా హిట్ కొడతాం అనే నమ్మకంతో చేసిన చిత్రం ‘రావు బహదూర్. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ  సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం. 

సినిమా రివ్యూ: 'రావు బహదూర్' (Rao Bahadur Review)


సత్యదేవ్ (Satya Dev) కథానాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆయన కీలక పాత్రధారిగా తెరకెక్కిన ఓ అరడజను చిత్రాలు విడుదలయ్యాయి. అయితే వాటిలో ఏదీ తనకి సరైన రిజల్ట్ ఇవ్వలేదు. ఈసారి ఎంతో ధీమాగా హిట్ కొడతాం అనే నమ్మకంతో చేసిన చిత్రం ‘రావు బహదూర్ (Rao Bahadur Review). ఆయనతో ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన చిత్రమిది. వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండో చిత్రం కావడం, దీనికి మహేశ్ బాబు సమర్పకుడిగా ఉండటంతో సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ  సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.

కథ:

భువన వంశానికి చెందిన రాజు రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్). దేశాలు తిరుగుతూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. తండ్రి మరణం తర్వాత ఇంటి చెంతనే ఉంటాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో మంచాన పడతాడు. నెలలు మాత్రమే అతను బతికుంటాడని డాక్టర్లు చెబుతారు. నిత్యం తాగుతూ పిచ్చి పట్టి రోజుకు ఒకలా ప్రవర్తిస్తుంటాడు. అందుకు కారణం చిన్నతనంలో చనిపోయిన రామప్ప చిన్న కుమారుడు కుసుమప్ప. అతను తనకు పుట్టిన వాడా? కాదా? అన్నది రామప్ప అనుమానం. ఇదే విషయాన్ని అతని స్నేహితుడు డాక్టర్ ఆచారితో (వికాస్ ముప్పాల) చెబుతూ ఉంటాడు. అయినా నమ్మకుండా అనుమానం.. పెనుభూతం అన్నట్లు అదే ఆలోచనతో జీవనం సాగిస్తుంటాడు. రావు బహదూర్ అనుమానం నిజమేనా? కుసుమప్ప చనిపోవడానికి కారణం ఏంటి? అసలు ఈ కథలోకి రేణుక (దీపా థామస్) ఎలా వచ్చింది? ఫైనల్ గా ఎలా ముగిసింది అన్నది కథ.



విశ్లేషణ

1960-90 సమయంలో ఓ రాజవంశంలో అనుమానం.. పెనుభూతం అన్న ఇతివృత్తంతో ఈ కథ సాగుతుంది. రాజుల కుటుంబీకుల ఫోటో ఫ్రేమ్ నుంచి ఓ పిల్లాడు వేగంగా పరిగెత్తే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత కాసేపటికి రావు బహదూర్ పాత్ర ఎంటర్ అవుతుంది. ఇంతకీ అతను ఎవరు? అతని గతం ఏంటి? అలా మంచాన పడటానికి కారణం ఏంటి? అన్నది ఒక్కొక్కటిగా రివీల్ చేశారు దర్శకుడు. ఇందులో రామప్ప ఏజ్ లో ఉన్న కథ, చావుతో కొట్టుమిట్టాడుతున్న కథ రెండు తెరపై నడుస్తుంటాయి. కథ ప్రారంభమే గందరగోళంగా ఉంటుంది. అసలు కథలోకి వెళ్లడానికి దాదాపు 40 నిమిషాల సమయం పట్టింది. ఫస్టాఫ్ మొత్తంలో చెప్పుకోదగ్గ విషయం ఏదన్నా ఉందీ అంటే సత్యదేవ్ నటన మాత్రమే. మిగతాదంతా ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్ చేసేస్తుంది. ఇక సెకండాఫ్ కాస్త ట్రాక్ లోకి వస్తుంది. ఇంటర్వెల్ తర్వాతే దర్శకుడు చెప్పాలనుకున్న విషయంపై ఓ క్లారిటీ వస్తుంది. అప్పటి వరకూ ప్రేక్షకుడికి తెరపై ఏం జరుగుతుందన్నది అగమ్యగోచరంగా ఉంటుంది. కథలో ఏదో విషయం ఉంది అనిపిస్తుంది కానీ దానిని ప్రేక్షకుడికి రీచ్ అయ్యేలా చేయలేకపోయారు. ఉన్నదానిలో సెకెండాఫ్ కాస్త ఫర్వాలేదు. కథలోని సెటైర్స్ అక్కడక్కడా నవ్వించాయి. ఫైనల్ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఎంచుకున్న కథ కొత్తదైనా.. రొటీన్ లైన్ అయినా దాన్ని తెరపై ఎంత ఆసక్తికరంగా చూపించామనేది ముఖ్యం. ఇక్కడ దర్శకుడు తీసుకున్నది మంచి పాయింటే అయినా తెరపైకి వచ్చేసరికి గజిబిజి అయిపోయింది. ట్విస్ట్ లు ఇచ్చేసి కథను నడపడం ఈ రోజుల్లో అంత ఈజీ కాదు. ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ బాగా ఉన్నా.. వావ్ అనే ఇంఫాక్ట్ చూపించలేకపోయింది. ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ మహా ఆ చిత్రంలో మైంటైన్ చేసిన సస్పెన్స్, సెన్సిబిలిటీస్ ఈ చిత్రంలో మిస్ చేశాడు.  

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు…
ఈ చిత్రానికి సంబంధించి గుర్తించుకునే విషయం ఏదైనా ఉందంటే అది సత్యదేవ్ నటనే. రావు బహదూర్ గా భిన్నమైన షేడ్స్ లో అలరించాడు. అతనికి ఎలాంటి పాత్ర ఇచ్చినా మెప్పించగలడని మరోసారి నిరూపించాడు. సత్యదేవ్ కి స్నేహితుడు, డాక్టర్ గా నటించిన వికాస్ ముప్పాల ఫర్వాలేదనిపించారు. హీరోయిన్ గా దీపా థామస్ కనిపించింది కాసేపే అయిన నటన, కళ్లతో పలికించే హావభావాలు ఆకట్టుకున్నాయి. దర్శకుడు వెంకటేశ్ మహా కాసేపు తెరపై మెరిశారు. ఆ పాత్రతో మెప్పించారు. ఇతర పాత్రధారులంతా కొత్తవారే. పాత్రల పరిథి మేరకు బాగానే చేశారు. సినిమా ఎక్కువ శాతం ఒకే ఇంట్లో జరిగింది. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్మరణ్ సాయి సంగీతం కూడా ఓకె. ఇక నిడివి కాస్త ఎక్కువే అనిపించింది. దర్శకుడే ఎడిటర్ కావడంతో తన ప్రొడక్ట్ మీద ప్రేమతో నిడివి విషయంలో కాంప్రమైజ్ కాలేక పోయాడనిపిస్తుంది. ఫస్టాఫ్ ఎప్పుడు అవుతుందా అనిపిస్తుంది. సినిమాలో సెట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కథను చెప్పే విషయంలో గందరగోళం ఏర్పడటంతో సినిమా సోసో అనే భావన కలుగుతుంది.

ట్యాగ్ లైన్: సత్యదేవ్ ఒన్ మేన్ షో


రేటింగ్: 2.5/5

ఇది కూడా చదవండి:

Nagabandham Review: నాగ‌బంధం.. సినిమా రివ్యూ


Updated Date - Jul 03 , 2026 | 05:12 PM