వైవిధ్య చిత్రాల రూపశిల్పి... సింగీతం!
ABN, Publish Date - Oct 04 , 2026 | 12:34 AM
ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా కథలు, గీత రచన, సంగీతం కూడా సమకూర్చారు. కొన్ని సినిమాలలో నటించారు.
తెలుగు సినిమా రంగం ఓ దిగ్గజ దర్శకుడిని కోల్పోయింది. కేవలం తెలుగు సినిమా రంగమే కాదు భారతీయ సినిమా రంగానికే సింగీతం మృతి తీరని లోటు. తెలుగుతో పాటు ఆయన కన్నడ, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో సినిమాలను తెరకెక్కించారు. ప్రయోగాత్మక చిత్రం అంటే చాలు సింగీతం శ్రీనివాసరావుకు ప్రాణం లేచొస్తుంది. ఆయన సినిమా తీయాలని భావించిన తర్వాత అందులో నటించేది పెద్ద తారాల చిన్న తారలా అనేది చూడరు. కథకు తగ్గ నటీనటులు ఎంపిక చేసుకుని సినిమా మొదలు పెట్టేస్తారు. అందుకే ఆయన దర్శకత్వంలో కొత్త కొత్త నటులు, కొత్తగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వారు నటించి గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. అందులో కమల్ హాసన్ ప్రత్యేకమైన వ్యక్తి. కమల్ తో కలిసి సింగీతం చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. 'సొమ్మొకడిది సోకొకడిది' వంటి సరదా చిత్రాలే కాదు... 'అమావాస్య చంద్రుడు', 'పుష్పక విమానం', 'అపూర్వ సోదరులు', 'మైఖేల్ మదన కామరాజు', 'ముంబై ఎక్స్ ప్రెస్' చిత్రాలు రూపొందించారు. సింగీతం శ్రీనివాసరావు సాంఘిక, జానపద, పౌరాణిక, సోషియో ఫాంటసీ, యానిమేషన్ మూవీస్ తీశారు. ఆయన ఆంగ్లంలో తీసిన 'సన్ ఆఫ్ అల్లాద్దిన్', హిందీలో తీసిన 'ఘటోత్కచ' యానిమేషన్ చిత్రాలు. అలానే ఆంగ్లంలో 'లిటిల్ జాన్' మూవీని రూపొందించారు. ఆయన 94 సంవత్సరాల వయసులో తెరకెక్కించిన 'సింగ్ గీతం' కూడా ప్రయోగాత్మక చిత్రమే. సినిమాలో చాలా భాగం ప్రధాన పాత్రలన్నీ పాటలతోనే సాగుతాయి. ఈ తెలుగు సినిమాను తమిళంలోనూ డబ్ చేసి విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించారు. నాగ అశ్విన్ నిర్మించారు.
అలానే సుధాచంద్రన్ నాయికగా ఆమె మీదనే 'మయూరి' బయోపిక్ ను సింగీతం తెరకెక్కించారు. ఆ సినిమా దర్శకుడిగా ఆయనకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అయితే సింగీతం తెరకెక్కించాలని భావించిన కొన్ని సినిమాలు సెట్స్ మీదనే ఆగిపోయాయి. ఆయన చిరంజీవితోనూ, పవన్ కళ్యాణ్‌తోనూ కూడా సినిమాలు ప్లాన్ చేశారు. చిరంజీవి సినిమా తొలి షెడ్యూల్ జరిగి ఆగిపోగా, పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో ఆగిపోయింది. ఎన్టీఆర్ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు, బాలకృష్ణతో మూడు చిత్రాలు రూపొందించారు. అలానే అక్కినేని నాగేశ్వరరావుతో పలు చిత్రాలు రూపొందించిన ఆయన నాగార్జున హీరోగా 'ఆకాశ వీధిలో' సినిమాను చేశారు. సింగీతం శ్రీనివాసరావు తొలి చిత్రం 'నీతి నిజాయితీ'లో కృష్ణంరాజు నటించారు. కృష్ణంరాజు తమ్ముడి కొడుకైన ప్రభాస్ 'కల్కి 2898 ఎ.డి.' సినిమాకు సింగీతం శ్రీనివాసరావు... దర్శకుడు నాగ అశ్విన్ కోరిక మేరకు టెక్నికల్ సపోర్ట్ ను అందించారు.
నటుడిగా, స్వరకర్తగా సింగీతం!
దర్శకుడి గొప్ప పేరు సంపాదించుకున్న సింగీతం శ్రీనివాసరావు నటుడిగానూ పలు చిత్రాలలో నటించారు. అందులో కొన్నింటిలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. ఆయన చివరిగా నటించిన సినిమా 2024లో వచ్చిన 'భలే ఉన్నాడే'. దీనికి ముందు 'కంచె'లో అతిథి పాత్ర పోషించారు. 'చిన్ని చిన్ని ఆశ, వరుడు, మైఖేల్ మదనకామరాజు, ఆంధ్రకేసరి, పంతులమ్మ' చిత్రాలలోనూ ఆయన తెరపై కనిపించారు. అలానే కన్నడ చిత్రాలు 'భాగ్యద లక్ష్మీ బారమ్మ', 'సంయుక్త' చిత్రాలకు ఆయన స్వర రచన చేశారు. ఇందులో 'భాగ్యద లక్ష్మీ బారమ్మ'కు ఆయనే నేపథ్య సంగీతమూ అందించారు. హిందీ చిత్రం 'ఘటోత్కచ'కు స్వరాలు సమకూర్చిన సింగీతం 'వెల్ కమ్ ఒబామా'కు సంగీతం సమకూర్చిన పాటలూ రాశారు.
ఇవి కూడా చదవండి:
చిత్రసీమలో తీవ్ర విషాదం: సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
భారతీయ సినిమాకు తీరని లోటు: నందమూరి బాలకృష్ణ