ఫ్యామిలీ ప్యాక్ టీజర్.. గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు

ABN , Publish Date - Nov 23 , 2026 | 07:09 PM

‘సామజవరగమన’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు రామ్ అబ్బరాజు, శ్రీ విష్ణు కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్’. తాజాగా ఈ మూవీ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Family Pack Teaser

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu) తనకు బాగా సూటయ్యే వినోదాత్మక కథలను ఎంచుకుంటూ, తనదైన కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన మరో హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘సామజవరగమన’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు రామ్ అబ్బరాజు (Ram Abbaraju), శ్రీ విష్ణు కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్’ (Family Pack). ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ విష్ణు సరసన సాక్షి మధోల్కర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 14 జనవరి, 2027న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా మేకర్స్ విడుదల చేసిన 1 నిమిషం 48 సెకన్ల టీజర్ ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఈ టీజర్ ఎలా ఉందంటే.. (Family Pack Teaser Review)


పోలీస్ జీపులో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ ఎస్సై గెటప్‌లో శ్రీ విష్ణు ఎంట్రీతో టీజర్ సరదాగా మొదలైంది. ‘ఒకే ఇంట్లో బంజారా హిల్స్, బోరబండ ఉంటే ఎలా ఉంటుందో.. అలా ఉంటుంది మా ఇల్లు’ అంటూ నరేష్ చెప్పే డైలాగ్‌తో కథలోని అసలైన కాన్ఫ్లిక్ట్‌ను రివీల్ చేశారు. ఒకవైపు బంజారా హిల్స్ రేంజ్ లైఫ్ స్టైల్, మరోవైపు బోరబండ తరహా మాస్ ఫ్యామిలీ.. ఒకే ఇంట్లో ఉంటే జరిగే గందరగోళం కడుపుబ్బా నవ్వించేలా ఉంది. ఇక టీజర్‌లో శ్రీ విష్ణు పలికిన పంచ్ డైలాగులు హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరోయిన్ సాక్షి మధోల్కర్‌ను చూసి చెప్పే డైలాగ్స్.., అలాగే 2 నుంచి 3 గంటలు పడుతుందని చెప్పిన స్కెచ్ ఆర్టిస్టుతో ‘180 నిమిషాల్లో ఫినిష్ చేయడానికి ట్రై చేయండి’ అని శ్రీ విష్ణు చేసే అమాయకపు కామెడీ థియేటర్లలో విజిల్స్ వేయించడం ఖాయం. సీనియర్ నటుడు నరేశ్ డైనింగ్ టేబుల్ వద్ద ‘ఫాస్ట్‌గా తినాలనే కదండీ ఇంగ్లీష్ వాళ్లు దాన్ని బ్రేక్‌ఫాస్ట్ అన్నారు’ అంటూ వేసిన పంచ్ అదిరిపోయింది.


దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి తన మార్క్ క్లీన్ అండ్ హిలేరియస్ ఫ్యామిలీ కామెడీని సిద్ధం చేసినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. భాను భోగవరపు, నందు సవిరిగాన రచన, జె. యువరాజ్ కలర్‌ఫుల్ విజువల్స్, చైతన్ భరద్వాజ్ ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రాణం పోశాయి. ఇక టీజర్ చివర్లో పోలీస్ స్టేషన్‌లో రైటర్‌తో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘‘గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు రోయ్! ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు రాయండి.. ఫన్ ఉండాలి, జోష్ ఉండాలి, కిక్కుండాలి’’ అంటూ వేసిన సెటైరికల్ పంచ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మొత్తం మీద సంక్రాంతి పండుగకు పక్కా ‘ఫ్యామిలీ ప్యాక్’ వినోదం గ్యారెంటీ అని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

లైన్‌లోకి వచ్చిన ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. రిలీజ్ ఎప్పుడంటే

భారత్ - పాక్ సైనికులతో.. ‘ది ఇండియన్ బార్డర్’ పోస్టర్ వైరల్

ఆ దర్శకుడితో ఫహాద్ ఫాజిల్ క్రేజీ ప్రాజెక్ట్.. బిగ్ సర్‌ప్రైజ్ ఎప్పుడంటే

Updated Date - Nov 23 , 2026 | 07:09 PM

Sree Vishnu : ఆసక్తికరంగా 'కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్

Sree Vishnu New Movie Song: సిరాకైంది సింగిల్‌ బతుకు

Sree Vishnu: ఐటెమ్‌ ఫిక్స్‌ అయినట్టేనా..

Sree Vishnu: కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు ఇలాంటి చిన్నచిన్నవి సహజం

Sree Vishnu: మరోసారి 'సామజవర గమన' జోడీ!