Sobhan Babu: సిద్ధూ జొన్నలగడ్డకు శోభన్ బాబు జయంతి పురస్కారం
ABN, Publish Date - Jan 14 , 2026 | 04:30 PM
శోభన్ బాబు జయంతిని ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఇకపై ప్రతి యేడాది 'సోగ్గాడు' శోభన్ బాబు పేరుతో ఓ గ్లామర్ స్టార్ట్ ఇస్తామని, తొలి అవార్డుకు సిద్ధు జొన్నలగడ్డను ఎంపిక చేశామని అన్నారు.
అందాల నటుడు, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటభూషణ్ శోభన్ బాబు (Sobhan Babu) 90వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం గోదావరి బండ్ రోడ్ లోని శోభన్ బాబు విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సేవా సమితి గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ, సలహాదారు బళ్ళా శ్రీనివాసరావు, సేవా సమితి అధ్యక్షులు కొనగళ్ళ శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, బట్టిప్రోలు శ్రీనివాస్ (భీమవరం), సోగ్గాడు ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ 'తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణ కు మారుపేరుగా నిలిచి ఎందరికో ఆదర్శప్రాయులై, ప్రేక్షకుల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు శోభన్ బాబు అని, ఆయన జ్ఞాపకార్ధం ప్రతీ ఏటా జయంతి నాడు, వర్ధంతి నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ'ని తెలిపారు. ఈ ఏడాది నుండి 'సోగ్గాడు' శోభన్ బాబు అవార్డును గ్లామర్ హీరోకి ఇవ్వడానికి నిర్ణయించామని తొలి అవార్డును శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని హీరో సిద్దూ జొన్నలగడ్డ కు ఇస్తున్నామని తెలిపారు. త్వరలో శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే వేడుకలో ఈ అవార్డ్ ను ప్రదానం చేయనున్నట్లు అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి గౌరవ చైర్మన్ రాశీ మూవీస్ నరసింహారావు వెల్లడించారు.
అనంతరం వైజాగ్ త్రినాథ్, విజయభాస్కర్ రూపొందించిన శోభన్ బాబు 90 సంవత్సరాల జన్మదిన కానుక పుస్తకాలను ఆవిష్కరించారు. శోభన్ బాబు సేవా సమితి సభ్యులు ఆకుల సూర్యప్రకాశరావు (ధవళేశ్వరం) తుంటి ఆపరేషన్ నిమిత్తం 5000/- లు ఆర్థిక సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కె. ఆనంద్, ఎ. అన్నవరం, పేపర్ మిల్లు శర్మ, డాక్టర్ న్యూటన్, కె.ఎస్. ప్రకాశరావు, డి. శ్రీనివాస్, జి. సింహాచలం, ఎం మల్లికార్జున రావు, ఎన్వీవీ సత్యనారాయణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తణుకు, భీమవరం, కాకినాడ అభిమానులతో పాటు అనేక మంది పాల్గొన్నారు.